
కేంద్రంలోని బీజేపీ సర్కారు నిరుపేదల బతుకులు మార్చే ఒక్క మంచి పథకం కూడా ఇప్పటివరకూ అమలుచేయలేదనే విమర్శలున్నాయి. ఆ పార్టీ పేదలను కొట్టి కార్పొరేట్లకు పెట్టే సంస్కృతినే ఆదినుంచీ అమలు చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల కోసం కనీసం ఏమీచేయలేని ఆ పార్టీ తమ ఉనికిని చాటుకొనేందుకు మతం పేరుతో రెచ్చగొడుతూ దేశంలోని మెజార్టీ వర్గాన్ని ఆకట్టుకొంటుందనే అపవాదు ఉన్నది. ఇందులో భాగంగానే ఓ వర్గం పేరుతో ఉన్న ప్రముఖ పట్టణాల పేర్లను మార్చుతూ మెజార్టీ ప్రజలను ఆకట్టుకుంటూ వస్తున్నది. మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా.. ఇలా దాదాపు 25 పేర్లను మార్చింది. ఇప్పుడు ఏకంగా ఏండ్ల చరిత్ర ఉన్న ఇండియా పేరునే భారత్‌గా మార్చేందుకు యత్నించడంపై ప్రజలనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారును భారత ప్రజలు, మేధావులు సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఇండియా పేరును భారత్‌గా మారుస్తారా?
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనను సభ్యుల ఎదుట ఉంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇండియా పేరును భారత్‌గా మార్చుతూ తీర్మానం ప్రవేశపెట్టి.. దాన్ని ఆమోదించేందుకు మోదీ సర్కారు పెద్ద పన్నాగమే పన్నిందని సమాచారం. ఇందుకు రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అందిన అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటమే బలం చేకూరుస్తున్నది. దీనిపై దేశవ్యాప్తంగా మేధావులు, భారత ప్రజలనుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. తమకు గేమ్ చేంజర్లు (తమ బతుకును మార్చేవారు) కావాలని.. నేమ్ చేంజర్లు వద్దంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు మోదీ సర్కారుకు చురకలంటిస్తున్నారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న దేశంలో ఓట్ల కోసం చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. పేర్లు మారిస్తే ఏం ప్రయోజనం.. నిరుపేదల బతుకులు మారుతాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఇండియా పేరును మారిస్తే ఊరుకోబోమని బీజేపీ సర్కారును హెచ్చరిస్తున్నారు.