భేష్.. బాగా పనిచేస్తున్నారు శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనీటి విందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతితో కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్రపతి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
నా దగ్గరికి వచ్చిన చాలామందిని కొత్త రాష్ట్రం ఎలా ఉందని అడిగాను.. బాగా చేస్తున్నారు. పథకాలు బాగున్నాయంటూ అందరూ నాకు చెప్పారు. మంత్రుల టీం కూడా బాగుంది. తెలంగాణ కొత్త రాష్ట్రం అనే ఫీలింగ్ కూడా కనిపించడం లేదు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అదేస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు మీరు చేస్తున్న కృషి, ప్రణాళికలు బాగున్నాయి.. గో అహెడ్..! అని రాష్ట్రప్రతి కేసీఆర్ ను అభినందించినట్లు తెలిసింది. రాష్ట్రపతితో సమావేశం అనంతరం బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రపతి చాలా హాపీగా ఉన్నారని, క్రమశిక్షణ, పకడ్బందీ ప్రణాళిక, మొక్కవోని దీక్ష, పక్కాగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందనను ఈ ప్రశంస ప్రతిఫలిస్తున్నదని సంతోషంతో అన్నట్లు తెలిసింది.
ఇదిలాఉండగా రాష్ట్రపతి భవన్ లో 10 రోజులపాటు గడిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఉదయం హకీంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పోచారం, నాయిని, సీఎస్ రాజీవ్ శర్మ తదితరులు ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఆల్బంను, వెండి నెమలి ప్రతిమను సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి బహూకరించారు.