mt_logo

వాటర్ గ్రిడ్ కోసం భూసేకరణ వేగవంతం చేయండి– కేటీఆర్

సోమవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అధికారులతో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని, రైల్వేలు, ప్రైవేటు భూములు, అటవీభూముల సేకరణపై దృష్టి సారించాలని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాల్లో టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో వినియోగించనున్న పైపులైన్ల విషయంలో నాణ్యత పాటించాలని, అవసరమైతే అందుకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకానికి సాయం అందించేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని, ఏప్రిల్ మొదటి వారంలో ఆయా సంస్థలతో చర్చలు జరపబోతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, ఆ నిధులను ఎప్పటికప్పుడు వినియోగించాలని చెప్పారు. లైన్ సర్వే కూడా పూర్తయినందున సాధ్యమైనంత త్వరగా సెగ్మెంట్ల వారీగా డీపీఆర్ లను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *