సమైక్య రాష్ట్రంలో సాగునీటికి అరిగోసపడ్డ తెలంగాణలో సీఎం కేసీఆర్ విజన్‌తో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. స్వరాష్ట్రంలో మొదట వ్యవసాయంపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చేందుకు ఓ ఇంజినీర్‌లా మారారు. మూడేండ్లలోనే ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించి, వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని భారీ బాహుబలి మోటార్లతో ఎత్తి.. బీడు భూములకు మళ్లించారు. నీరు పళ్లమెరుగు అనే నానుడిని మరిపించి.. సంకల్పం ఉంటే నీళ్లు ఎత్తుకు ఎగిసిపడును అని నిరూపించారు. భారీ పంపులు, సర్జ్‌పూల్‌లు, జలాశయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచానికే ఓ జలపాఠంలా మార్చారు. ఇప్పుడు కరువుకే కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే ఉమ్మడి పాలమూరును పచ్చబడగొట్టేందుకు కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాళేశ్వరానికి మించి భారీ మోటర్లు, పంపులతో కృష్ణమ్మను బీడు భూములకు బిరబిరా పరుగులు పెట్టించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న భగీరథ ప్రయత్నంలో తొలి అడుగుపడింది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను కృష్ణమ్మ నీటితో తడిపేందుకు సర్వం సిద్ధమైంది.
‘పాలమూరు’ డ్రైరన్ గ్రాండ్ సక్సెస్
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ విజన్‌తో ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్‌ఎల్‌ఐఎస్) శరవేగంగా సిద్ధమవుతున్నది. ఇటీవల మడమతిప్పని పోరాటం చేసిన తెలంగాణ సర్కారు పర్యావరణ అనుమతులు సాధించగా, ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకొన్నాయి. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద తొమ్మిది పంపుల్లో మొదటి పంప్‌హౌస్ డ్రైరన్‌ను ఇంజినీరింగ్ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి ఆధ్వర్యంలో పంప్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారు. ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా అందడంతో పంప్ నీటిని ఎత్తిపోసి, పాలమూరు ప్రాజెక్టులో సుజల దృశ్యాన్ని ఆవిష్కరించింది. తమ కళ్లముందే శ్రమకు ఫలితంగా నీళ్లు ఎగిసిపడుతుండడంతో అక్కడే ఉన్న ఇంజినీర్లు, మోటర్లు బిగించిన బీహెచ్ఈఎల్ టెక్నికల్ బృందం ఆనందంతో తడిసి ముద్దయ్యింది. డ్రైరన్ విజయవంతం కావడంతో ఇదే నెల 15 వెట్ రన్ నిర్వహిస్తామని, 18 లోగా అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్‌లోకి నీటిని వదులుతామని అధికారులు ధీమా వ్యక్తంచేశారు. వచ్చే యాసంగినాటికి పాలమూరు ప్రాజెక్టు ద్వారా జలాలను అందిస్తామని రజత్‌కుమార్ వెల్లడించగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమ సాగునీటి గోస తీరుస్తున్న తెలంగాణ సర్కారుకు, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.