mt_logo

ఆర్టీఐ చట్టాన్ని నీరుగారుస్తున్న రేవంత్ సర్కార్

సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నీరుగార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టీఐ చట్టం కింద పౌరులు, జర్నలిస్టులు, వివిధ సంస్థలు అడుగుతున్న ప్రశ్నలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి విదేశీ, ఢిల్లీ పర్యటనలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాల విషయంలో గోప్యతను పాటిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పథకాలు మరియు ప్రచారాలకు నిధుల కేటాయింపు మరియు ఖర్చులకు సంబంధించిన ప్రశ్నలపై స్పందన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఐ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తుంగలో తొక్కడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి రేవంత్ రెడ్డి 20 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. దీంట్లో మెజారిటీ పర్యటనలు పార్టీ వ్యవహారాలకు సంబంధించినవే. వీటి ఖర్చు ప్రభుత్వం భరించిందా లేక రేవంత్ సొంత డబ్బులా అనే స్పష్టత కోసం వేసిన ఆర్టీఐ అప్పీల్‌పై ప్రభుత్వం మౌనం వహిస్తుంది. వేరే అంశాల్లో కూడా ఇలాంటి ముఖ్యమైన సమాచారం విషయంలో కాంగ్రెస్ సర్కార్ పెదవి విప్పటం లేదు.

ఇలా.. గత ఎనిమిది నెలల్లో దాఖలైన అనేక ఆర్టీఐ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు అధికారులు పరిమితమైన సమాచారాన్ని, పాక్షిక సమాధానాలను ఇస్తున్నారు, కొన్నిటిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రేవంత్ హయాంలో ప్రభుత్వ సమాచారాన్ని అందించడంలో పారదర్శకత లోపించింది అని ప్రజాస్వామ్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కాంగ్రెస్ సర్కార్ సమాధానాలు దాటవేస్తున్న కొన్ని ప్రశ్నలు

  1. సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి ఎన్నిసార్లు, ఎందుకు వెళ్లింది? వాటికి ఎంత ఖర్చయింది?
  2. డిసెంబర్ 2023 నుండి జనవరి 2024 వరకు మంత్రులు విదేశాలకు ఎన్నిసార్లు, ఎందుకు వెళ్లారు? అయిన ఖర్చు ఎంత?
  3. దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎంత మంది ప్రభుత్వ అధికారులు, నేతలు, ఇతరులు వెళ్లారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ప్రయాణాలకు ఎంత ఖర్చైంది ?
  4. ప్రజా పాలన కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దరఖాస్తు ఫారంల ముద్రణతో సహా ప్రచార ఖర్చు ఎంత?
  5. డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 31, 2023 మధ్య తెలంగాణ నీటిపారుదల శాఖలో కాంట్రాక్టర్లకు ఎన్ని కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించారు? వివరాలు ఏమిటి?
  6. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ప్రైవేటు పాఠశాలల్లో డీఈవోలు, ఎంఈఓలు ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించారు, ఫలితాలు ఏంటి?
  7. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం కింద ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎన్ని పరిష్కరించబడ్డాయి మరియు ఈ కార్యక్రమానికి అయిన ఖర్చు ఎంత?
  8. జూన్ 2, 2024న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల వారీగా ఎంత నిధులు విడుదల చేసింది?