టీపీసీసీ చీఫ్ రేవంత్ తోలుబొమ్మ అయితే ఆడించేది చంద్రబాబు అనే విమర్శలున్నాయి. తమది పాత సహచరబంధమే.. తప్ప ఇంకేమీ లేదు అని టీపీసీసీ చీఫ్ మాట్లాడిన మాటలు అబద్ధాలని తేలిపోయాయి. రేవంత్ ముసుగులో బాబు తెలంగాణలో తన కుట్రలను అమలు చేయాలని పెద్ద ప్లానే వేశారనే విషయం వెల్లడైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ ఇద్దరి గురుశిష్యుల బంధం బయటపడింది. తన రాజకీయ గురువును అరెస్ట్‌నుంచి తప్పించేందుకు రేవంత్ పడ్డ కష్టం చూస్తే వాళ్లిద్దరి మధ్య చీకటిబంధం ఎంతలా పెనవేసుకున్నదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును కాపాడేందుకు రేవంత్ కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. బాబును ఎలాగైనా అరెస్టునుంచి తప్పించాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదని చర్చలు జరిపినట్టు సమాచారం .ఈ విషయాన్ని ది న్యూ ఇండియా ఎక్స్‌ప్రెస్ బట్టబయలు చేసింది. రేవంత్ కలిసిన తర్వాత డీకే శివకుమార్‌కు చంద్రబాబు ఫోన్ చేసి కీలక విషయాలు చర్చించినట్టు ఆ కథనం పేర్కొన్నది.
డీకే చొరవతోనే రంగంలోకి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్!
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉంటున్నారు. అయితే, ఆయన తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగిన విషయ తెలిసిందే. ఈ సిద్ధార్థ్ లూథ్రాకు డీకే శివకుమార్‌కు మంచి సంబంధాలున్నాయి. డీకే చొరవతోనే చంద్రబాబును కాపాడేందుకు సిద్ధార్థ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. తన గురువును కాపాడుకొనేందుకు డీకేను బతిమిలాడి మరీ రేవంత్ ఒప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, చంద్రబాబు కోసం రేవంత్ పడ్డ తాపత్రయం చూస్తేనే వారిద్దరి మధ్యం ఎంత బలమైన బంధం ఉన్నదో తెలిసిపోతున్నదని, తెలంగాణలో బాబుకు నీడలా రేవంత్ పనిచేస్తున్నారనే అనుమానానికి బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌లాంటివాళ్లు తెలంగాణకు ఎప్పటికీ ప్రమాదకరమే అని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.