-వాసాలమర్రి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ పథకం
-గ్రామంలోని ఎస్సీలందరికీ రూ.10 లక్షల సాయం
-సొంత వ్యాపారాలతో నెలనెలా 50వేల ఆదాయం
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి చెందిన బత్తుల రాజేశ్ ఏదో ఒక పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. పొద్దంతా కష్టపడితే వచ్చే డబ్బులు ఏ మూలకూ సరిపోయేవి కావు.. ఇటీవల అతడికి దళిత బంధు కింద తెలంగాణ సర్కారు రూ. 10లక్షల సాయం అందజేసింది. దీంతో భువనగిరిలో కిరాణం, మెడికల్ సామాను హోల్‌సేల్ సప్లయ్ డీలర్‌షిప్ తీసుకున్నాడు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు వస్తువులు సప్లయ్ చేస్తున్నాడు.. ప్రస్తుతం నెలకు రూ.25లక్షల దాకా బిజినెన్ టర్నోవర్ నడుస్తున్నది. ఖర్చులన్నీ పోను రూ.50వేల దాకా చేతికి వస్తున్నాయి. ఇప్పుడు అతడి కిందే నలుగురికి ఉపాధి లభిస్తున్నది. హైదరాబాద్‌లో రూ.15వేల జీతానికి పనిచేసిన చెన్నూరు కైలాసం నేడు దళితబంధుతో బొలేరో వాహనం కొన్నాడు. నెలకు రూ. 50వేలు సంపాదిస్తున్నడు. స్థానికంగా పనిలేక హైదరాబాద్‌కు వలసపోయిన కొండపురం నగేశ్ ఇప్పుడు దళితబంధుతో ఉన్న ఊళ్లోనే వెల్డింగ్ షాప్ పెట్టుకొన్నడు. నెలకు రూ.50వేలకు పైగా సంపాదిస్తున్నడు. మరో నలుగురికి ఉపాధి ఇస్తున్నడు. ఇలా..సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన దళిత బంధు పథకం వాసాలమర్రి గ్రామంలోని దళితుల తలరాతనే మార్చేసింది.
దళితుల దశ మారుస్తున్న దళితబంధు
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీల అభ్యున్నతి కోసం దూరదృష్టితో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత సమర్థంగా అమలు చేసింది. ఇప్పుడు రెండో విడుతలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దళిత సాధికారత
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా దళిత బంధు స్కీంను ఇక్కడే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. గ్రామం మొత్తం సర్వే చేయించారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు 75 మందిని గుర్తించారు. దీంతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఇక్కడే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతే హుజూరాబాద్‌లో మొదలు పెట్టారు. ప్రభుత్వం అందించిన సాయంతో వాసాలమర్రిలోని లబ్ధిదారులు ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు.
వెల్డింగ్, డయాగ్నస్టిక్ సెంటర్, కిరాణా, మెడికల్ సామాన్ల డీలర్‌షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, క్లాత్ షోరూం, టీ కప్పుల తయారీ, సెంట్రింగ్ తదితర బిజినెస్‌లు ఏర్పాటు చేసుకుంటూ విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో రూ.10 నుంచి రూ.15వేలకు ఒకరి కింద పనిచేసిన వారే ఇప్పుడు గర్వంగా యజమానిగా బతుకుతున్నారు. నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో రూ.15వేలకు పనిచేసి, రెంట్లు, ఇతర ఖర్చులకే పోయేవని.. ఇప్పుడు సొంత ఊరిలో మంచి ఆదాయం పొందుతూ ఆనందంగా బతుకుతున్నామని వాసాలమర్రి దళితబంధు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అప్పులు ఇప్పుడు తీరుస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కొందరైతే ఏకంగా ముగ్గురు, నలుగురికి పని కల్పిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరికి నెలకు రూ.15వేల వరకు జీతాలు చెల్లిస్తుండటం విశేషం.