mt_logo

చరిత్రగతిని మార్చిన కేసీఆర్ దీక్ష

 

-ఆరిపోయిందన్న ఉద్యమ దీపాన్ని జ్వాలలా మార్చిన ఘట్టం
-కేంద్రం దిగివచ్చేదాకా పోరాడిన తెలంగాణ
-11 రోజుల దీక్షతో ప్రకటన సాధించిన కేసీఆర్
-నాటినుంచి నేటి వరకు అలుపెరుగని ఉద్యమం
-నేడు సంపూర్ణ రాష్ట్రం ఏర్పాటు దిశగా తెలంగాణ

హైదరాబాద్ నవంబర్ 28 (టీ మీడియా): తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానంలో మరపురాని ఘట్టం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష. ఆ ఒక్క దీక్షే చరిత్రను మలుపు తిప్పింది. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో’ అంటూ ఉద్యమనేత ఇచ్చిన పిలుపు కోట్లాది ప్రజల హృదయాలను నేరుగా తాకింది. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్రం అల్లకల్లోలమైంది. దోపిడీ పాలకులకు కంటికి నిద్ర కరువైంది. రాష్ట్ర సాధనకు చేపట్టిన ప్రక్రియ ప్రజాస్వామ్యయుత రాజకీయ లాబీయింగుల దశనుంచి ఉద్యమాల దశకు పరిణామం చెందడానికి ఈ దీక్షే ప్రధాన కారణమైంది. ఒక్కోసారి మామూలు ఘటనలే చరిత్ర మలుపుకు కారణమవుతాయి. కేసీఆర్ దీక్షకు కారణం హైదరాబాద్ నగరాన్ని సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఫ్రీజోన్‌గా సుప్రీంకోర్టు ప్రకటించడం.

తెలంగాణ గొంతుకోసే 14 ఎఫ్ అనే ఆ నిబంధనను తక్షణమే రద్దు చేయించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. సీమాంధ్ర నాయకులు మోకాలొడ్డారు. కళ్లముందే తెలంగాణ బిడ్డలకు చివరకు చప్రాసీ పోస్టులు కూడా మిగిలే పరిస్థితి లేకపోవడంతో ఇక తెలంగాణ సాధన తప్ప మరో మార్గం లేదన్న నిర్దారణకు రావడంతో కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రకటించారు. సిద్దిపేట కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. చుట్టూ వేలాదిమంది యువకులతో దీక్ష సాగుతుందని భగ్నం చేయాలని చూస్తే మారణహోమం తప్పదని హెచ్చరించారు. దీక్ష విషయాన్ని ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతి, ప్రతిపక్షనేత ఎల్‌కే అద్వానీని కూడా కలిసి తెలియచేశారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తల్లిగా చెబుతున్నా వద్దని వారించారు. ప్రధాని ఓపిక పట్టాలన్నారు. ఇవాళ తెలంగాణ పాటపాడుతున్న అనేకమంది కాంగ్రెస్ నాయకులు నిందలు వేశారు. ఎత్తిపొడుపులు విసిరారు. అవహేళన చేశారు. అవేవీ పట్టించుకోకుండా గడువు వరకూ చూసి కేసీఆర్ కరీంనగర్‌కు చేరుకున్నారు. రాష్ట్రం ఊపిరి బిగబట్టింది.

నాటి ఘటనల క్రమం…

2009 నవంబర్ 28నాడు కేసీఆర్ హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బయలుదేరారు. కరీంనగర్‌కు చేరుకోగానే భారీ సంఖ్యలో అభిమానులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి పెద్ద ఎత్తున పోలీస్‌బలగాలు కేసీఆర్ ఇంటిని చుట్టుముట్టడం ప్రారంభించాయి. 28వ తేదీ రాత్రికే కేసీఆర్‌ను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కరీంనగర్‌లోని టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పార్టీ నాయకులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకానొక దశలో సీఆర్‌పీఎఫ్, రిజర్వ్ ఫోర్స్ బలగాలు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే కార్యకర్తలు కేసీఆర్ ఇంట్లోకి పోలీసులు వస్తే తమను తాము ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించడంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గారు.

నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ నిరాహార దీక్ష కీలక మలుపు అవుతుందని ఆనాడే ఆయన భావించారు. ఉదయానికే కేసీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. వేలాది సంఖ్యలో వాహనాలు వచ్చాయి. అదే సమయంలో పోలీసు బలగాలు కూడా కరీంనగర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 11గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి నుండి బయలుదేరే సమయానికి పోలీసుల మరోసారి రౌండప్ చేశారు. ఆయినా కార్యకర్తల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత పోలీసులు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో కేసీఆర్ ఎక్కారు. కేసీఆర్ ఇంటి నుండి బయలుదేరే సమయానికి కనీసం రెండు వేల వాహనాలు ర్యాలీలో ఉన్నాయి. కానీ పోలీసులు పథకం ప్రకారం ఎక్కడి వాహనాలను అక్కడే ఆపుతూ టైర్లలో గాలితీస్తూ కాన్వాయ్ లోని వాహనాలను తగ్గిస్తూ వచ్చారు.

కేసీఆర్ ఇంటినుండి అల్గునూరు చౌరస్తాకు వచ్చే దారి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే. కానీ రెండువేల వాహనాల వరకు పోలీసులు అదుపులోకి తీసుకుని వాటి చక్రాల్లో గాలి తీసేశారు. అల్గునూరు చౌరస్తాకు చేరకముందే మొత్తం వాహనాలను కంట్రోల్‌లోకి తీసుకున్న పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టి కేసీఆర్ వాహనాన్ని రౌండప్ చేశారు. కేసీఆర్‌ను వాహనం నుంచి దింపారు. ఈ సమయంలో కేసీఆర్ ప్రతిఘటించినా చుట్టుముట్టిన పోలీసులు ఆయన్ను, నాయకులు నాయిని నర్సింహ్మారెడ్డి, విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రొఫెసర్ జయశంకర్‌ను వారెంట్ కూడా లేకుండానే అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు.

ఉవ్వెత్తున్న ప్రజాందోళనలు..

కేసీఆర్ అరెస్టు వార్త తెలియగానే యావత్తు తెలంగాణ భగ్గుమంది. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 10 జిల్లాల్లో తెలంగాణ ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి కేసీఆర్ దీక్షకు మద్దతుగా ఆందోళనలు కొనసాగించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేశారు. మరోవైపు విద్యార్థులు ఉధృత పోరాటాలకు తెరతీశారు. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. దీక్ష కొనసాగి 11 రోజులూ ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. కేసీఆర్‌ను ఖమ్మం జైలు నుండి నిమ్స్‌కు తరలించే వరకు తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలు సాగించిన పోరాటం అజరామరమే అని చెప్పాలి. ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారడం, తెలంగాణ సమాజం మొత్తం భీతిల్లిపోతున్న తరుణంలో కేంద్రంలో వేగంగా అడుగులు పడ్డాయి. ఒకేరోజు మూడునాలుగు కోర్‌కమిటీ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది.

ఆ మేరకు అనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9, 2009న ప్రకటించారు. అంటే ఈ 11 రోజుల పాటు యావత్తు తెలంగాణ సాగించిన పోరాటం ఫలితం కళ్ల చూశాకే విరమణ ప్రకటించింది. కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ఫలితంగానే కేంద్రం ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు యూటర్న్ తీసుకోవడం, వారు చేసిన ఉత్తుత్తి రాజీనామాలను నాటి స్పీకర్ గోరంతలను కొండంతలుగా కేంద్రానికి సమాచారం అందచేయడంతో కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు బ్రేకు వేసింది.

తెలంగాణ పునఃనిర్మాణం

10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే తన లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఏనాడూ తన లక్ష్యాన్ని విస్మరించలేదు. తెలంగాణ సాధించడం కష్టం కాదనే నమ్మకాన్ని ఇచ్చింది కేసీఆర్ చేసిన దీక్ష, దాని ఫలితం. దీన్ని చూసిన ప్రజలు సంపూర్ణ తెలంగాణ దిశగా పోరాటాలు సాగించారు. ఇప్పుడు కేంద్రం గతంలో చేసిన తప్పులు చేయకుండా ఎవరుసై అన్నా అనకున్నా ప్రజల ఆకాంక్షలను తీర్చేదిశగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలోనే కేసీఆర్ మరో ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ పునఃనిర్మాణాన్ని కూడా ఒక ఉద్యమంలా చేపట్టి యావత్తు తెలంగాణ సమాజాన్ని చిరునవ్వుల్లో చూడాలని తనకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దానిపై వివిధ రంగాల మేధావులతో ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.

ఇక ఉద్యమాల యుగమే…

అయితే ఆ పరిణామాలు తెలంగాణ సమాజాన్ని నిరుత్సాహ పరచలేదు. ‘ఔర్ ఏక్ ఢక్కా తెలంగాణ పక్కా’ అనేది ఆబాలగోపాలానికి తారకమంత్రమైంది. తెలంగాణ సాధన సాధ్యమేనన్న ఆత్మవిశ్వాసం ప్రజల్లో బలపడింది. పోరాటాలే మార్గమన్న భావనా దృడమైంది. ఈ క్రమంలో జేఏసీ ఆవిర్భావంతో తెలంగాణ సమాజానికి ఓ దిక్సూచి దొరికింది. డిసెంబర్ 23న కేంద్రం తెలంగాణపై వెనక్కి తగ్గిన సమయంలోనే కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ నేతలతో మాట్లాడి ఏర్పరిచిన జేఏసీ అన్ని వర్గాలకూ వేదిక అయింది. టీఆర్‌ఎస్ ఆఫీసు పక్కనే ఉన్న కళింగ ఫంక్షన్ హాల్లో దీన్ని ఆవిర్భావం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు కురుస్తున్న కాలంలోనే రాజకీయంగా కేంద్రాన్ని ఒత్తిడిలోకి నెట్టేందుకు ఈ కమిటీ ఏర్పడింది. ఇక పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లు ఏకకాలంలో ఉరకలెత్తాయి. కేసీఆర్ ప్రారంభించిన దీక్ష, ఆయన ఆధ్వర్యంలో ఏర్పడ్డ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైనవిగా చెప్పువచ్చునని రాజకీయ వేత్తలు అంటారు.

Courtesy: Namasthe Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *