mt_logo

బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు: నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుంది.. అది ఇవ్వకపోగా కనీసం నీళ్లను కూడా ఎందుకు ఎత్తిపోస్తలేరు అని అడిగారు.

కేసీఆర్ గారు గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెంలలో 3 చొప్పున పంపులు సిద్దంగా ఉన్నాయి.. దాదాపు 30 టీఎంసీల నీరు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం కేసీఆర్ గారి పాలన మీద విషం చిమ్మడానికే ప్రయత్నిస్తున్నారు అని దుయ్యబట్టారు.

మొన్నటిదాకా కాళేశ్వరం విఫలప్రయత్నం అన్నారు.. దాని నుండే ఇప్పుడు నీళ్లు తీసుకువస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టుకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం మూలంగానే పాలమూరు నష్టపోయింది అని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పాలమూరు మీద కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదని ప్రచారం చేశారు.. అదే కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి మొదలుపెడితే కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అడ్డుకున్నారు అని అన్నారు.

కేసుల మూలంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముందుగా పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలు పూర్తి చేశాం. కాలువల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఉన్న దానిని వినియోగించుకోకుండా కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ముందు పెట్టాడు అని తెలిపారు.

నాలుగు పంప్ హౌస్‌లు.. ఐదు రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినా వాటిని వినియోగించుకునే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కేఎల్ఐ పథకంలో కేవలం 3.9 టీఎంసీల నీళ్ల నిల్వకే కాంగ్రెస్ పరిమితం అయింది అని అన్నారు.

కేసీఆర్ హయాంలో దాదాపు 60 టీఎంసీల నీటి నిల్వకు పాలమూరులో రిజర్వాయర్లు సిద్ధం చేశాం. 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం నిండి అలుగు పారుతుంది.. 300 పైచిలుకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అలుగెల్లి పారుతుంది. వట్టెం రిజర్వాయర్ వరకు నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంది.. నార్లాపూర్, ఏదుల, వట్టెం వరకు నీళ్లు తీసుకురావడానికి చిన్న చిన్న అవాంతారాలు ఉన్నాయి. నార్లాపూర్‌లో నీళ్లు నింపుకుంటే కనీసం మంచినీటి కోసం వాడుకోవచ్చు.. దీనికి ఎండాకాలంలో కర్ణాటక మీద ఆధారపడే బాధ ఉండదు. కేఎల్ఐ పథకం కింద ఉన్న ఐదు పంపులు ఒకేసారి నడిపే అవకాశం లేకుండా కాలువల సామర్ధ్యం తగ్గించి ఉమ్మడి రాష్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు దీనికి తీరని ద్రోహం చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే అక్కడ నీళ్లు తోడి కేఎల్ఐ పంపుల నుండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్ హౌస్‌లోని ఒక మోటర్ నుండి నీళ్లు ఎత్తి నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఈ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, నీటి పారుదల శాఖ మంత్రి గానీ, జిల్లా మంత్రిగానీ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు.. నీళ్లను వాడుకోవాలన్న ఆలోచన వీరికి లేదు. ఎనిమిది నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో కనీసం తట్టెడు మట్టి ఎత్తలేదు అని విమర్శించారు.

పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అమెరికా అందాలను చూసి ఆనందిస్తున్నాడు. నీళ్ల కోసం పాలమూరు ఎంత తండ్లాడిందో.. ఎన్ని జీవితాలనో కోల్పోయిందో వీరికి తెలుసా.. వీరా పాలమూరు బతుకులను మార్చేది అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

రాజకీయ కక్ష్యలను పక్కనపెట్టి ప్రభుత్వం స్సందించాలి.. వట్టెం వరకు నీళ్లు నింపుకునే అవకాశం ఉంది.. ఆ విషయంలో ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలి. కేఎల్ఐ పథకంలో అయిదు పంపులు ప్రారంభించాలి.. ఎక్కువ వచ్చిన నీళ్లను నార్లాపూర్‌లో నింపాలి.. అన్నింటిని వట్టెం వరకు తరలించాలి అని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.. ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నాం.. పుష్కలంగా నీళ్లున్న ప్రస్తుత పరిస్థితులలో రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి రావద్దు. రోజుకు 30 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు అని అన్నారు.