mt_logo

సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. దేశానికే బువ్వ‌గిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం ప‌క్క రాష్ట్రాల క్యూ!

స‌మైక్య పాల‌కులు దండుగ‌న్న వ్య‌వ‌సాయాన్ని.. సీఎం కేసీఆర్ త‌న సంక‌ల్పంతో పండుగ‌లా మార్చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు, మిష‌న్ కాక‌తీయ‌, ప్రాజెక్టుల‌తో చెరువుల అనుసంధానం, చెక్‌డ్యాంల నిర్మాణం, 24 గంట‌ల ఉచిత నాణ్య‌మైన క‌రెంటు, రైతు బంధు, రైతు బీమా, స‌కాలంలో ఎరువులు, పంట‌రుణ‌మాఫీలాంటి విప్ల‌వాత్మ‌క ప‌థ‌కాల‌తో అన‌తికాలంలోనే దేశానికే తెలంగాణ‌ను బువ్వ‌గిన్నెగా మార్చేశారు. లాభ‌సాటిగా లేద‌ని వ్య‌వ‌సాయాన్ని వ‌దిలేసిన వారుకూడా మ‌ళ్లీ కాడిప‌ట్టేలా చేశారు. ఫ‌లితంగా తెలంగాణ‌లో పుట్ల‌ట‌కొద్దీ ధాన్యం పండుతున్న‌ది. ధాన్యం ఉత్ప‌త్తిలో అతి చిన్న రాష్ట్ర‌మైన తెలంగాణ పంజాబ్‌నే దాటి ముందుకు దూసుకుపోతున్న‌ది. దీంతో తెలంగాణ‌ బియ్యం కోసం ప‌క్క రాష్ట్రాలనుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. త‌మ రాష్ట్రంలోని ప్ర‌జ‌లకు పంపిణీ చేసేందుకు బాయిల్డ్ రైస్ ఇవ్వాలంటూ తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు లేఖ‌లు రాస్తున్నాయి.

అవ‌మానించిన కేంద్రం.. రైతుల‌ను గెలిపించిన కేసీఆర్‌
సీఎం కేసీఆర్ విజ‌న్‌తో తెలంగాణ స‌ర్కారు చేప‌ట్టిన విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల‌తో తెలంగాణ‌లో ప‌స‌డి పంట‌లు పండాయి. అయితే, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వివ‌క్షాపూరిత ధోర‌ణితో పంట‌ను కొన‌బోన‌ని మొండికేసింది. త‌మ వ‌ద్ద బాయిల్డ్ రైస్ నిల్వ‌లు నాలుగేండ్ల‌కు స‌రిప‌డా ఉన్నాయ‌ని చెప్పి, తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనేందుకు నిరాక‌రించింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తినిపించాల‌ని కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ అవ‌హేళ‌న చేశారు. తెలంగాణ రైతుల‌ను ఘోరంగా అవ‌మానించారు. అయినా సీఎం కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు.. మొత్తం ధాన్యం రాష్ట్ర స‌ర్కారు కొంటుంద‌ని చెప్పి.. చేసి చూపించారు. దేశానికి అన్నంపెట్టే రైతును కేంద్రం అవ‌మానిస్తే.. సీఎం కేసీఆర్ వారిని గెలిపించి.. దేశం ఎదుట స‌గ‌ర్వంగా నిలిపారు. ఇప్పుడు అందుకు ప్ర‌తిఫ‌లం ల‌భిస్తున్న‌ది. త‌మ‌కు బియ్యం స‌ర‌ఫ‌రా చేయాలంటూ ప‌క్క రాష్ట్రాలు తెలంగాణ‌ను వేడుకొంటున్నాయి. గతంలో రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌జ‌ల‌కు ఉచిత బియ్యం స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉన్న‌దని, త‌మ‌కు బాయిల్డ్ రైస్ పంపించాల‌ని క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ స‌ర్కారు తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా, త‌మిళ‌నాడు స‌ర్కారు కూడా త‌మ‌కు బియ్యం ఇవ్వాల‌ని తెలంగాణ‌ను కోరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.