mt_logo

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఫలితం

అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే. తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు వివరించిన కేటీఆర్, ఇవాళ అంతర్జాతీయ సంస్థలెన్నో తెలంగాణ బాట పట్టాయన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడవాలని ఆహ్వానించారు. ఆయా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాయి. 

  1.  సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్న రైట్ కంపెనీ

రైట్ సాఫ్ట్ వేర్ (Rite Software) కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కే తారక రామారావు తో ఈరోజు సమావేశమైంది. హైదరాబాద్ లో త్వరలో జరిగే డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ను కంపెనీ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఈ కొత్త డెవలప్మెంట్ సెంటర్ తో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలతో కంపెనీకి భాగస్వామ్యం ఏర్పడుతుందని తెలిపింది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తామన్న రైట్ సాఫ్ట్ వేర్, తమ విస్తరణ ప్రణాళికలను కేటీఆర్ కి వివరించారు. త్వరలోనే వరంగల్ నగరంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

  1.  హైదారాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేయనున్న మాండీ హోల్డింగ్స్

మాండి హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, CEO ప్రసాద్ గుండు మొగుల నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం హ్యూస్టన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసింది. తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సెంటర్ తో రెండువేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపింది. 

  1.  విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన స్టోరబుల్ 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను కలిగి ఉన్న స్టోరబుల్ కంపెనీ మరిన్ని విస్తరణ ప్రణాళికలను మంత్రి కే తారకరామారావుతో సమావేశం అనంతరం ప్రకటించింది. స్టోరబుల్ కంపెనీకి చెందిన జొనాథన్ లూయిస్, నీల్ వర్మల నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం కేటీఆర్ ను కలిసింది. 

అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లో 41,000 స్టోరేజ్ సేవలను అందిస్తున్న ఈ టెక్ దిగ్గజం హైదరాబాద్ లో ముందుగాల 100 మంది సాఫ్ట్ వేర్ డెవలపర్లను నియమించుకోనుంది. ఆ తర్వాత రీసెర్చ్ డెవలప్ మెంట్ కోసం మరికొంతమంది నిపుణులను నియమించుకుంటామని తెలిపింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) తో పాటు స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామంది.

  1.  తెలంగాణలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రేవ్ గేర్స్ ఆసక్తి

టెక్సాస్‌కు చెందిన ‘రేవ్ గేర్స్’కు చెందిన యాజమాన్య బృందం హ్యూస్టన్ లో మంత్రి కె.తారకరామారావుతో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. కేటీఆర్ తో సమావేశం అనంతరం తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రేవ్ గేర్స్ ఆసక్తి చూపింది.

      5. మంత్రి కేటీఆర్ తో టెక్ జెన్స్ ప్రతినిధి బృందం సమావేశం

డిజిటల్ సొల్యూషన్స్, సప్లై చైన్ లో పేరొందిన టెక్ జెన్స్ కంపెనీ బృందం మంత్రి కేటీఆర్ ను కలిసింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై చర్చించింది. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ థింకింగ్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కంపెనీ  ముందుకు వచ్చింది. ప్రతిపాదిత కేంద్రం,  టెక్జెన్స్ కార్యకలాపాలకు ఊతమిస్తుందని, వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఆ సంస్థ  ప్రెసిడెంట్ లక్ష్మి యనిగళ్ల, సీఈవో రఘు కొమ్మరాజు లు ఆశాభావం వ్యక్తం చేశారు.

    6.  తెలంగాణ తో కలిసి పనిచేసే అవకాశాలపై మంత్రి కేటీఆర్ తో చర్చించిన చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్ 

బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్  ప్రతినిధి బృందం హ్యూస్టన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలతో పాటు ప్రభుత్వ విధానాలను వారికి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేటీఆర్ వారిని కోరారు.