
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేశారు. 119 నియోజకవర్గాలకు 115 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించి రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచారు. తాను గజ్వేల్, కామారెడ్డినుంచి పోటీ చేస్తానని ప్రకటించి, ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. కాగా, తమ గడ్డ నుంచి బీఆర్ఎస్ అధినేత, సాక్షాత్తూ సీఎం కేసీఆరే పోటీచేస్తుండటంతో కామారెడ్డి ప్రజలు ఉబ్బితబ్బిబైపోతున్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ సారథి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొంటామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కేసీఆర్‌కు మద్దతుగా నియోకవర్గాల్లోని గ్రామాల్లో ర్యాలీలు తీసి, ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్ప మరెవరికీ ఓటేయబోమని తీర్మానాలు చేసి, ఆయా మండలాధ్యక్షులకు అందజేశారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో వైశ్య, రెడ్డి, గౌడ, హోలియా దాసరి, ఒడ్డెర, ఇతర కులస్థులంతా కలిసి తమకు తామే స్వచ్ఛందంగా ర్యాలీ తీశారు. అభివృద్ధి, సంక్షేమంతో తమ తలరాత మార్చిన కేసీఆర్ వెన్నంటే ఉంటామని తీర్మానించారు. ఇప్పటికే కామారెడ్డి అభివృద్ధిలో ముందున్నదని, సీఎం కేసీఆర్‌ను ఇక్కడ గెలిపించుకొని రెట్టింపు అభివృద్ధి చేసుకొంటామని పేర్కొంటున్నారు.
కామారెడ్డికి కేసీఆర్.. కలవరంలో కాంగ్రెస్
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలని, గజ్వేల్ నుంచే పోటీచేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు ప్రతిసవాల్‌గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించడంతోపాటు తాను గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని ప్రకటించి రేవంత్‌కు దిమ్మతిరిగేలా చేశారు. అలాగే, కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న షబ్బీర్ అలీకి ముచ్చెమటలు పట్టించారు. తెలంగాణ సాధకుడు, అభివృద్ధి ప్రదాత అయిన కేసీఆర్ స్వయంగా కామారెడ్డిలో పోటీ చేస్తానని ప్రకటించడంతో షబ్బీర్ అలీకి ఓటమి భయం పట్టుకొన్నది. అక్కడి కాంగ్రెస్ శ్రేణులు నైరాష్యంలో మునిగిపోయాయి. సీఎం కేసీఆర్‌పై పోటీచేసి దారుణంగా ఓడిపోయేకన్నా వేరేదారి చూసుకోవాలంటూ షబ్బీర్ అలీకి స్థానిక నేతలు సూచిస్తున్నారు. దీంతో ఏమిచేయాలో తోచక షబ్బీర్ అలీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది.