mt_logo

ఇంటర్నెట్ నుండి ఫోటోలు కాపీ కొట్టి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్!

నకల్ మార్నే కే లియే భీ అకల్ చాహియే అంటారు.. కనీసం కాపీ కొట్టడం కూడా సరిగ్గా రాక కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. ఇప్పటికే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో అభాసుపాలైన రేవంత్ సర్కార్.. మొన్న మూసీ మీద సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్‌తో మరింత అపప్రద మూటగట్టుకుంది.

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ స్వరూపం ఎలా ఉండబోతుందో ఒక వీడియో ద్వారా ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫ్లాప్ అయింది. మూసీ తీరం వెంట రాబోయే భారీ కట్టడాలు ఎలా ఉండబోతాయో చూపించడానికి వాడిన ఫోటోలను ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసి కాంగ్రెస్ సర్కార్ నవ్వులపాలైంది.

ప్రెజెంటేషన్‌లో వాడిన ఫోటోలు ఇంటర్నెట్ నుండి కాపీ కొట్టారని ఆధారాలతో సహా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టడంతో రేవంత్ పరువు మూసీ పాలైంది. గూగుల్‌లో ఉచితంగా దొరికిన ఏఐ ఫోటోలు ఎత్తుకొచ్చి, దాన్నే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ అని చూపించిన రేవంత్ రెడ్డి తీరు సోషల్ మీడియాలో పెద్ద వివాదస్పదమైంది.

లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అని చెప్పుకునే ప్రాజెక్టు చేసే ఆ అంతర్జాతీయ కంపెనీ ఇంత కక్కుర్తిగా గూగుల్ సెర్చ్‌లో ఉచిత ఫొటోలు ఎత్తుకురావడం ఎందుకు ఏంటని.. ఆ గొప్ప కంపెనీ స్వంతంగా డిజైన్ కూడా చేయలేదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిపాదన దశలోనే ఇంత మోసం చేస్తున్నారంటే, రేపు అసలు ప్రాజెక్టులో ఇంకెన్ని మోసాలు చూడాల్నో అని ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.