రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సుమారు ఎనిమిది నెలలు కావొస్తున్నా ఐటీ, పారిశ్రామిక రంగంలో నెలకొన్న స్థబ్దత వీడటం లేదు. సుమారు పదేళ్ల పాటు అప్పటి ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తారాజువ్వలా ఎగిసిన తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగం ఇప్పుడు కొడిగట్టిన దీపంలా మారడానికి కారణాలేమిటని మిషన్ తెలంగాణ ఆరా తీస్తే ఆసక్తిదాయకమైన విషయాలెన్నో తెలిశాయి. ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ తొలిభాగం మీకోసం:
ఆదిలోనే హంసపాదు!
డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా తలెత్తిన ప్రధాన ప్రశ్న కేటీఆర్ స్థానలో ఎవరు తెలంగాణకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కానున్నారని. శ్రీధర్ బాబును ఈ పదవికి ఎంపిక చేసినప్పుడు నిజానికి చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న శ్రీధర్ బాబు ఈ శాఖను సమర్ధవంతంగానే నిర్వహించగలడనే చాలా మంది నమ్మారు.
అనుకున్నట్టే ఆయన పదవీప్రమాణ స్వీకారం చేయగానే ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపి రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల రంగంలో గత ప్రభుత్వం చేసిన మంచిపని కొనసాగించాలని ఆదేశించారు.
మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇదే సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు కేటీఆర్ హయాంలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన కొన్ని పెట్టుబడులు జనవరిలో దావోస్ పర్యటనలో, ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సులో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారట. పాపం పెద్దగా రాజకీయాలు తెలియని శ్రీధర్ బాబు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవిలో వేశారట. ఇంకేముంది, వెంటనే తాను కూడా దావోస్ పర్యటనకు వస్తానని రేవంత్ రెడ్డి అనడంతో శ్రీధర్ బాబుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడిందట.
అలా అనూహ్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన రేవంత్ అక్కడ శ్రీధర్ బాబుకు అసలే క్రెడిట్ రాకుండా అంతా తానై వ్యవహరించడం అందరూ చూసారు. ఆ అంతర్జాతీయ వేదికపై ఇంగ్లీషు మంచిగా వచ్చిన శ్రీధర్ బాబును కాదని తత్తరపడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడటంతో సోషల్ మీడియాలో అనేక సెటైర్లు పడ్డాయి కూడా.
కేటీఆర్ ఉండగా ఐటీ, పరిశ్రమల శాఖలో ఒక్కో విభాగానికి డైరెక్టర్, సీఈవోలుగా కార్పొరేట్ సెక్టార్ నుండి అనుభవజ్ఞులను నియమించారు. మంత్రిగా కేటీఆర్ అంత సక్సెస్ అవడానికి ఒక ప్రధాన కారణం ఆయన సమకూర్చుకున్న సమర్ధవంతమైన టీమ్ కూడా. ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ కింద పనిచేయలేం అంటూ ఇందులో అత్యధికులు ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు.
వారి స్థానంలో కొత్తవారినైనా నియమించుకుందాం అంటే మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే రేవంత్ రెడ్డి కార్యాలయమే ఈ శాఖల్లో అన్ని నియామకాలూ చేస్తుంది అని అభిజ్ఞ వర్గాల భోగట్టా. టీ-శాట్ సీఈవోగా బీఆర్ఎస్ హయాంలో వెటరన్ జర్నలిస్ట్ శైలేశ్ రెడ్డి ఉండగా ఆయన స్థానలో రేవంత్ సర్కార్ పెద్దగా అనుభవం లేని బోధన్‌పల్లి వేణుగోపాల్ రెడ్డి అనే జర్నలిస్టును నియమించింది. అసలీ నియామకం జీవో వెలువడే దాకా మంత్రి శ్రీధర్ బాబుకు కనీసం సమాచారం లేకపోవడం గమనార్హం. అదే విధంగా వీ-హబ్, టీ-వర్క్స్ సీఈవోల నియామకం కూడా జరిగింది అని సమాచారం. ఆయితే వీళ్లెవరికీ ఆయారంగాలో పెద్దగా అనుభవం లేకపోవడం, దానికి తోడు శ్రీధర్ బాబుకు తెలియకుండానే వీరి నియామకం జరగడం వల్ల ఈ సంస్థల్లో పెద్దగా యాక్టివిటీస్ ఏమీ జరగడం లేవు.
ఆఖరికి డైరెక్టర్ డిజిటల్ మీడియా పొజిషన్‌లో ఇదివరకు పనిచేసిన దిలీప్ కొణతం స్థానంలో కూడా రేవంత్ కార్యాలయమే పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అనే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎన్నారైని సెలెక్ట్ చేసి పంపిందట. ఎప్పటి నుండో కాంగ్రెస్ నుండి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సదరు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక రేవంత్ రెడ్డిని కలిసి ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇవ్వమని అభ్యర్ధిస్తే ఆయనకు ఈ డైరెక్టర్ డిజిటల్ మీడియా పదవి ఇవ్వజూపారని తెలిసింది. ఇది తెలుసుకున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాకు తెలియకుండా నా శాఖలో ఈ వరుస నియామకాలు ఏమిటి అని అగ్గి మీద గుగ్గిలం అయితే పోలీస్ చంద్రశేఖర్ రెడ్డికి ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపారని సచివాలయంలో వార్తలు గుప్పుమన్నాయి.
శ్రీధర్ బాబుకు తన మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఫ్రీ హ్యాండ్ లేకపోవడమే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎనిమిది నెలలు కావస్తున్నా ఐటీ, పరిశ్రమల రంగంలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడానికి ప్రధాన కారణం అని ప్రజలు అనుకుంటున్నారు.