mt_logo

పుట్టింది కాదు.. పెట్టుడు ఉద్యమం


-సమైక్యవాదానికి ప్రజల నుంచి స్పందన కరువు
-విజయవాడలో నేతలకే పరిమితమైన ఉద్యమం

(విజయవాడ, టీ మీడియా ప్రతినిధి):ఒక నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం కావటం అంటే? ఎలాంటి పిలుపు లేకుండానే.. ఎవరూ కదిలించకుండానే.. ఎక్కడెక్కడి నుంచో ఎవవరో ఒక్క చోటకు చేరి నిరసన ప్రకటించడం! వందల గొంతులు.. ఒక్కుమ్మడిగా నినదించడం! కానీ.. సీమాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న సమైక్యవాద ఆందోళనలు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి! సాధారణ జనానికి పట్టని విభజన సమస్య.. నేతలనే వేధిస్తున్నట్లుంది! గుప్పెడు మంది పెట్టుబడిదారుల అనుయాయులు.. రోడ్లపైకి వచ్చి.. సమైక్యవాదానికి తమ నేతలు హీరోలని చాటింపు వేసే యత్నం ప్రస్ఫుటమవుతున్నది! తద్వారా తమ భవిష్యత్ రాజకీయాలకు బాటలు తీసుకునే యోచన బహిర్గతమవుతున్నది. సీమాంధ్రలో అక్కడక్కడ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ.. అవి జరుగుతున్న తీరే సందేహాస్పదమవుతున్నది. తెలుగు జాతిగా రెండు రాష్ట్రాలు కలిసుండాల్సిన సమయంలో.. ఆ వాతావరణాన్ని చెడగొట్టాలన్న స్వార్థబుద్ధి బయటపడుతున్నది.

డ్రిల్ మాస్టర్ విజిలేస్తే.. స్కూలు అసెంబ్లీకి లైన్‌లో వచ్చినట్లు.. యూనిఫారాల్లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు! తాము చేస్తున్న నినాదాలకు పొంతనలేని హావభావాలు! పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం చనిపోయారని, ఆంధ్రప్రపదేశ్ కోసంకాదని కూడా తెలియని రీతిలో.. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు దండలు! ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామంటూ జోహార్లు! విచిత్రమే!! కొన్ని చోట్ల ఈమాత్రం కూడా లేదు. పాతిక మందో ముప్ఫై మందో ఒక పార్టీ కార్యకర్తలు.. అందులోనూ ఎవరివర్గం వారిదే.. ఎవరి ఆందోళనవారిదే! విభజనను వ్యతిరేకిస్తూ వేరు ఆందోళనలు! ఎలక్ట్రానిక్ చానళ్లలో లైవ్ ప్రసారాలు చేసే నాలుగైదు ఓబీ వ్యాన్లు.. ఓ యాభై మంది విలేకరులు..అంతే సంఖ్యలో పోలీసులు! పెద్ద గుంపు పోగుపడిపోయినట్లు చానల్‌లో ప్రసారం! సమైక్యవాదం కోసం గొంతు చించుకునే ఓ నేత! కెమెరాలు ఆగిపోతే.. అంతా నిశ్శబ్దం! ప్రత్యక్షసాక్ష్యం విజయవాడలోని ఒక ఆందోళన! సమైక్యం కోరుతున్న ఏపీ ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చినా.. స్పందన కరువు! యథావిధిగా సాగిపోయి జనజీవనం! సాధారణంగా బంద్ అంటే పొద్దున్న బస్సులు నడవవు.

బంద్ తీరును బట్టి మెల్లగా ఒక్కో బస్సు రోడ్డెక్కుతుంది! కానీ.. విజయవాడ బంద్‌లో ఉదయం నుంచే సిటీ బస్సులు నడిచాయి. వాహనాల మామూలుగానే తిరిగాయి. వాటికి అవసరమైన ఇంధనాన్ని అందించే పెట్రోల్ బంకులు తెరిచే ఉన్నాయి. ప్రధానంగా వాణిజ్య కేంద్రమైన విజయవాడలో.. ఉదయం పాక్షికంగా మూతపడిన వ్యాపార సంస్థలు.. దుకాణాలు.. మధ్యాహ్నం నుంచే జోరుగా వ్యాపారాలు చేసుకున్నాయి! కానీ.. కొందరు రాజకీయ నేతలు హడావుడి.. ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహం! విజయవాడ బంద్‌లో ఇదే చిత్రం! సమైక్యవాదానికి వీర ప్రతినిధులమని చెప్పుకుంటున్న విజయవాడలోనే కేవలం మూడే గ్రూపులు బంద్‌లో పాల్గొన్నాయి! ఒకటి ఏపీఎన్జీవోలైతే.. మరోటి రాజకీయాల్లో స్థిరపడాలని భావిస్తున్న దేవినేని అవినాష్ (దేవినేని నెహ్రూ కుమారుడు) నాయకత్వంలో విదార్థులు! ఇంకొకటి విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేందర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాజేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నర్సింహారావుల నేతృత్వంలో! అవినాష్ అధ్వర్యంలో స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు బెంజిసర్కిల్ సెంటర్‌లో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే.. యథావిధిగా రోడ్లపై సాగిపోయిన ఆర్టీసీ బస్సులు.. బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో ఆందోళన! ఇక్కడ రెండు గ్రూపులు కలిసి ధర్నాకు దిగితే అక్కడ టీవీ చానళ్లకు చెందిన 8 ఓబీ వ్యాన్లు కనిపించాయి.

మా చానల్‌తో మాట్లాడండి అంటే కాదు.. ముందు మా చానళ్లతో మాట్లాడండి అంటూ పోటీలు పడి మరీ నేతలను వెంటపడి మరీ తీసుకెళ్లిన చానళ్ల విలేకరుల హడావుడి! ఆందోళనకు దిగిన నాయకుల చిత్తశుద్ధిని వెల్లడిస్తున్నది! రాష్ట్ర విభజనను అడ్డుకోలేరా? అని ఒక మీడియా మిత్రుడు సదరు కాంగ్రెస్ నాయకుడిని ప్రశ్నిస్తే.. ‘లగడపాటి మరో పొట్టి శ్రీరాములు అవతారం ఎత్తితే కానీ చెప్పలేం’ అంటూ వెళ్లిపోయాడు! బుధవారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఒక చానల్‌లో విజయవాడ నుంచి ఒక మీడియా ప్రతినిధి ఫోన్ ఇన్ ఇస్తూ చెప్పిన మాటలు.. ‘సమైక్య ఉద్యమానికి సామాన్య జనం నుంచి స్పందన కరువైంది. ప్రజలు పాల్గొనకపోవడంతో ఉద్యమానికి ఊపురావడం లేదు’ అన్నారు! ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యుడు, సీనియర్ విలేకరి కూడా అయిన ఒక వ్యక్తి.. ‘సమైక్యవాద ఉద్యమానికి ఒక ప్లాట్‌ఫామ్ లేదు. రాజకీయ నేతలకు ఎవరికీ సమైక్యవాద ఉద్యమం పట్టడం లేదు. విద్యార్ధులు ఎన్ని రోజులు చేయగలరు? రెండు మూడు రోజుల్లో ఆందోళన ముగుస్తుంది’ అన్నారు. వాణిజ్య, వ్యాపారవేత్తలు సైతం కొత్త రాజధాని నిర్మాణంపైనే దృష్టి మళ్లించారు . అయితే, తమ స్వప్రయోజనాలు దెబ్బతింటాయంటున్న నేతలు.. సీమాంధ్రకూ కొత్త రాజధాని గురించి ఆలోచించడం లేదు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *