తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించి తామే అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులే సమాధి కడుతున్నారు. రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న పార్టీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రాణం పోసేందుకు ఎంతకైనా దిగజారుతుండగా.. హస్తం నాయకులు టికెట్ల కోసం కొట్లాడుతూ వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ పీక నొక్కుతున్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎన్నిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కోరింది. దీంతో ఒక్కో స్థానం నుంచి నలుగురు, ఐదుగురు దరఖాస్తులు చేసుకొన్నారు. టికెట్ తమకే రావాలంటే తమకే రావాలని పట్టుబట్టుకొని కూర్చున్నారు. పోటీలో ఉన్న నాయకులపై ఆ పార్టీ నాయకులే బురద జల్లుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఇదేనని నిరూపిస్తున్నారు. మొన్న సిరిసిల్లలో ఇరువర్గాలు దాడికి దిగగా, నేడు హైదరాబాద్‌లో సీనియర్ నాయకుడు మధుయాష్కీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే పోస్టర్లు వేయడం చర్చనీయాంశమైంది. టికెట్ల కోసం కాంగ్రెస్ నాయకులు ఎంతకైనా దిగజారుతారని ప్రజలకు తెలిసిపోయింది.
పారాచూట్ లీడర్ మాకొద్దు.. మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు
మధుయాష్కీగౌడ్.. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. నిజామాబాద్ మాజీ ఎంపీ. ప్రచార కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఎల్బీనగర్ అసెంబ్లీ నుంచి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, అదేస్థానంనుంచి టికెట్ ఆశిస్తున్న స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డినుంచి మధుయాష్కీకి వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇన్నిరోజులు తాము పార్టీకోసం ఇక్కడ పనిచేశామని.. ఇప్పుడు మధుయాష్కీకి ఇక్కడ టికెట్ ఇస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా గాంధీభవన్‌లోనే పారాచూట్ లీడర్ మాకొద్దు అంటూ మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ఓ సీనియర్ నాయకుడిపైన సాక్షాత్తు గాంధీభవన్‌లో పోస్టర్లు వెలువడం కలకలం రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఉన్న సఖ్యతకు అద్దంపడుతున్నది. టికెట్ల కోసమే ఇంతలా దిగజారిపోతున్న నాయకులు.. గెలిపిస్తే తమను ఎలా పాలిస్తారోనని ప్రజలు చర్చించుకొంటున్నారు.