సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఓ ఎడారి. తలాపునే గోదారి.. బిరబిరా కృష్ణమ్మ పరుగులుపెడుతున్నా మన పొలాలకు మళ్లించుకోలేని దుస్థితి. సమైక్య పాలకుల పట్టింపులేమితో సాగునీరు అందక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయాయి. దేశానికి అన్నంపెట్టే రైతన్న వ్యవసాయం విడిచి.. బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయికి వలసెళ్లిపోయాడు. నీళ్ల కోసం చాలామంది రైతులు బోర్లేసి బొక్కాబోర్లా పడ్డారు. చేసిన అప్పులు తీర్చేదారిలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ వచ్చాక..సీఎం కేసీఆర్ మొదట వ్యవసాయంపైనే దృష్టిసారించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయతో తెలంగాణ గడ్డపై జలసిరులు కురిపించారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ, సకాలంలో ఎరువులులాంటి విప్లవాత్మక పథకాలు అమలు చేసి, సాగును సంబురం చేశారు. నాడు తెలంగాణలో దండుగగా మారిని వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మార్చారు. ఫలితంగా తెలంగాణలో పసిడిపంటలు పండుతున్నాయి. దేశానికే అన్నంపెట్టే బువ్వగిన్నెగా తెలంగాణ అవతరించింది. ఈ ఏటకూడా వానకాలం రికార్డు స్థాయిలో పంట సాగు నమోదైంది.
గతేడాదితో పోల్చితే 2.5 లక్షల ఎకరాలు ఎక్కువే
సకాలంలో వర్షాలు కురవడం, కాళేశ్వర జలాలతో చెరువులు, ప్రాజెక్టులను నింపుకోవడంతో తెలంగాణలో వానకాలం సాగు సంబురంగా మొదలైంది. అటు రైతు బంధు, రుణమాఫీ అమలుతో జోష్‌లో ఉన్న రైతాంగం ఉత్సాహంగా సాగుబాట పట్టింది. ఫలితంగా ఈ వానకాలం సీజన్‌లో 1.09 కోట్ల ఎకరాల్లో పంట సాగైంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 1.07 లక్షల ఎకరాల్ల పంట సాగు కాగా, నిరుడి కంటే ఈ సారి 2.5 లక్షల ఎకరాలు ఎక్కువగా పంట సాగుకావడం విశేషం.
వానకాలం పంటసాగు వివరాలు
సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 1.24 కోట్ల ఎకరాలు
ఇప్పటివరకూ సాగుశాతం 88.37 శాతం
వరిసాగు 49.21 లక్షల ఎకరాలు
పత్తి సాగు 45.03 లక్షల ఎకరాలు
మక్క సాగు 5.15 లక్షల ఎకరాలు
కంది సాగు 4.57 లక్షల ఎకరాలు
మొత్తం సాగు 1.09 కోట్ల ఎకరాలు