mt_logo

మార్పు, మార్పు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: రాకేష్ రెడ్డి

మార్పు, మార్పు అంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు పరిపాలనకు పట్టుగొమ్మలు.. ప్రభుత్వ ఉద్యోగుల చైతన్యం తెలంగాణ ఉద్యమంలో చూశాం. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది అని అన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఏడు నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు రావడం లేదు. ఇంటి పన్నులు వసూలు చేసి ఖజానా నింపే గ్రామ పంచాయతీ సిబ్బంది నేడు పస్తులు వుండే పరిస్థితి వచ్చింది. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు.

మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు.. తొమ్మిది జిల్లాల్లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు రావడం లేదు. ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం ఎట్లా చెప్తోంది. కొద్దిమందికి మాత్రమే ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు ఇస్తోంది. మిగిలిన వాళ్లకు 9వ తేదీ, 15వ తేదీన జీతాలు ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.

జూనియర్ కళాశాలల్లో ఉన్న అధ్యాపకులు, డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్లు అధ్యాపకులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆశా వర్కర్లు తమకు జీతం పెంచాలని ధర్నాలు చేశారు. చిరు ఉద్యోగులంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా మారింది అని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదు.. మంత్రులకు తమ శాఖల బాధ్యత తెలియదు. మార్పు, మార్పు అంటూ ప్రజలను మోసం చేశారు. చిరు ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి. ఆగస్టు 15న చిరు ఉద్యోగులకు చిరు కానుకగా పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలి అని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజన సిబ్బందికి ఇచ్చేది నెలకు 3 వేల రూపాయల లోపే.. ఆ చిన్న మొత్తం చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఏలు చెల్లిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా అమలు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని అన్నారు.. ఉద్యోగుల హెల్త్ స్కీం కూడా సరిగా అమలు కావడం లేదు అని ధ్వజమెత్తారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు.. అది కూడా అటకెక్కింది ఆరు నెలల్లో పీఆర్సీని వేసి కొత్త పేస్కెల్ అమలు చేస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలుపుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో ఉచిత వైద్యం అందించాలి.. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగుల పక్షాన కార్యాచరణ తీసుకుంటాము అని స్పష్టం చేశారు.

జీవో నెంబర్ 33 వలన తెలంగాణ విద్యార్థులు స్థానికులు కాకుండా పోతున్నారు. పాత పద్దతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జీవో నంబర్ 33ని ప్రభుత్వం సవరణ చేయాలి అని అన్నారు.

జీవో 46ను సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మాట తప్పింది.. హైకోర్టులో జీవో 46పై వాదనలు నడిస్తే అడ్వకేట్ జనరల్ హాజరు కావడం లేదు.జీవో 46పై న్యాయస్థానంలో పడ్డన్ని వాయిదాలు మరే కేసులో పడలేదు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జీవో 46ను రద్దు చేసి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసిన గ్రామీణ యువతకు న్యాయం చేయాలి అని రాకేష్ రెడ్డి సూచించారు.