mt_logo

4 కోట్ల టన్నులకు చేరువలో తెలంగాణలో వరి ఉత్పత్తి

  • 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది
  • రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశం
  • అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించే దిశగా కార్యాచరణ 
  •  అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం 
  • ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా  మరి కొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల  ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని, ఇటువంటి పరిస్థితులల్లో, రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెస్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అధనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. 

అదే సందర్భంలో…రాష్ట్రంలో నిల్వ వున్న 1 కోటి 10 లక్షల టన్నుల వరి ధాన్యం,  4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్ సి ఐ పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, ఈ పంట ఇట్లా వుంటే అధనంగా మరింత వరి ధాన్యం దిగుబడి కానున్న పరిస్థితుల్లో..  రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు  ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్తుతమున్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ  చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం వున్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉన్నదన్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో అధనంగా పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం  కమిటీని సీఎం ప్రకటించారు.  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా,  సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్,సివిల్ సప్లైస్  కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నరసింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారు.ఇందుకు సంబంధించి., శుక్రవారం నాడు డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘పంటకు పెట్టుబడి అందించడం నుంచి ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనేదాకా..దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇవ్వాల తెలంగాణ పచ్చ బడ్డది.  విపరీతంగా పంట దిగుబడి పెరిగింది. రైతు కుటుంబాలు సంతోషంగా వున్నాయి. ఇంకా వారి సంక్షేమం కోసం  ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పుడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారు. అధనంగా పండే పంటను దృష్టిలో వుంచుకుని మాత్రమే.. నూతనంగా  అధునాతన  మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం.  ఇందు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ‘సటాకె’ వంటి కంపెనీలతో చర్చించినం.  వారితో రేపటినుంచే కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించినం..’’ అని సీఎం అన్నారు.తెలంగాణ రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతని సీఎం పునరుద్ఘాటించారు.