
తెలంగాణ కోసం మన బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా సమైక్యవాదుల గుండెలు కరుగలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రంలోని సర్కారును అడుగడుగునా అడ్డుకొన్నారు. కుట్రలు.. ప్రలోభాలతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాలరాయాలని విశ్వప్రయత్నాలు చేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు చీకటి అవుతాయని భావించి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకొన్నారు. కానీ.. ఉద్యమ నేత కేసీఆర్ మడమ తిప్పలేదు. చావునోట్లో తలపెట్టి.. కేంద్రం మెడలువంచి మరీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో పచ్చబడ్డ తెలంగాణపై ఇప్పుడు మళ్లీ సమైక్యవాదుల కన్నుపడింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఏజెంట్‌లుగా చేసుకొని రాష్ట్రంలో మళ్లీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి వనరులు దోచుకొనేందుకు పన్నాగం పన్నుతారు. తాజాగా కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
తెలంగాణ బిడ్డలమంటూ కొత్త నాటకం!
మాజీ సీఎం వైఎస్సార్ కూతురు షర్మిల తాను తెలంగాణ కోడలినంటూ ఇక్కడ అడుగుపెట్టింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కిరాయి మూకలతో పాదయాత్ర కూడా చేసింది. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని అధికారిక గణాంకాలు చెప్తుంటే.. షర్మిల మాత్రం.. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని, అనేక సమస్యలు ఉన్నాయంటూ ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తూ ఉన్నది. చివరికి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి.. ఖమ్మం నుంచి బరిలో నిలువాలని చూస్తున్నది. అలాగే, వైఎస్సార్‌కు ఆత్మగా పిలిచే కేవీపీ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తనను తెలంగాణవాడిగా గుర్తించాలంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. షర్మిల తెలంగాణ కోడలైతే.. తాను ఆడబిడ్డనంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అంటున్నారు. ఈ మాటలు చూస్తుంటే పచ్చబడ్డ తెలంగాణలో సమైక్యవాదులు చొరబడి.. ఇక్కడి వనరులను దోచుకొనేందుకు పన్నాగం పన్నారని అర్థమవుతున్నదని తెలంగాణ మేధావులు అంటున్నారు. రాజన్న రాజ్యం కంటే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ హయాంలో వందరెట్లు అభివృద్ధి చెందిందని, అలాంటప్పుడు తమకు రాజన్న రాజ్యం ఎందుకని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన వెఎస్సార్ వెంట నడిచిన కేవీపీని తెలంగాణవాడిగా ఎలా గుర్తిస్తామని అంటున్నారు. 2009 డిసెంబర్ ప్రకటన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో కేవీపీదే కీలక పాత్ర అని గుర్తు చేస్తున్నారు. వైఎస్ హయాంలోనూ తెలంగాణ పట్ల చిన్నచూపు ప్రదర్శించారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఇదే మట్టిలో కలిసిపోతానంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. ఇక ‘తెలంగాణ బిడ్డ’ను అంటూ మాట్లాడుతున్న రేణుకా చౌదరి.. ఎందుకు పోతిరెడ్డిపాడు నీటి దోపిడీపై మాట్లాడడం లేదని నిలదీశారు. ఇక్కడి ప్రయోజనాలు పట్టనివారిని తాము ఎందుకు ఆదరించాలని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న సమైక్యవాదుల ఆటలను సాగనివ్వబోమని ప్రజలు హెచ్చరిస్తున్నారు.