
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయిలోనే కాదు.. జిల్లాస్థాయిల్లో కూడా దిగజారిపోతున్నది. బీఆర్ఎస్‌ను గద్దె దించుతాం.. మహామహులను ఓడిస్తామంటూ బీరాలు పోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్, ఇతర సీనియర్ నాయకులు స్థానిక లీడర్లనే కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టి ఆ పార్టీ తలనొప్పిని కొని తెచ్చుకొన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్కో సీటుకు ముగ్గురు, నలుగురు దరఖాస్తు చేసుకోవడమే కాదు.. ఆ సీటుకోసం ఒకరి కాళ్లు మరొకరు లాగుతూ జనం దృష్టిలో చులకనైపోతున్నారు. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో హస్తం నేతల ఎత్తుకు పైఎత్తులే ప్రత్యక్ష నిదర్శనం
పోటీకీ నలుగురూ సై.. ఎవరూ తగ్గడంలే!
సిరిసిల్ల నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు కేకే మహేందర్‌రెడ్డి, చీటి ఉమేశ్‌రావు, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణగౌడ్ దరఖాస్తు చేసుకొన్నారు. ఆ జిల్లాలో ఆయా నాయకుల వర్గాలు ఇప్పటికే రంగంలోకి దిగి, తమ నాయకుడికే టికెట్ వస్తుందంటూ ఊదరగొడుతున్నారు. కేకే, ఉమేశ్‌రావు వర్గాలు ఒక అడుగు ముందుకేసి.. ఇటీవలే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే కయ్యానికి కాలుదువ్వాయి. ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఇప్పుడు వీరికి సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణగౌడ్ తోడయ్యారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అండతో తనకే టికెట్ వస్తుందని సంగీతం శ్రీనివాస్ ప్రచారం చేసుకొంటుండగా.. పార్టీలో ఆదినుంచీ ఉన్న బీసీ నాయకుడినని.. తన వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆశీస్సులతో తనకు టికెట్ ఖాయమని సత్యనారాయణగౌడ్ ఊదరగొడుతున్నారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై ఇప్పటికే అన్ని ఎన్నికల్లోనూ కేకే ఓటమిపాలయ్యారు. అందుకే ఈసారి తనకు టికెట్ ఇస్తే తన ప్రతాపం చూపుతానంటూ ఉమేశ్‌రావు ఊదరగొడుతున్నారు. ఇదిలా ఉండగా. టికెట్ ఎవరికి వస్తుందో ఇప్పటికీ తేల్చుకోలేని కాంగ్రెస్ పార్టీకి తాము ఓటెలా వేస్తామని సిరిసిల్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టికెట్ రాకముందే తన్నుకున్న నేతలు.. గెలిస్తే సమన్వయంగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎలా బాటల వేస్తారని నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో అనేక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల గోసను పట్టించుకోలేదని, మంత్రి కేటీఆర్ వల్లే తమ బాధలు తీరాయాని అంటున్నారు. హస్తం పార్టీని నమ్మి మళ్లీ మోసపోబోమని, అభివృద్ధి ప్రదాత కేటీఆర్ వెంటే నడుస్తామని స్పష్టంచేస్తున్నారు.