కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే అని.. ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం.. డబ్బుల పరంగా చూస్తే 20 శాతం మాత్రమే అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా సీఎం, మంత్రులను రైతులను మాయ చేస్తున్నారు. రైతులకు అంతా మేమే చేశాం కేసీఆర్ హయంలో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలు చూసి గోబెల్స్ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునే వారు అని అని అన్నారు.
సీఎం చెబుతున్న లెక్కల ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత.. కానీ కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద చెల్లించాం. రెండో విడతలో 19 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి సిద్ధంగా ఉంచుకుని రూ. 12 వేల కోట్లు చెల్లించాం అని గుర్తు చేశారు.
ఇంకా ఏడు వేల కోట్లు కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదుతో చెల్లించకుండా మిగిలిపోయాయి. ఆ ఏడు వేల కోట్లు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయి. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయాంలో రూ. 19 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 6 వేల కోట్లకు ఎలా తగ్గింది.. ఎవర్ని మోసం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ఆంక్షల పేరిట రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసింది. కేసీఆర్ హయాంలో రైతుల అకౌంట్లలోకి పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు చేరింది. రూ. 70 వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ రైతులకిచ్చారు. రూ. 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చారు. రూ. 7 వేల కోట్లు లక్షా 20 వేల మంది రైతుల కుటుంబాలకు బీమా కింద చెల్లించారు అని తెలిపారు.
3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయాంలో రైతులు పండించారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చింది. కేసీఆర్ కట్టిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబరాలు చేసింది. కేసీఆర్ కట్టిన సచివాలయం నుంచి రైతు రుణమాఫీ చేశారు. కాంగ్రెస్ నేతలకు బూతులు తప్ప రైతుల మీద శ్రద్ధ లేదు అని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో పంట ఉత్పత్తి ఉత్పాదకత పెంచాం.. ప్రతి గింజ కొన్నాం.. రైతుల ఆనందాన్ని పెంచాం. రైతుభరోసా ఎందుకు వేయలేదు.. ఇంకా డ్రామాలు ఎందుకు చేస్తున్నారు. మంత్రులకు వాస్తవాలు తప్ప అన్నీ వస్తున్నాయి. రైతులు కూడా టాక్స్ పేయర్స్ యే.. రైతులను కించపరిచేలా మంత్రులు మాట్లాడొద్దు అని హెచ్చరించారు.
కాంగ్రెస్ చెప్పింది ఏమీ చేయలేదు.. కాంగ్రెస్ నేతల మొహంలోనే ఆనందం కనిపిస్తుంది తప్ప రైతుల మొహంలో లేదు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. రైతుభరోసా కింద రూ. 12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రుణమాఫీ కింద రూ. 6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అని రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
రుణమాఫీని కేసీఆర్ ఏ ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు రేవంత్ అమలు చేయాలి హరీష్ రావు రాజీనామా సవాలును సీఎం, కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారు. ఆరు గ్యారంటీలు, పదమూడు హామీలతో పాటు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు సవాల్ విసిరారు.. ఇప్పటీకీ హరీష్ రావు ఆ సవాల్‌కు కట్టుబడి ఉంటారు అని పేర్కొన్నారు.
రాజీనామాల నుంచి పారిపోయింది రేవంత్.. నిలకడగా నిలబడ్డది హరీష్ రావు మాత్రమే. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్న రేవంత్ మాట నిలుపుకోలేదు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల ఇంచార్జిగా బాధ్యత తీసుకున్నవు.. కాంగ్రెస్ ఓడిపోతే రాజీనామా చేశావా రేవంత్ అని అడిగారు.
రైతుభరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలి.. ఏ ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి.. సిద్దిపేట కలెక్టర్ కాంగ్రెస్ నేతల సంబరాల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.కేసీఆర్ హయాంలో గోడౌన్ల సామర్ధ్యాన్ని 40 లక్షల టన్నులకు పెంచాం.. వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆరే అని అన్నారు.