By: రవి కన్నెగంటి
ఎడిటర్ “తొలకరి” పత్రిక
—
తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ, UPA భాగస్వామ్య పక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. యింకా పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది అప్పటి వరకూ ప్రజలు జాగరూకులై ఉండాల్సిందే.
పాలక పక్షాలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రజలు వివిధ రూపాలలో సాగించిన ఉద్యమాల ఒత్తిడి ఉంది. దోపిడీకి ,పీడనకు,వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగం సాగించిన సాయుధపోరాటం లో ఈ పోరాట స్పూర్తికి పునాదులు ఉన్నాయి. జగిత్యాల జైత్రయాత్రలో, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటంలో అడుగులు ఉన్నాయి.
దళితులు,ఆది వాసీలూ, వృత్తుల కులాలూ సాగించిన ఉద్యమాలు ఉన్నాయి. విద్యార్ధి లోకం నిరంతరం ఎగిసిపడిన చరిత్ర ఉంది . ఉపాధ్యాయులూ ,ఉద్యోగులూ ప్రజల వెంట నిలబడి పోరాడిన జ్ఞాపకాలున్నాయి. సింగరేణి శ్రామికులూ, రవాణా రంగ కార్మికులూ, విద్యుత్ ఉద్యోగులూ చేసిన సమ్మె పోరాటాలు ఉన్నాయి.
యూనివర్శిటీ అధ్యాపకులూ, న్యాయవాదులూ, డాక్టర్లూ, పౌరహక్కుల, మానవహక్కుల కార్యకర్తలూ, కవులూ, కళాకారులూ, రచయితలూ అండగా నిలబడిన, మార్గదర్శనం చేసిన, గొంతెత్తి నినదించిన వాస్తవముంది. ఉద్యమ శక్తిని నమ్ముకున్న శక్తులన్నిటికీ విప్లవాభినందనలు
ప్రజల పోరాటాల కారణంగా, అనివార్యమై దోపిడీ, పీడన సాగించిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు కూడా తెలంగాణా నినాదాన్ని అందుకున్నాయి. ఈ
పార్టీలు అవకాశవాదంతో, స్వార్ధంతో, పదవీ కాంక్షతో వ్యవహరించిందే యెక్కువ. నిజాయితీతో వ్యవహరించింది చాలా తక్కువ. ఎన్నికల చుట్టూ తిరగడం, పార్టీలు మారడం ఈ కారణంతోనే. యిటువంటి శక్తుల పట్ల ప్రజలు మరింత జాగరూకులై ఉండాలి .
ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రజలు సాధించిన ఈ విజయాన్ని పదిలంగా కాపాడుకోవాలి. పాలకవర్గ పార్టీల రోడ్ మ్యాప్ లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి . వాళ్ళ
పంపకాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ పంపకాలు తిరిగి ప్రాంతాల మధ్యా, ఒకే ప్రాంతంలో వివిధ జిల్లాల మధ్యా, ప్రజల మధ్యా ఘర్షణలు
సృష్టించకుండా పార్టీలు వ్యవహరించేలా మనం కాపలాకాయాలి. తప్పును తప్పుగా ,ఒప్పును ఒప్పుగా చెప్పగలిగిన విచక్షణ అలవర్చుకోవాలి .
ఒక ప్రాంతం భౌగోళికంగా విడిపోతేనే మన అన్ని సమస్యలూ వాటంతటవే పరిష్కారమైపోతాయనే భ్రమలకు ఒక్క క్షణం కూడా మనం గురికావద్దు. ప్రజల
చైతన్యం, పోరాటపటిమ, శ్రామిక ప్రజల ఐక్యత మాత్రమే కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకునేందుకు పునాదిగా పనిచేస్తాయి.
ముఖ్యంగా ప్రత్యేక పాలనలో కొనసాగించే అభివృద్ధి నమూనా ప్రజానుకూలంగా ఉండేలా మన ఒత్తిడి కొనసాగాలి.ప్రస్తుతం కొనసాగుతున్న విధ్వంసకర
అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాలి
ఆదివాసీలను,అటవీ ప్రాంతాలను ముంపుకు గురి చేసే పోలవరం నిర్మాణాన్ని మనం స్పష్టంగా వ్యతిరేకించాలి. ప్రజల, ముఖ్యంగా ఆదివాసీల హక్కులను
,పర్యావరణాన్ని,స్థానిక ప్రజల సహజ వనరులను ,జీవితాలను ధ్వంసం చేసే సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను, బయ్యారం మైనింగ్ ను, ప్రత్యేక
ఆర్ధిక మండళ్ళను, మనం వ్యతిరేకించాలి.
తెలంగాణా లోని అన్ని జిల్లాలలో గత 18 సంవత్సరాలుగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి .ప్రతి సంవత్సరం వందల మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు . విద్యుత్ షాక్ మరణాలూ యెక్కువే . వర్షాధార ప్రాంతాల పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువ కావడం వల్ల , అందరూ బీటీ పత్తి
వైపు మారుతున్నారు . ఈ పరిణామం వ్యవసాయ సంక్షోభాన్ని మరింత పెంచుతుంది .
ఈ వ్యవసాయ సంక్షోభానికి వ్యతిరేకంగా, వ్యవసాయ దారుల కుటుంబాల (రైతుల, వ్యవసాయ కూలీల ) ఆదాయ భద్రత కోరుతూ మన ఉద్యమాలు ఉండాలి రాష్ట్ర స్థాయిలో పంటల ఆదాయ ,ఖర్చులను మదించి న్యాయమైన మద్ధతుధరలు నిర్ణయించే వ్యవస్థ ను ఏర్పరచాలనీ , వ్యవసాయ కుటుంబాల ఆదాయ కమీషన్ (జీవన వ్యయాన్నీ ,ఆదాయాలనూ లెక్కించే సంస్థ ) ను ఏర్పరచాలనీ మన ఉద్యమాలు కొనసాగాలి .
ప్రభుత్వ రంగం లోని ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా , ప్రైవేటు రంగం లోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా డిమాండ్ చేస్తూ మన ఉద్యమాలు కొనసాగాలి
అసంఘటిత రంగ కార్మికుల హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మన ఉద్యమాలు కొనసాగాలి తెలంగాణా ప్రాంతం లో నిర్మాణ మవుతున్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ విద్యుత్ అవసరమయ్యే ఎత్తిపోతల ప్రాజెక్టులే . వీటికోసం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎప్పటికీ కత్తి మీద సామే. పైగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం అసాధ్యం . ప్రణాలికా సంఘం ఒక వైపున ప్రజలకు ఉచితంగా యివ్వవద్దని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నది . ప్రజల సంక్షేమ కార్యక్రమాలకూ
,సబ్సిదీలకూ నిధులు తగ్గి పోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం . విద్యా ,వైద్యం ఇప్పటికే ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్ళిపోయాయి . విద్యుత్ కూడా
ప్రైవేటు రంగం చేతుల్లో పెట్టాలనే విధానాలే వేగం గా ముందుకు వెళుతున్నాయి .ఈ స్థితిలో ఉచిత విద్యుత్ ను పొందేలా పోరాడడం , ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా పోరాడడం మన తక్షణ కర్తవ్యం . ఎత్తిపోతల ప్రాజెక్టులకు పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ నీటి పారుదల వ్యవస్థలను అభి వృద్ధి చేయాలనీ మన పోరాటం కొనసాగాలి. నీరు తక్కువ అవసరమయ్యే పంటలకూ, పంట సాగు పద్దతులకూ ప్రోత్సాహం లభించేలా మన ఉద్యమాలు ఉండాలి .
పర్యావరనానికీ , మనుషుల,యితర జీవ జాతుల ఆరోగ్యానికీ హాని చేసే రసాయన వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయం గా సుస్థిర, సేంద్రియ వ్యవసాయాన్ని
సాగిస్తున్న చరిత్ర తెలంగాణా రైతుల కుంది . దేశ వ్యాపితం గా పేరుగాంచిన ఏనబావి (వరంగల్ జిల్లా ),పునుకుల (ఖమ్మం ) తెలంగాణా ప్రాంతం లోనే ఉన్నాయి. వీటిని స్పూర్తిగా తీసుకుని మిగిలిన ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి కొనసాగించాలి .
కార్పోరేట్ వ్యవసాయానికి తలుపులు తెరవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి . దీనిని అడ్డుకునే క్రమం లో మనం రైతుల సహకార సంఘాలను బలంగా నిర్మించాలి
ములకనూరు (కరీం నగర్ జిల్లా ),ఎత్తొండ (నిజామాబాద్ జిల్లా ) రైతుల సహకార సంఘాలను మనం ఆదర్శం గా తీసుకుని ముందుకు వెళ్ళాలి .
దళితుల పట్ల వివక్ష కొనసాగకుండా మన పోరాటాలు మరింత బలంగా కొనసాగించాలి . శ్ఛ్ వర్గీకరణను తక్షణమే అమలు లోకి తెచ్చేవిధంగా దళితులలోని వివిధ శ్రేణుల మధ్య చర్చలను చేపట్టాలి చట్ట పరమైన చర్యలూ చేపట్టాలి .
ఆదివాసీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని సమగ్రం గా అమలు చేసేలా మన వైఖరి ఉండాలి . ఆదివాసీ ప్రాంతాల వ్యవసాయాన్ని కాపాడేలా, అభివృద్ధి చేసేలా మన
ఉద్యమాలు ఉండాలి .వారికి సాగునీరు, వైద్యం,విద్య అందేలా మన ఉద్యమాలు ఉండాలి
మతపరమైన,భాషాపరమైన మైనారిటీ ల పట్ల మరింత భాద్యత గా ఉండాలి . వారి హక్కులను కాపాడాలి . ఆయా ప్రజా సమూహాల జీవితాలు మరింత సమగ్రం గాఅభివృద్ధి చెందేలా ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధం గా వ్యవహరించేలా మన ఉద్యమాలు ఉండాలి
ప్రజలందరికీ విద్యా ,వైద్యం ప్రభుత్వ రంగం లోనే దొరికేలా డిమాండ్ చేస్తూ మన ఉద్యమాలు రూపొందాలి. కామన్ స్కూల్ విధానం కోసం మనం పోరాటాలు నిర్మించాలి .
ఆయా జిల్లాలలో వ్యవసాయాధారిత,యితర ముడి వనరుల ఆధారిత పరిశ్రమలు పెట్టేలా(పర్యావరణానికి హాని చేయకుండా ), ఉన్న పరిశ్రమలను కాపాడేలా మన
ఉద్యమాలు ఉండాలి.
అన్నిటికంటే ముఖ్యమైనది మన ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవడం . రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అన్ని హక్కులనూ అమలు చేయించుకోవడం తో పాటు ,మన న్యాయమైన డిమాండ్స్ ను గొంతెత్తి నినదించే హక్కును కాపాడుకోవడమూ అవసరమే . తెలంగాణా ఉద్యమం సందర్భం గా పెట్టిన అన్ని కేసులనూ ఎత్తివేసేలా మన ఉద్యమం కొనసాగాలి విప్లవ సంస్థలపై ,ఉద్యమ సంస్థలపై పెట్టిన నిషేధాలను ఎత్తివేసేలా మన ఉద్యమం కొనసాగాలి.
ఆయా రాజకీయ పార్టీల పట్ల స్పష్టమైన అంచనాతో ఉద్యమ శక్తులు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలి . నిజమైన ప్రజాస్వామిక స్పూర్తితో ఉద్యమ
నిర్మాణ కమిటీలను తీర్చి దిద్దుకోవాలి , సాధారణ ప్రజల పట్ల మరింత నిజాయితీగా ,భాద్యతగా వ్యవహరించేలా మన వ్యవహార శైలి ఉండాలి . ముఖ్యంగా
ఉపాధ్యాయులు ,ఉద్యోగులు ఈ కృషి లో ముందుండాలి.