mt_logo

సమైక్యంలోనే చీకట్లు.. స్వరాష్ట్రంలో వెలుగులు..

మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి, సంగారెడ్డి మండలం కంది, కొండాపూర్ మండలం గొల్లపల్లిలో మంత్రి హరీష్ రావు సోమవారం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విడిపోతే తెలంగాణకు కరెంట్ సమస్య వస్తుందని, ప్రజలకు చీకట్లు తప్పవని, ఇబ్బందులు పడతారని గతంలో చంద్రబాబు చెప్పారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. కరెంట్ కోతలు లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారని, సమైక్య రాష్ట్రంలో వేసవిలో చీకట్లలో గడిపిన ప్రజలు ఇప్పడు విద్యుత్ వెలుగులు చూస్తున్నారని, వచ్చే సంవత్సరం నుండి కరెంట్ పోయే సమస్యే ఉండదని హరీష్ స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసిన విద్యుత్ కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండవని, రాష్ట్రం విడిపోకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు వంటి నేతలు కరెంట్ కష్టాలు తప్పవని ప్రజలను తప్పుదారి పట్టించారన్న విషయం ఇప్పుడు తేలిపోయిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి నిధుల కోసం మంత్రి జానారెడ్డి ఇంటివద్ద ప్రదక్షిణలు చేశామని, బతిమాలితే రూ. 50 లక్షలు ఇస్తే గొప్పగా మురిసిపోయామని, కోటి రూపాయలు ఇస్తే దండం పెట్టివచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నారని, రోడ్ల మరమ్మతు, వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ తదితర అంశాలతో పాటు వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు.

గతంలో చెరువుల పనులు చేపట్టామని లెక్కలు వేసి కోట్లాది రూపాయలు దిగమింగారని, వందల ఏండ్ల కిందట కాకతీయులు తవ్వించిన చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, తెలంగాణపై వివక్ష చూపారనడడానికి ఇదే నిదర్శనమన్నారు. చెరువుల పునరుద్ధరణలో అవినీతి, అక్రమాలకు తావులేదని, నాణ్యత లోపిస్తే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ ఎస్ఈ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *