mt_logo

రైతు బంధు గంట మోగింది.. తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు

సమైక్య రాష్ట్రంలో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది దీనిపైనే. అందుకే వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నన్ని కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయడం లేదు. రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే పంటసాయం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి జూన్ 2023 నాటికి 11 విడతల్లో 70.54 లక్షల మంది రైతులకు 72,931 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందజేసింది. 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.  

రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించడం రైతు సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుతున్నది.

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు: 

తెలంగాణలో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ నిధులు జమ కానున్నాయి.ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. మొత్తం 70 లక్షల మందికి సాయంగా రూ.7,720 కోట్లు విడుదల చేశారు. లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది. ఈ వానాకాలం సీజన్ లో రైతుల ఖాతాలలో మొత్తం రూ.7720.29 కోట్లు జమకానుంది. గతంలోకన్నా ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. 

11వ విడతతో రైతుల ఖాతాలలో రూ.72,910 కోట్లకు రైతుబంధు చేరనుంది. ఒక కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందనుంది. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరనున్నాయి. ఈ సారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంక్ అకౌంట్ వివరాలతో సంప్రదించాలి. దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతుబంధు నిధుల విడుదల సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయింది అని అన్నారు. తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు, 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలని మంత్రి తెలిపారు. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి.