mt_logo

అసెంబ్లీ నుండి రేవంత్ దొంగలా పారిపోయారు.. రేవంత్ తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి: సబితా ఇంద్రారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు కంటతడి పెడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభలో కేటీఆర్ గారు బడ్జెట్ పై నిజాలు మాట్లాతుంటే దాన్ని నుంచి డైవర్ట్ చేసేందుకే మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీ వెనుక కూర్చొన్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు.. ముఖ్యమంత్రి గారికి మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తోంది. ఆరోజు సోనియా గాంధీతో సహా చాలా మంది మహిళలను అవమానించారు. మహిళలను కావాలనే అవమానించే విధంగా ఏదేదో మాట్లాడారు అని విచారం వ్యక్తం చేశారు.

నేను మోసం చేశానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు.. నేను కాంగ్రెస్ పార్టీలో ఆయనను రమ్మనటమే నేను చేసిన తప్పా.. మమ్మల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే దిక్కు అంటున్నారు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ మహిళలను అవమానించినట్లే. అక్కలను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతదని అన్నట్లుగా సీఎం గారు మాట్లాడారు అని అన్నారు.

నా 24 ఏళ్లలో చాలా మంది సీఎంలను చూశాను. కానీ మీరు ఒక్కరే ఆ సీఎం కుర్చీని అవమానించే విధంగా మాట్లాడారు.. మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండ్ అన్న మాట నాకు చాలా బాధనిపిస్తోంది. మేము అక్కలుగా మంచి కోరతాం.. కనుక ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

సీఎం గారు మాట్లాడితే ఇందిరాగాంధీ, సోనియాగాంధీ అంటారు.. మరీ మహిళలపై మీకు ఉన్న గౌరవమీదేనా.. భట్టి గారు కూడా నా కారణంగానే ఎల్ఓపీ పోయిందన్నట్లుగా అన్నారు. మరీ సీఎంగా ఎందుకు మీరు ప్రయత్నించలేదు. ఏ మొఖం పెట్టుకొని వచ్చారని ఆయన అన్నారు.. ఇది చాలా బాధనిపించింది అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

మేము ఏం తప్పు చేయలేదు.. చాలా మంది కూడా పార్టీలు మారారు. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మీ పక్కన పార్టీ మారిన వాళ్లను ఎందుకు పెట్టుకున్నారు. సభలో మాట్లాడతామంటే ఎందుకు అవకాశం ఇవ్వలేదు.. మేము కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో.. ఎలా మెడబట్టి బయటకు గెంటే ప్రయత్నం చేశారో మాకే తెలుసు అని తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీలోనే మహిళలను అవమానించే పరిస్థితి వచ్చిందంటే ప్రజలే ఆలోచించాలె.. సీఎం గారి కుర్చీకి గౌరవం పెరగాలంటే మీరు తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. భట్టి గారు మొఖం పట్టుకొని అనే మాట నాకు చాలా బాధనిపిస్తోంది.. వెంటనే మమ్మల్ని అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ నుంచి రేవంత్ దొంగలా పారిపోయారు అని దుయ్యబట్టారు.