తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ప్రాజెక్టుకు వెంటనే బొగ్గు కేటాయింపులు చేయాలని అప్పటికప్పుడే బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అదనంగా మరో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మాట్లాడారు.
దీనిపై రాజీవ్ శర్మ సమాధానం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కేటాయించామని, దీనికి సరిపడా భూమి కూడా ఉందని, పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ కూడా నిర్వహించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇవ్వాల్సి ఉందని, అలాగే తగిన బొగ్గు కేటాయింపులు చేయాల్సి ఉందని ప్రధాని దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మోడీ సంబంధిత శాఖలకు ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ సమస్యలు లేకుండా తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రామగుండం ఎన్టీపీసీలో అదనంగా 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై కేంద్రంతో పలుసార్లు మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ రాజీవ్ శర్మతో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.