mt_logo

శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-2)

గత ప్రభుత్వంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ పరుగులు తీయడానికి ప్రధాన కారణం అప్పటి సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో వింటి నుండి వదిలిన బాణంలా మాజీ మంత్రి కేటీఆర్ పనితీరు ఉండటం. క్షణం తీరిక లేకుండా తెలంగాణలో పెట్టుబడుల సాధన, తద్వారా మన యువతకు లక్షలాది ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అయన, ఆయన టీం రేయంబవళ్ళు పని చేశారు.

కానీ కాంగ్రెస్ వచ్చాక ఈ రెండు శాఖలకు సమర్ధుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఇచ్చినా, ఆయనకు అడుగడుగునా రేవంత్ అడ్డుకట్ట వేస్తున్నాడని పెద్ద టాక్ నడుస్తోంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో మర్యాదపూర్వకంగా పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే వారిని సంబంధిత శాఖా మంత్రి శ్రీధర్ బాబు లేకుండా కేవలం రేవంత్ రెడ్డే కలవడం విమర్శలకు దారితీసింది. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి నుండి శ్రీధర్ బాబును కూడా ఆ సమావేశాలకు పిలవడం మొదలుపెట్టారు.

దావోస్‌లో శ్రీధర్ బాబు చేతుల మీదుగా జరగాల్సిన పెట్టుబడుల ప్రకటనలన్ని రేవంతే చేశాడు. తిరిగొచ్చాక కూడా అన్ని ప్రధాన నిర్ణయాలు రేవంత్ కార్యాలయమే తీసుకోవడంటో శ్రీధర్ బాబు ఉక్కపోతకు గురవుతున్నారు అని విశ్వసనీయ సమాచారం.

ఆఖరికి రేవంత్ లేకుండానే గత నెలలో శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్తే సంబంధిత శాఖ సెక్రటరీ కనీసం ఆయనను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి కూడా రాలేదట. రెండు వారాలు అక్కడ ఉన్నా పెద్దగా పెట్టుబడుల ప్రకటనలు ఏమీ రాలేదు. దీనికి కారణం శాఖ అధికారులు ఆ సిద్ధంగా ఉన్న ప్రకటనలు కూడా ఆగస్ట్ తొలివారంలో రేవంత్ పర్యటనలో చేయడానికి పక్కకు పెట్టడమే కారణం అని తెలుస్కుని శ్రీధర్ బాబు మరింత హర్ట్ అయ్యారని వినికిడి.

ఇక రేవంత్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రి తీరు మీద కూడా శ్రీధర్ బాబు గుస్సాగా ఉన్నారని వినికిడి. ఆయన గతంలో బీజేపీకి పనిచేసినప్పుడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద చేసిన ట్వీట్లు అన్నీ ఒక డాక్యుమెంట్‌లో పొందుపరచి ఏకంగా రాహుల్ గాంధీకే శ్రీధర్ బాబు టీం పంపారని టాక్ నడుస్తుంది.

ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న జయేశ్ రంజన్ వ్యవహారం కూడా శ్రీధర్ బాబు, రేవంత్‌ల మధ్య కొంత రాపిడికి కారణం అవుతుంది అని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో సిద్ధం చేసిపెట్టిన పెట్టుబడుల ప్రకటలను అన్నీ ఈ ఆగస్ట్ అమెరికా పర్యటనతో అయిపోతుండటం వల్ల ఇక తనను త్వరలోనే పక్కకు పెడతారని తెలుసుకున్న జయేశ్ రంజన్ ప్రత్యామ్నాయ పోస్టులు వెతుక్కుంటున్నారని, ఇందులో భాగంగానే ఇటీవలే అమరావతి వెళ్లి చంద్రబాబును కూడా కలిసి వచ్చారని గుసగుసలు సచివాలయం కారిడార్లలో వినిపిస్తున్నాయి.

మొత్తానికి రేవంత్ కార్యాలయం విపరీత జోక్యం శ్రీధర్ బాబు పర్ఫార్మెన్స్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.