mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆర్ధిక సంక్షోభం: రాకేష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్.. మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్ ప్రదేశ్ నేడు తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్ధిక సంక్షోభం వస్తుంది అని విమర్శించారు.

తెలంగాణ తలసరి ఆదాయం పదేళ్ళల్లో పెరిగింది.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పీకి పందిరి వేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలింది. కట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదు. హైదరాబాద్ నగరంలో టూలెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి అని మండిపడ్డారు.

రాష్ట్రంలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ కుంటుపడింది. టూరిజం ఇండస్ట్రీ కుదేలు అవుతోంది. రాష్ట్రంలో మనీ సర్క్యులేషన్ లేదు. గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది అని ధ్వజమెత్తారు.

ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. పీఆర్సీ పత్తా లేదు. ప్రధానికి రాసిన లేఖతో రేవంత్ రెడ్డి బండారం బయటపడింది. రూ. 18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు అని అన్నారు

సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు.. తొమ్మిది నెలల్లో ప్రభుత్వానికి రూ. 89 వేల కోట్లు రావాల్సివుండగా రూ. 73 వేల కోట్లు మాత్రమే వచ్చింది. అభివృద్ధి నిధులను కేవలం ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ రైతు భరోసాతో రైతులకు భరోసా లేకుండా పోయింది అని విమర్శించారు.

ఆర్ధిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోంది.. రాష్ట్రంలో ఆర్ధిక ఎమెర్జెన్సీ వచ్చే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి రావడంతోనే కూల్చుడు మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నారు.. హైడ్రా ఎజెండా ఏంటి అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.

గత సంవత్సరం పది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఈ సంవత్సరం తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరగలేదు. మూసీ ప్రక్షాళన కాదు రేవంత్ రెడ్డి మైండ్ ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి మతి లేదు.. మూసీ సుందరీకరణతో వచ్చే ఆదాయం ఏంటో సీఎం చెప్పాలి అని అడిగారు.

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు లాభం జరుగుతుంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎవరికి అన్నం పెడుతుంది. మూసీ సుందరీకరణ తెలంగాణ ప్రజలకు సున్నం పెడుతుంది. మూసీ నిర్వాసితులను గూడు లేని పక్షులుగా రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నారు అని పేర్కొన్నారు.

మనుషులను హింసించేది అభివృద్ధి కాదు.. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ఎక్కడ ఉంది. మూసీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌తో రేవంత్ రెడ్డి ముందే కుమ్మక్కు అయ్యారు. రేవంత్ రెడ్డికి స్వంతంగా విజన్ లేదు అని దుయ్యబట్టారు.

సీఎం స్థాయిలో ఉండి కాకతీయ కళాతోరణాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు.. రేవంత్ రెడ్డి స్థిరమైన పాలసీతో ముందుకు వెళ్ళాలి. ఒక్క స్క్వేర్ ఫీట్‌కు 45 రూపాయలు సీఎం వసూలు చేస్తున్నారు. మూసీపై అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి పిలవాలి.. హైడ్రాను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.