mt_logo

కొత్త చరిత్ర మొదలైంది.

By: అల్లం నారాయణ

రాజ్‌భవన్ ముందు బారులు తీరిన పోలీసులు. కార్ల బారు. హడావుడి. షామియానా కింద ఉక్కపోత. ఎండాకాలం చివరి రోజుల ప్రతాపం. కానీ రాజ్‌భవన్ కొత్తగా ఉన్నది. షామియానా కింద ఎప్పటివలెనే న్యాయమూర్తులు, అధికారులు, ఐఏఎస్ బాబులు, గవర్నర్ స్టాఫ్ హడావిడి. ఇది పాతది. ఈ దృశ్యం ప్రతి ప్రమాణ స్వీకారానిది. జూన్ 2, ఉదయం ఎనిమిది గంటలకు ఒక చరిత్ర ముంగిట అక్కడ గుమికూడి కుర్చీల్లో ఆసీనులయిన చాలామంది జీవితంలో ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌లో అడుగుపెట్టి ఉండరు. దారితప్పి ఎప్పుడన్నా వచ్చినా బిక్కుబిక్కుమంటూ ఓ డిమాండ్ల పత్రం లాంఛనంగా ఇచ్చి, ఫొటోదిగి భయంభయంగా బయటపడి ఉంటారు. కానీ ఇవ్వాళ్ల తెలంగాణ చరిత్రను నిర్మిస్తున్న తొట్టతొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి బాజాప్తావచ్చి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించే వీఐపీలయి కూచోవడమే అసలు విషయం.

వీధుల్లో ఉండి నినాదాలిచ్చిన వాళ్లు, బారికేడ్లు బద్దలుకొట్టి పోలీసులతో తలపడినవాళ్లు. గన్‌పార్క్ స్థూపంముందు మోకరిల్లి శపథాలు చేసినవాళ్లు, ఆర్ట్స్ కాలేజీనుంచి బయలుదేరి ఎన్‌సీసీ వద్ద బాష్పవాయువులను పీల్చినవాళ్లు, లాఠీలకు దేహాలను అడ్డంపెట్టి కొట్లాడినవాళ్లు, రైల్‌రోకోలు చేసి జైలుపాలయినవాళ్లు, పోలీసుల వలయాలను ఛేదించుకుని ఆఫీసుల ప్రాంగణాల్లో ధిక్కరణ పతాకాలు ఎగరేసిన వాళ్లు, సకలజనుల సమ్మెలో మోర్చా కట్టినవాళ్లు, కార్యాలయ ప్రాంగణాలను యుద్ధరంగంలో తీర్చిదిద్దిన వాళ్లు, తలలు పగిలినా సాహసంతో ఊరేగింపులో ముందుకురికిన వాళ్లు అనేకమంది ఆ కుర్చీల్లో ప్రమాణ స్వీకారానికి అధికార ప్రతినిధులుగా కూచున్నారు.

అదీ చరిత్రంటే. అదీ తెలంగాణ రావడం అనే దాన్ని ఫీలవడమంటే. అదీ తెలంగాణ వచ్చిన క్షణాల్లో స్వేచ్ఛ, స్వీయ రాజకీయ అస్థిత్వం అంటే.. గంభీరమైన వాతావరణం ప్రారంభమయింది. నిజానికి మాజీ డీజీపీ రాములు అన్నట్టు ఇదంతా సంప్రదాయ ప్రకారం లాంఛనంగా జరుగుతూంటుంది. మాజీ డీజీపీ రాములుకు రకరకాల హోదాల్లో ఈ ప్రమాణ స్వీకారాలకు వందసార్లయినా హాజరయిన అనుభవం ఉంది. గవర్నర్ ప్రవేశించారు. ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు నిరంతర స్రవంతిగా ప్రజలలో ప్రసరించిన బక్కపలుచని కేసీఆరూ వచ్చారు. జాతీయగీతం. అప్పుడు ప్రారంభమయింది. కొత్త రాష్ట్రం. కొత్త చరిత్ర. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.

చివరి రోజు దాకా పోలవరంపై బంద్ పిలుపు ఇచ్చి ఉద్యమ నాయకుడిగా బంద్‌ను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను కదలించిన కేసీఆర్ ఇవ్వాళ ఒక రాష్ట్ర ముఖ్య ప్రతినిధి అయ్యారు. ఆయన వెంట మంత్రులు కొలువు దీరారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దీక్ష చేసిన సందర్భంలో ఆ పదకొండు రోజులు పోలీసులు ఆయనను అమానుషంగా, అనాగరికంగా అరెస్టు చేసినప్పటినుంచి ఖమ్మం జిల్లాలో వ్యవహరించిన తీరు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు రావాల్సే ఉన్నది. ఎందుకంటే అదే పోలీసులు బారులు తీరి, రక్షణ కల్పించి శాల్యూట్‌చేసి, గవర్నర్ స్వయంగా ప్రమాణం చేయిస్తున్న ఈ అరుదైన సందర్భం. ఈ అపూర్వమైన సందర్భం ఒక తెలంగాణ ఉద్యమం సాఫల్యమైనందువల్లే జరిగింది. అదే చరిత్ర. బహుశా ఈ చారిత్రక సందర్భాన్ని మరిదేనితోనూ పోల్చలేము.

అర్థరాత్రి సూర్యోదయాన్ని ఆహ్వానిస్తూ పదిజిల్లాల తెలంగాణ తల్లీ, పిల్లలు ఆదివారం నాడే వీధుల్లో పోటెత్తారు. దశాబ్దాల ఒక కలను నిజం చేసుకున్న జనం ఆ కలను ఆస్వాదించడానికి ధూమ్‌ధామ్‌లయ్యారు. మిలియన్ మార్చ్. అదే ట్యాంక్‌బండ్ మీద ఒక యుద్ధాన్ని స్వయంగా చూశాను. కాలిపోతున్న వాహనాలు. కూలిపోతున్న విగ్రహాలు, ఒక ఉద్విగ్న, ఉద్రేక, మహోద్రిక్త క్షణాలు. అప్పుడు ట్యాంక్‌బండ్ కలియదిరిగింది ఉద్యమం. విజయంతో. బారికేడ్లను బద్దలుకొట్టిన సాహసంతో చివరగా పోలీసులు జోక్యం చేసుకుని ట్యాంక్‌బండ్ ఖాళీ చేయించి బాష్పవాయువు ప్రయోగించి, నిర్మానుష్యం చేసినప్పుడు మా జర్నలిస్టుఫోరం జర్నలిస్టులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ఉద్విగ్న, ఉద్రిక్త పరిసరాల్లో కలియదిరిగిన కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఆ విగ్రహాలలో ఏదో ఒక విగ్రహం ముందు నిలబడి ప్రజలకు అభివాదం చేసిన దృశ్యం కండ్లముందు కదలాడుతున్నది. అదే కేసీఆర్ ఇవ్వాళ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తుండడం, ముఖ్యమంత్రి కావడం దేనివల్ల సాధ్యమయింది.

ఒక ప్రజాస్వామ్య ఉద్యమ విజయం వల్ల. ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుతంగా జరిగిన తెలంగాణ విప్లవంవల్ల. వ్యూహాలు, ఎత్తుగడలూ, ప్రజాస్వామ్య, విశాల, విస్తృతిగల పోరాటాలు ఒకవేపు, ఢిల్లీని గడగడలాడించే ఒత్తిడికోసం సుదీర్ఘంగా జరిగిన పోరాటం మరోవేపు, రాజకీయ ప్రక్రియ కోసం ఢిల్లీ పురవీధులన్నీ, అధికార సౌధాలన్నీ తిరిగి సాధించిన ప్రజాప్రతినిధుల సమ్మతి మరోవేపు తెలంగాణ కల సాకారమయింది. అదే యుద్ధభూమి ట్యాంక్‌బండ్ ఇవ్వాళ ధూమ్‌ధామై అధికారిక వేడుకల్లాగా ఒక ఉత్సవమై ఊరేగుతున్నది.

ప్రతి మలుపులోనూ, ప్రతి ఉద్యమ సందర్భంలోనూ గన్‌పార్క్‌లో తెలంగాణ తొలి ఉద్యమ అమరవీరుల స్థూపానికి మొక్కి కార్యాచరణ ప్రారంభమయ్యేది. గోస చెప్పుకోవడానికి, నిర్భంధం తీవ్రమయినప్పుడు ప్రతిఘటనకు, అమానవీయంగా రాజ్యం, సీమాంధ్ర పెత్తందారీ ప్రభుత్వాలు ప్రవర్తించినప్పుడు ధర్నాలకూ అది వేదికయ్యేది. ఇవ్వాళ ఆ గన్‌పార్క్ కూడా ధూమ్‌ధామై ఎగురుతున్నది. కొత్తగా కొత్త సీఎం కోసం, గన్‌పార్క్ ముస్తాబయి వున్నది. ఉద్యమ గోస పంచుకోవడానికి గతంలో గన్‌పార్క్‌కు వచ్చిన కేసీఆర్ ఇవ్వాళ్ల అధికారికంగా, ముఖ్యమంత్రిగా, రైట్ రాయల్‌గా వచ్చి అమరవీరుల స్థూపానికి మొక్కి, గర్భశోకాలకు ఒక భరోసా ఇచ్చారు. ఇది మలి ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఒక అండ.

ఇదే గన్‌పార్క్ చుట్టూ ముళ్లకంచెలు కూలిపోయాయి. ఇప్పుడు మా తెలంగాణలో మా అమరవీరుల స్మరణ స్వేచ్ఛగా సాగుతుంది. ఇదే అమరవీరుల స్థూపానికి కూడా మొక్కకుండా ఆ ప్రశాంత ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు ఎత్తి వ్యాన్లలో కుదేసి తీసుకుపోయిన అనుభవం కూడా ఈ కథనం రాస్తున్న నాకూ ఉన్నది. ఇప్పుడది స్వేచ్ఛా భూమి.

ఎదుట అసెంబ్లీ అలంకరించుకుని ఉన్నది. ఆ అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించిన అసెంబ్లీ ఇవ్వాళ తెలంగాణను స్వాగతించడానికి విద్యుత్ దీపాల కాంతులీనుతున్నది. ఇదెంత మార్పు. ప్రెస్‌క్లబ్‌లో ఒక పాత్రికేయుడు అంటున్నాడు. ఇగ తెలంగాణ అని గుసగుసలు చెప్పుకోవడం చెల్లు. బాజాప్తా. ఈ హైదరాబాద్ మనది. ఈ ప్రెస్‌క్లబ్ మనది. ఇది విముక్త ప్రాంతం. మన తెలంగాణ. మన రాష్ట్రం. మన ప్రభుత్వం. ఇది మనదే. తెలంగాణను క్షణక్షణం ఆస్వాదించడమంటే ఇదే. తెలంగాణ రావడమన్నా ఇదే.

పరేడ్‌గ్రౌండ్స్. ఎవరో పరాయి ప్రాంతీయుడు ప్రతిసారీ రాజదర్పంతో పోలీసు వందనాలు స్వీకరించే దృశ్యానికి మాత్రమే అలవాటుపడిన కన్నులు. ఇవ్వాళ ఒక అపురూప దృశ్యం. ఉద్యమనేత ఒకరు ముఖ్యమంత్రియై, కాన్వాయ్‌లో మైదానానికి చేరి పోలీసు వందనం స్వీకరించడం తెలంగాణ కల సాకారం అయినందువల్లకదా సాధ్యమైంది. తెలంగాణ వచ్చింది. ప్రతి సందర్భాన్నీ ఆస్వాదిద్దాం. సంపాదకులు నృత్యం చేస్తున్నారు. కవులు ముషాయిరాతో స్వాగతం పలుకుతున్నారు. గాయకులు పాడుతున్నారు. జెండాల రెపరెపలు. వచ్చీపోయే జన ప్రవాహంలో గన్‌పార్క్ సంద్రమవుతున్నది. అలాయ్‌భలాయ్‌లు. ఎగురుడు. దుంకుడు. సంబురం. పటాకులు ఆకాశమెత్తున చిమ్మిన వెలుగులు.

జెండా ఎగరేసిన ప్రభుత్వ కార్యాలయాలు. అర్థరాత్రి ముగిసినా తిరుగాడుతూ, జెండాలూపుతూ, కేకులు తింటూ, బతుకమ్మలాడుతూ.. తెలంగాణ ఒక చరిత్ర సృష్టించింది. సచివాలయం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికింది. ఇక మరట్ తుడుం పాయానా.. మనమే తుడుం కొట్టాలె. ఈ సంబురాలు శాశ్వతం కావాలి. ఏ పెత్తనాలు లేని, ఏ ఆధిపత్యాలులేని, ఏ పీడన లేని, ఏ వివక్షలేని, ఏ అణచివేతలు లేని. నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. చరిత్రనుంచి వర్తమానం నిర్మితం కావాలి. భవిష్యత్‌కు పునాది కావాలి. మనకొక రాజముద్ర ఉన్నది. రాష్ట్రీయగీతం ఉన్నది. మనకొక రాజ్యమూ ఉన్నది. మనదే అయిన ప్రభుత్వమూ ఉన్నది. కోటి ఆకాంక్షలున్నవి. అవి తీరాల్సి ఉన్నది. తెలంగాణ విముక్తమయింది. విముక్తి ఫలాలు అందరికీ అందాల్సి ఉన్నది. సంబురాలు శాశ్వతం కావాల్సి ఉన్నది. జై తెలంగాణ.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *