
రైల్వే క్రాసింగ్ అంటేనే ప్రాణ భయం.. మానవరహిత క్రాసింగ్‌లతో నిత్యం ప్రమాదాలే. వీటివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జామ్‌లు దీనికి అదనం. ఆ మార్గాల్లో వెళ్లేవారికి నిత్యం నరకమే. అయితే, వీటికి తెలంగాణ సర్కారు చెక్ పెట్టింది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దేండ్లలో ప్రభుత్వం రూ.2,528. 18 కోట్ల వ్యయంతో 53 కొత్త ఆర్వోబీ/ఆర్‌యూబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి, రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 28 ఇప్పటికే పూర్తికాగా, మరో 25 నిర్మాణ దశలో ఉన్నాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీ/ఆర్వోబీలు 32 మాత్రమే ఉండేవి. రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో రైల్వే నెట్‌వర్క్ విస్తరించి ఉండగా, అనేకచోట్ల మానవరహిత రైల్వే క్రాసింగ్‌లు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలుచోట్ల గేట్లు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రెండు వైపులా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. గేట్ల వద్ద వాహనదారులకు ఎంతో సమయం వృథా అవుతున్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుసటి నెలలోనే (2014 జూలై) మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో 10 మందికిపైగా విద్యార్థులు చనిపోయారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో ఎక్కడా మానవ రహిత రైల్వే క్రాసింగ్‌లు లేకుండా చూడాలని, ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్న క్రాసింగ్‌ల వద్ద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రైల్వేశాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రధాన ప్రాంతాలు, పట్టణాల్లో 53 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రూ.2,528.18 కోట్ల వ్యయంతో ఆర్వోబీలు, ఆర్‌యుబీల నిర్మాణం చేపట్టారు.
రాష్ట్ర ఏర్పాటు తరువాత పూర్తయిన ఆర్వోబీ/ ఆర్‌యూబీలు (మొత్తం-28):
కాగజ్‌నగర్, బెల్లంపల్లి, దేదుకూర్ గేట్, బోనకల్ యార్డు, ఎర్రుపాలెం, ధమసాలపురం, అప్పనపల్లి, లింగంపల్లి, ఆలేరు, శంకరపల్లి, రామగుండం, ఘన్‌పూర్, బీబీనగర్, భువనగిరి, నెక్కొండ, వరంగల్ టౌన్, వరంగల్ అర్బన్ బట్టల బజార్, నాగులపల్లి, బిజిగిరి షరీఫ్, ఇందారం-కుందారం, ఆనంద్‌బాగ్, గద్వాల, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం-దేవరపల్లి రోడ్-1, ఖమ్మం-దేవరపల్లి రోడ్-2, దేవరకద్ర, చర్లపల్లి.
పురోగతిలో ఉన్న ఆర్వోబీ/ ఆర్‌యూబీలు (మొత్తం-25): ఆసీఫాబాద్ జిల్లా సిర్పూర్, మంచిర్యాల జిల్లా రవీంద్రఖని, బెల్లంపల్లి-మందమర్రి, ఆదిలాబాద్ మార్కెట్ యార్డు, పెద్దపల్లి, కరీంనగర్ యార్డు, హనుమకొండ జిల్లా ఉప్పల్, లింక్‌రోడ్, కాజీపేట రెండవ ఆర్వోబీ, మున్సిపల్ ఫిల్టర్ బెడ్స్, హనుమకొండ దర్గా, వరంగల్ కేఎంటీ పార్క్, డోర్నకల్, ఘట్కేసర్, రంగారెడ్డి జిల్లా చట్టాన్‌పల్లి, వికారాబాద్ జిల్లా తాండూర్ టౌన్, నల్లగొండ టౌన్, భువనగిరి, లింగంపేట జగిత్యాల-నిజామాబాద్ సెక్షన్, నిజామాబాద్ జిల్లా మాధవనగర్, నిజామాబాద్ బైపాస్, జహీరాబాద్, సిద్దిపేట కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, భద్రాచలం కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, ఇల్లందు.