తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయి అని దుయ్యబట్టారు.
రక్షక భటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరం.. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటిసారి. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.
హోంమంత్రి లేకపోవటం వలన.. కానిస్టేబుల్స్ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. యూనిఫాం వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం అని అన్నారు.
ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలి. 15 రోజులకు 4 రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలి. పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవి అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.