కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అండతో రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. బఫర్ జోన్‌లలోనూ యథేచ్ఛగా పర్మిషన్లు.. చెరువులు చెరబట్టి మరీ నిర్మాణాలు చేస్తున్నారని ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపించింది.
ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ అక్రమాలకు అడ్డాగా మారిందని.. అక్రమాలు చేద్దామనే కీలకమైన శాఖను దగ్గర పెట్టుకున్నారా అని ప్రశ్నించింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల తీరు ఉన్నదని బీఆర్ఎస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలి. ఓఆర్ఆర్ దాకా జీహెచ్ఎంసీ విస్తరణకు ముందే చెరువుల విస్తీర్ణం, ప్రభుత్వ భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేసింది.
హైదరాబాద్‌లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.