mt_logo

ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం: నిరంజన్ రెడ్డి

అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని.. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

రూ.2 లక్షల రుణమాఫీపై రైతాంగాన్ని మభ్యపెట్టడాన్ని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు.. రూ. 6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా అని ప్రశ్నించారు.

ఈరోజు లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ.. రూ. 2 లక్షలు మాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారు. యాసంగి రైతుబంధులోనే రూ. 2 వేల కోట్లు ఎగ్గొట్టారు.. రైతుభరోసా ప్రకారం చూస్తే రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టారు అని విమర్శించారు.

వానాకాలం రైతుభరోసా ఊసే లేదు.. కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ. 7,500 చొప్పున రూ. 10 వేల కోట్లు ఎగ్గొట్టారు. రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ. 6 వేల కోట్లు ఇచ్చారు.. 10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారు అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ. 2,500 చొప్పున బాకీ పడింది.. దీని అమలుకు ఏడాదికి రూ. 41,700 కోట్లు కావాలి. 40 లక్షల మంది ఫించనుదారులు, దివ్యాంగులకు ఏడు నెలలుగా నెలకు రూ. 2 వేల చొప్పున బాకీ పడింది. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ. 4 వేల చొప్పున బాకీపడింది అని అన్నారు.

రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నారు.. వారికి రూ. 15 వేల చొప్పున రూ. 975 కోట్లు బాకీపడింది. రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని చెప్పింది.. రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారు.. ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6,240 కోట్లు బాకీపడింది అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు

కోటి 30 లక్షల టన్నులకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ. 6,500 కోట్లు బోనస్ ఎగ్గొట్టారు.. సేకరించిన ధాన్యానికి కూడా రూ. 500 బోనస్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకుంటున్నారు.. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ. లక్ష వరకు బాకీపడింది అని అన్నారు.