mt_logo

మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెరలేపారు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అన్నట్టుగా ఉంది. ఎన్నికల ముందు ప్రజలను నమ్మబలికి మోసం చేశారు. ఆకలి అవుతుంది అంటే ఆరు నెలలు ఆగండి అన్నట్టు ఉంది ఈ ప్రభుత్వ తీరు అని విమర్శించారు.

రైతాంగాన్ని నట్టేట ముంచే పని చేస్తున్నారు.. ఈ పాటికే రైతుబంధు పడాల్సింది. రేవంత్ ప్రభుత్వం వచ్చి మూడు సీజన్లు అవుతోంది. రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగా ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు.

రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్‌లైన్ పెట్టారు. అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుంది.. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా? రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు అని అడిగారు.

68.90 లక్షల మందికి 1.52 కోట్ల ఎకరాలకు 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ హయాంలో రైతు బంధు కింద ఇచ్చాము. 2,603 క్లస్టర్‌లు రాష్ట్రంలో ఉన్నాయి.. ప్రతి క్లస్టర్‌లో 5 వేల ఎకరాలు ఉంటాయి.. డాటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది . రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమే అని నిరంజన్ రెడ్డి అన్నారు.

ఈ ఆధునిక యుగంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం ఓ గంట పని. ఎక్కడైనా ఒక్కటో ఆరో పొరపాట్లు జరిగితే సవరించుకోవడం పెద్ద పని కాదు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెరలేపారు అని ధ్వజమెత్తారు.

రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలి.. రెవెన్యూ రికార్డులు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి.. వాటి ప్రకారం ఇవ్వాలి. రైతు బంధు గుట్టలున్న చోట ఇచ్చారని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అని అన్నారు.

కేసీఆర్ హయాంలో 4.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి వెచ్చించాం. కేసీఆర్ తీసుకున్న చర్యలతో రైతాంగం బాగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. సాకులు చెప్పి రైతులకు సాయాన్ని ఎగ్గొట్టే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపుతోంది అని అన్నారు.

25 ఎకరాలకు పై బడి ఉన్న రైతులు 6,500 మందికి మించి లేరు.. ఒక్క ఎకరా కూడా పడావుగా ఉండకూడదనే తపనతో కేసీఆర్ ఆనాడు కేసీఆర్ రైతు బంధు ప్రవేశ పెట్టారు. తెలంగాణలో ప్రతి ఇంచి భూమి సాగుకు అనువైనదే. అప్పుడు ఏడాదిలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు.. ఇప్పుడు ఒక్కసారి కూడా సరిగా ఇవ్వడం లేదు అని ఎత్తి చూపారు.

సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో కూడా నకిలీ విత్తనాల దందా వెలుగులోకి వచ్చింది. కాలయాపన చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా మారింది. కేసీఆర్ హయాంలో రుణమాఫీ కాకుండా మిగిలింది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రంలో ఐదెకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య 92 శాతం అని నిరంజన్ రెడ్డి అన్నారు.

ఐదెకరాల లోపు ఉన్న రైతుకు లక్ష రూపాయలకు మించి పంట రుణం ఏ బ్యాంకు ఇవ్వదు. 2 లక్షల రూపాయల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయో వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.

రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.. డిసెంబర్ 9 న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కాబినెట్‌లో చర్చిస్తారా.. కేసీఆర్‌ను గుడ్డిగా వ్యతిరేకించడమే కొందరి పనిగా మారింది అని అన్నారు.