అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను ఘోరంగా అవమానించాడు. కొత్త ముఖ్యమంత్రి మొదటిసారిగా అమెరికాకు వస్తున్నాడు కాబట్టి.. ఆ కుర్చీ మీద గౌరవంతో రేవంత్ రెడ్డికి స్వాగతం తెలపడానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు బే ఏరియా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.. కానీ రేవంత్ వాళ్ళని బయటే నిలబెట్టి అవమానించారు.
రేవంత్‌కు స్వాగతం తెలపడానికి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వంటి పలు సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులు విమానాశ్రయానికి వచ్చారు. కానీ వారెవరిని లోపలికి అనుమతించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మద్దతుదారులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చారని ఎన్నారైలు ధ్వజమెత్తుతున్నారు.
రేవంత్ రెడ్డికి వెల్కమ్ చెప్పిన వాళ్ళలో ఒక్క ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డిని మినహాయిస్తే మిగితా 90-95% మంది టీడీపీకి చెందిన వారు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారని ఎన్నారైలు ఆక్షేపిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన కొందరిని కూడా లోపలికి అనుమతించి.. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ బిడ్డలను గేటు బయటే ఆపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో రేవంత్ తీరుపై తెలంగాణ ఎన్నారైలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేము రేవంత్ రెడ్డికు అంత చులకనగా కనిపిస్తున్నామా అని బహిరంగంగాగానే రేవంత్ ప్రవర్తనను ఖండిస్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో తాకట్టు పెడుతున్నాడని ఎన్నారైలు గుర్రుగా ఉన్నారు. అమెరికాలో కూడా చంద్రబాబు మనుషుల కోసమే ఉద్యమకారులను రేవంత్ విస్మరిస్తున్నాడని తెలంగాణ ఎన్నారైలు బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.