mt_logo

“ప్రతి అక్షరం ప్రజాద్రోహం” – రెండవ భాగం

ప్రముఖ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన “ప్రతి అక్షరం ప్రజాద్రోహం” పుస్తకం రెండవ భాగం కింద చదవండి.

నిన్న ప్రచురితమయిన మొదటి భాగం ఇక్కడ చదవొచ్చు:

http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part1/

***

నిలువెల్లా కపటత్వం నిండిన నివేదిక

కాని ఆ కనీసమైన ఆశలను కూడ వమ్ముచేస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తిమ్మిని బమ్మిని చేసి, మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ ప్రజల మీద, ప్రజల సమస్యల మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మీద చాల అన్యాయంగా, దుర్మార్గంగా దాడి చేసింది. ఒక న్యాయమూర్తి అధ్యక్షుడుగా, ఒక ఆర్థికశాస్త్రవేత్త, ఒక సామాజికశాస్త్రవేత్త, ఒక న్యాయనిపుణుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆ నిపుణులకు తగిన మేధోస్థాయిలో నివేదిక రాయలేదు. కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన మాజీ హోంశాఖ కార్యదర్శికి సహజమైన పోలీసు బుద్ధితో, ప్రతి ప్రజాసమస్యనూ శాంతిభద్రతల సమస్యగా చూసే పోలీసు వైఖరితో నివేదిక తయారయింది. సమైక్యాంధ్రవాదులూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వమూ ఎంతో కాలంగా చెపుతూ వస్తున్న అబద్ధాలనే, అసత్యాల, అర్ధసత్యాల గణాంకాలనే ఈ కమిటీ నివేదిక యథాతథంగా స్వీకరించి, చిలకపలుకుల్లా వల్లించింది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకించడానికి తెలంగాణ ప్రత్యర్థులకు మరొక ఆయుధంగా నిలిచింది.

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖ అధికారికంగా వేసిన ఈ కమిటీ నివేదిక, సిఫార్సులు, స్వయంగా కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటించిన, ఆ మర్నాడు పార్లమెంటులో కూడ పునరుద్ఘాటించిన రాజకీయ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఉపయోగపడేలా తయారు కావలసి ఉండింది. ఆ రాజకీయ నిర్ణయాన్ని త్వరితం చేయడానికి, అటువంటి నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయడానికి ఇటువంటి విజ్ఞుల కమిటీల అధ్యయనాలు, సిఫారసులు పనికి వస్తాయనే ఆశతోనే ఈ కమిటీ విచారణకు తెలంగాణ ప్రజలు సహకరించారు. కాని ఆ సహకారాన్ని గుర్తించారో లేదో, తమకు అందిన లక్షకు పైగా అభ్యర్థనలను చదివారో లేదో, పది జిల్లాలలో ప్రజలు వినిపించిన గోడును విన్నారో లేదో తెలియని అయోమయ స్థితిలో తప్పులతడకగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తయారయింది.

నివేదిక సమర్పించడానికి 2010 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా, ఒకరోజు ముందే డిసెంబర్ 30న కమిటీ హోంమంత్రికి నివేదిక ఇచ్చింది. హోం మంత్రిత్వశాఖ 2011 జనవరి 6న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక మొదటి సంపుటం 461 పేజీల్లో, తొమ్మిది అధ్యాయాలలో (1. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం. 2. ప్రాంతీయ ఆర్థిక, సమానత్వ విశ్లేషణ. 3. విద్యా, ఆరోగ్య రంగాలు. 4. నీటి వనరులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల అభివృద్ధి. 5. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలు. 6. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన సమస్యలు. 7. సామాజిక, సాంస్కృతిక సమస్యలు. 8. శాంతి భద్రతలు, ఆంతరంగిక భద్రతా కోణాలు. 9. ముందడుగు) సమస్యలను చర్చించి, సూచనలు చేసింది. రెండవ సంపుటంలో 174 పేజీలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, తెలంగాణ సమస్యలకు సంబంధించిన కీలకపత్రాలలో కొన్నిటిని అనుబంధంగా చేర్చారు.

నివేదిక మొత్తంగానే అనేక అసత్యాలతో, అర్ధసత్యాలతో, వక్రీకరణలతో, తప్పుడు వాదనలతో నిండి ఉంది. వాస్తవాల గురించి కనీసమైన శ్రద్ధ కూడ లేకుండా, క్షమించరాని నిర్లక్ష్యంతో, తామే ఒకచోట చెప్పినదాన్ని మరొకచోట విస్మరిస్తూ, ఖండిస్తూ అనేక అబద్ధాలను చారిత్రక, గణాంక వాస్తవాలుగా రాశారు. ప్రతి ప్రజా సమస్యనూ శాంతిభద్రతల సమస్యగా చూసే పోలీసు భాషలో, అంకెల గారడీనే అభివృద్ధిగా చూపే పాలకవర్గ దృక్పథంతో నివేదికను నింపేశారు. చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక వాస్తవాలలోనుంచి తమ దృక్పథానికి, నిర్ధారణలకు అవసరమైనవాటిని, అవసరమైనంతమేరకు మాత్రమే ఉటంకిస్తూ మేధోపరమైన నిజాయితీ లేమిని ప్రదర్శించారు. గత యాభై ఐదు సంవత్సరాలలోని ప్రముఖ ఘట్టాలకు సంబంధించి అందరికీ తెలిసిన విషయాలను, అచ్చయి నలుపు తెలుపుల్లో ఉన్న విషయాలను కూడ తారుమారు చేస్తూ, ఉన్నది లేనట్టూ, లేనిదీ ఉన్నట్టూ రాశారు. మూడున్నర కోట్ల ప్రజలను, వారి ఆకాంక్షలను, తెలంగాణను పక్కనపెట్టి, పిడికెడు మంది బహుళజాతి సంస్థల, సంపన్నవర్గాల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, రాజకీయ దళారీల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ను ప్రధానం చేస్తూ నివేదిక రాశారు.
ఏ పేజీ తెరిచినా పొరపాట్లే పొరపాట్లు

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో డజన్లకొద్దీ పొరపాట్లు దొర్లాయి. అంకెలలో, పేర్లలో, స్థలాలలో, తేదీలలో, వాస్తవాలలో దొర్లిన ఈ పొరపాట్లు అచ్చుతప్పులయినా కావచ్చు, కిందిస్థాయి సిబ్బంది చేసిన పొరపాట్లయినా కావచ్చు. నేరుగా కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణకు గాని, ఆయా రంగాలలో నిపుణులయిన ఇతర సభ్యులకు గాని ఆ పొరపాట్లతో సంబంధం లేకపోవచ్చు. కాని మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల భవిష్యత్తును తేల్చే అధికారం ఉన్న, ఇరవై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పదినెలలపాటు శ్రమించిన కమిటీ నివేదిక ఇంత పెద్ద పొరపాట్లను సరిచూడకుండా ప్రచురించడం క్షమించడానికి వీలులేని నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేమిని సూచిస్తుంది. మేధోపరమైన అనైతికతను, అసంబద్ధతను, అజ్ఞానాన్ని, అవగాహనారాహిత్యాన్ని సూచిస్తుంది. కమిటీ నివేదికలో పొరపాట్లలో కొన్ని చూడండి:

• మొదటి అధ్యాయం (‘ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక పూర్వరంగం’) ప్రారంభం నుంచీ కూడ వాస్తవాలను వక్రీకరణ మొదలయింది. చారిత్రక వాస్తవాలను సమకాలీన ఆధారాలతో నిష్పాక్షికంగా ప్రస్తావించి, తమ అభిప్రాయం రాయడానికి ఎవరికైనా హక్కు ఉంది. కాని అసలు ఆ వాస్తవాలనే తప్పుగా చూపడం ద్వారా ఈ పూర్వరంగం ఒక తప్పుడు నిర్ధారణకు అవసరమైన భూమికను తయారు చేసింది. ఉదాహరణకు పే. 2 లోనే “ఇంగ్లిషు గాని, రాజ్యంలోని ప్రజల భాషగాని పాలనాభాషగా లేని ఏకైక స్వదేశ సంస్థానం నిజాం పాలనలోని హైదరాబాద్” అని రాశారు. హైదరాబాద్ 1948 వరకు పాలనాభాషగా ఉండిన ఉర్దూ ప్రజల భాషే. దాన్ని ప్రజల భాష కాదని అనడం భాషాప్రయుక్త రాష్ట్రం పేరు మీద సమైక్య ఆంధ్రప్రదేశ్ ను సమర్థించడానికి మాత్రమే. నిజానికి 1948 వరకూ హైదరాబాద్ రాజ్యంలో ఇతర ప్రజా భాషలు తెలుగు (48 శాతం ప్రజలు మాట్లాడేది), మరాఠీ (26 శాతం), కన్నడం (12 శాతం) లకు ఇవ్వని స్థానాన్ని 10 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడుతుండిన ఉర్దూకు ఇచ్చారని అప్పటి సామాజిక, రాజకీయ నాయకులు వాదించేవారు. అలా ఉర్దూను పాలనా భాషగా చేయడం కూడ ఆ భాష మీద, ఆ భాష మాట్లాడే ప్రజల మీద ప్రేమతో కాదని, అత్యధిక సంఖ్యాక ప్రజలను అణగదొక్కడానికేనని ఆ నాయకులు వాదించేవారు. ప్రస్తుతం శ్రీకృష్ణ కమిటీ ఆ వాదనలను ఇలా వక్రీకరిస్తున్నది.

• పే. 3లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు గురించి రాస్తూ “భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఒక హేతుబద్ధ పరిష్కారాన్ని పరీక్షించి సూచించేందుకు” ఆ కమిషన్ ను ఏర్పాటు చేశారని రాశారు. ఇది పూర్తిగా అబద్ధం. ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ 1953 డిసెంబర్ 29న విడుదల చేసిన ప్రకటనలో “భాషా సంస్కృతులు ముఖ్యమైనవే అయినప్పటికీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో దేశ సమగ్రతను, భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల”ని, “ద్రవ్య, ఆర్థిక, పాలనా పరమైన అంశాలు కూడ అంతే ముఖ్యమైనవ”ని, “ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా, నిష్పాక్షికంగా పరీక్షించడానికే కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేస్తోంద”ని రాశారు. (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక, 1955, పే. 264-265)

• విలీనం గురించి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 1955 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగిన చర్చను ప్రస్తావించి, ఆ చర్చలో అనుకూలంగా మాట్లాడినవారి సంఖ్య, వ్యతిరేకంగా మాట్లాడిన వారి సంఖ్య అంటూ ఈ కమిటీ రాసింది (పే. 9) గాని జరిగినది చర్చ మాత్రమేనని, వోటింగ్ జరగలేదనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాటవేసింది. ఆ చర్చా క్రమంలో ఎవరు ఏమి మాట్లాడినా, వోటింగ్ జరిగితే ఎలా వోటు వేసి ఉండేవారో తెలియదు. ఒక్కొక్కరు సుదీర్ఘంగా ఇచ్చిన ఉపన్యాసాలలో ప్రస్తావించిన అనేక విషయాలనుబట్టి వారిని అటో ఇటో తేల్చివేయడం సాధ్యం కూడ కాదు.

• పే. 44లో పాదసూచికలో ఉటంకించిన పుస్తకం ‘తెలంగాణ – డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్ మెంట్’ సంపాదకులు ఎస్ సింహాద్రి, పి ఎల్ విశ్వేశ్వర రావు కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాత్రం “ఎస్ శేషాద్రి (సంపాదకుడు)” అంటుంది.

• తాను ప్రత్యక్షంగా చూడని ఎన్నో విషయాలను ఘంటాపథంగా చెప్పిన కమిటీ, తాను చూసిన విషయాలమీద తెరలు కప్పి వక్రభాష్యాలు చెప్పిన కమిటీ, హఠాత్తుగా 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశం విషయం వచ్చేసరికి మాత్రం “ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలనే ప్రతిపాదనకు, ఒక్క సిపిఐ-ఎం మినహా మిగిలిన పార్టీలన్నీ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది (ఇట్ ఈజ్ లర్న్ ట్)” (పే. 56) అని రాసింది. నిజానికి ఇలా “తెలుస్తున్నది” అని సందిగ్ధంగా రాయనవసరం లేదు. ఆ మాట అధికారికంగా ప్రకటించారు, డిసెంబర్ 7న అన్ని ఛానళ్లలోనూ, 8న అన్ని పత్రికలలోనూ ఆ వార్త వచ్చింది. ఆ సమావేశపు మినిట్స్ ఆధారంగానే డిసెంబర్ 9 ప్రకటన చేశామని కేంద్ర హోం మంత్రి ప్రకటనలో ఉంది. శ్రీకృష్ణ కమిటీ ఈ ఆధారాలలో ఏదైనా చూసి తానే నిర్ధారణ చేసుకోవచ్చు, లేదా ప్రభుత్వం దగ్గరినుంచి ఆ మినిట్స్ సంపాదించి తానే తేల్చుకుని ఉండవచ్చు. కాని “తెలుస్తున్నది” అని సగం అనుమానంగా రాసింది. తెలంగాణకు అనుకూలమైన విషయాలేమో ఇలా సందిగ్ధంగా రాయడం, తెలంగాణకు వ్యతిరేకమైన విషయాలేమో కుండబద్దలు కొట్టినట్టు రాయడం ఈ నివేదిక అంతటా చేసిన పని. బహుశా నివేదిక రచయితలకు అందిన ఆదేశం అదేనేమో.

• తలసరి ఆదాయం, జాతీయోత్పత్తి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆ రెండిటి పెరుగుదల రేట్లు సామాజిక స్థితికి ఉజ్జాయింపు సూచికలే తప్ప వాటి ఆధారంగానే ప్రజల జీవితాలలో అభివృద్ధిని లెక్కించడం సాధ్యం కాదు. ఈ మాట ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యు ఎన్ డి పి) నివేదికలు, అమర్త్యసేన్ వంటి ఆర్థికశాస్త్రవేత్తలు గత మూడు దశాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు. కాని శ్రీకృష్ణ నివేదిక మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను దెబ్బతీసే లక్ష్యంతో, తెలంగాణ అభివృద్ధి చెందిందనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడం కోసమే ఈ సూచికలను వాడుకుంది. “తలసరి ఆదాయ అభివృద్ధి రేటు హైదరాబాద్ తో కలిసిన తెలంగాణలో 77 శాతం, హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 58 శాతం, కోస్తా ఆంధ్రలో 54 శాతం ఉన్నదని, అంటే తెలంగాణ మిగిలిన ప్రాంతాలకన్న ఎక్కువ అభివృద్ధి చెందినట్టేనని” నివేదిక రాసింది (పే. 67). ఇవన్నీ సగటు అంకెలు. ఎన్నో రెట్లు ఆస్తి పెంచుకున్న సంపన్నులనూ, నిజంగా బతుకు దిగజారి ఆత్మహత్యలకు సిద్ధపడిన అభాగ్యులనూ కలిపి తయారు చేసిన సగటు అంకెలు ఇవి. వీటి ఆధారంగా సమాజ దృశ్యాన్ని సక్రమంగా పట్టుకోవడం అసాధ్యం.

• “వాస్తవ సమాచారం దొరుకుతున్న గత ప్రాతిపదికలను చూసినప్పుడు, ఉదాహరణకు 1961 జనగణననో, 1956నో, 1974నో ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు, తెలంగాణకు అందిన వాటాలు తక్కువగా ఉన్న మాట నిజమే. కాని ఇటీవలి సంవత్సరాలలో, చాల ఉమ్మడి అభివృద్ధి సూచికలలో తెలంగాణ వాటాలు తెలంగాణ జనాభా/విస్తీర్ణం వాటా కన్న ఎక్కువ ఉండడం కనబడుతుంది” అంటూనే, “కొన్ని కీలకమైన సూచికలలో తెలంగాణ వెనుకబడి ఉన్నమాట నిజమే, కాని అవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాత్మక కారణాలవల్ల, హైదరాబాద్ నగరంలో ఆర్థిక కార్యకలాపాల కేంద్రీకరణ జరిగినందువల్ల తలెత్తినవి మాత్రమే” అంటుంది. (పే. 117) ఈ మాటల గారడీ వెనుక, “ఔను కాదు ఔను కాదు ఔను కాదు” అని వరుసగా అంటూ గందరగోళం సృష్టించడం వెనుక అసలు ఉద్దేశం వాస్తవాలను మరుగు పరచడమే.

• “తెలంగాణలో నికర నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం 0.7 మిలియన్ హెక్టార్ల నుంచి 1.8 మిలియన్ హెక్టార్లకు పెరిగి, రెట్టింపు అయింది. అంటే గణనీయంగా 113 శాతం పెరుగుదల ఉంది. కాగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 30 శాతం, 55 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేశాయి” అని పే. 88 అంటుంది. (ఇక్కడ లెక్క తప్పు. ఒక వాక్యంలో రెట్టింపు అని తర్వాతి వాక్యంలోనే 113 శాతం పెరుగుదల అనడాన్ని పక్కన పెట్టినా, 0.7 నుంచి 1.8 గా మారితే పెరుగుదల శాతం 157 అవుతుంది గాని, రెట్టింపూకాదు, 113 కాదు!) కాగా, అంకెలేమీ ఇవ్వకుండానే “రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులద్వారా కల్పించిన నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణలో 713 శాతం, రాయలసీమలో 390 శాతం, కోస్తాంధ్రలో 101 శాతం పెరిగాయి” అని పే. 192 అంటుంది. ఈ రెండు రకాల అంకెలలో ఏది సత్యం, ఏదసత్యం? ఇంతకూ భారీ, మధ్యతరహా అని కూడ అన్నారు గనుక ఇది కేవలం కాలువల ద్వారా కలిగిన నీటి సౌకర్యం లెక్కనా అని చూద్దామంటే పే. 189లో వాళ్లే ఇచ్చిన లెక్క ప్రకారం తెలంగాణలో కాలువల కింద భూమి 1955-56లో ఒక లక్ష హెక్టార్లు ఉన్నదల్లా, 2008-09 నాటికి 2.5 లక్షల హెక్టార్లకు మాత్రమే పెరిగింది. అంటే అలా చూసినా పెరుగుదల 150 శాతం మాత్రమే. మరి కమిటీకి 713 శాతం అభివృద్ధి ఎక్కడ ఎట్లా కనబడింది?

• “ఆంధ్రప్రదేశ్ ఇటీవలి కాలంలో పెద్దఎత్తున నదుల ఎత్తిపోతల పథకాలు, ముఖ్యంగా గోదావరి నది మీద, చేపట్టింది. వాటిలో కొన్నిటి వివరాలు” అంటూ “కల్వకుర్తి, భీమా- 1, భీమా-2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎ ఎం ఆర్ పి సింగిల్ స్టేజి, ఎ ఎం ఆర్ పి లో లెవెల్” అని పట్టిక ఇచ్చారు (పే. 184-185). ఇవన్నీ గోదావరి మీద కాదు, కృష్ణా నది మీద పథకాలు. గోదావరి ఎక్కడుందో, కృష్ణ ఎక్కడుందో తెలియని మహామేధావుల రచన ఇది!

• ఈ నివేదిక రచన ఎంత నిర్లక్ష్యంతో, అశ్రద్ధతో, అజాగ్రత్తతో రాయబడిందో చూడడానికి ‘ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ అభివృద్ధి’ అనే ఉప అధ్యాయమే పెద్ద నిదర్శనం. ఈ ఉప అధ్యాయం “ఆంధ్రప్రదేశ్ అనగా…” అనే సాధారణ పరిచయంతో మొదలవుతుంది. నిజానికి అలా రాసిన ఒక పేజీ అంతా ఇక్కడ శుద్ధ అనవసరం. అదంతా మరెక్కడి నుంచో కత్తిరించి, ఇక్కడ ఉచితమా కాదా అనే ఆలోచన కూడ లేకుండా అతికించారన్నమాట (పే. 217).

• ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఎపిఎస్ ఇ బి) ని 1956 చివరిలో ఏర్పరచారు అని రాశారు (పే. 218). 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది గనుక ఇది కూడ అప్పుడే కాకపోయి ఉంటుందా అనుకున్నట్టున్నారు. కాని అది ఏర్పాటయింది 1959 ఏప్రిల్ 1న.

• “ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయానికి తెలంగాణలో థర్మల్ విద్యుదుత్పత్తి లేదు” అని (పే. 218) నివేదిక రాసింది. కాని 1920లో ప్రారంభమైన హుసేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ 1983 వరకు కూడ పని చేస్తూ ఉంది.

• “రాయలసీమలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్” అంటుంది నివేదిక (పే. 222). కొత్తగూడెం తెలంగాణలో ఉందో, రాయలసీమలో ఉందో తెలియని తెలివిమంతులు రాసిన నివేదిక ఇది!

• పే. 342లో “1972లో అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకువచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు విభజన ఆకాంక్షలకు ముగింపు పలికాయి” అని రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినది 1972లో కాదు, 1975లో! రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్రపతి వెలువరిస్తారు, ప్రధానమంత్రి కాదు! ప్రధానమంత్రి 1973లో ప్రకటించిన ఆరుసూత్రాల పథకాన్ని ఆచరణలోకి తీసుకు రావడానికి ప్రభుత్వం 1974లో రాజ్యాంగ సవరణ (అధికరణం 371 డి చేర్పు) ప్రతిపాదించింది. ఆ సవరణ ప్రకారం రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేసే అధికారం సంక్రమించింది. దాని సాయంతో 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి.

• ఈ నివేదికలోనే పే. 3లో “భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడింది” అని రాసిన విషయం మరచిపోయి, పే. 344లో ఆ కమిషన్ ప్రాతిపదికలుగా ఉండిన ఏడు అంశాల జాబితా ఇచ్చారు. ఆ ఏడిటిలో భాష-సంస్కృతి ఒకానొకటి మాత్రమే. ఈ సరైన ఉటంకింపులో కూడ పొరపాటు ఏమంటే కమిషన్ నివేదిక అని బ్రాకెట్లో 1956 అని రాశారు. కమిషన్ తన నివేదికను 1955లో సమర్పించింది, 1956లో కాదు.

• “మొదట అన్నిరాజకీయ పార్టీలూ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) లో సభ్యులుగా చేరాయి. కాని ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితితో సహా చాల రాజకీయ పార్టీలు జాక్ నుంచి బయటికి వచ్చాయి” (పే. 349) అని అప్పటికీ ఇప్పటికీ జరగని పనిని కమిటీ నివేదిక ఊహించి రాసింది!

• “తెలంగాణకూ కోస్తా ఆంధ్రకూ మధ్య ఉండే జిల్లా అయిన ఖమ్మం పట్టణంలో…” (పే. 350) అని కమిటీ రాసింది. రెంటి మధ్యా ఉండడం ఏమిటి? అంటే రెంటికీ చెందకుండా ఉందనా? తెలంగాణలో భాగమైన జిల్లాను రెంటికీ కాని జిల్లాగా రాయడమేమిటి?

• ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పట్టికలో తెలంగాణనుంచి ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారని కమిటీ రాసింది. (పే. 407) జలగం వెంగళ రావును కలిపి చూసినా, మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు గనుక రెండు అని లెక్క వేసినా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయిన వారు ఐదుగురు మాత్రమే. అసలు ఈ పట్టిక ఎంత తప్పుల తడక అంటే దీని ప్రకారం ఇప్పటికి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు 25 మంది! వాస్తవంగా ముఖ్యమంత్రులు 21 మంది మాత్రమే. అందులోనూ ఎన్ టి రామారావు మూడు సార్లు, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి తలా రెండు సార్లు ఆ పదవిలోకి వచ్చారు గనుక ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు పదహారు మందే అనుకోవాలి. అలాగే రాయలసీమ నుంచి ఎనిమిది మంది ముఖ్యమంత్రులు కాగా, కమిటీ తొమ్మిది మంది అంటుంది. కోస్తాంధ్ర నుంచి ఎనిమిది మంది కాగా, కమిటీ పది అంటుంది. కమిటీ తెలివి ఇలా తెల్లారింది!!

అజ్ఞానం, ధూర్తత్వం, దాటవేత, అతితెలివి

ఆ తప్పులూ, పొరపాట్లూ, అవగాహనా రాహిత్యమూ అలా ఉంచినా, అవన్నీ అచ్చుతప్పులుగానో, సమాచారం సేకరించే బాధ్యత ఉన్న కిందిస్థాయి అధికారుల పొరపాట్లుగానో అంగీకరించినా, కమిటీ బాధ్యత వహించవలసిన అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. కమిటీకి మొత్తంగానో, ఆయా అధ్యాయాలు రాసిన నిపుణులకో, లేదా అన్ని అధ్యాయాలూ రాయడానికి అవకాశం ఉన్న కార్యదర్శి వి కె దుగ్గల్ కో ఉన్న అజ్ఞానాన్నీ, ధూర్తత్వాన్నీ, దాటవేత వైఖరినీ, అతితెలివినీ, అవగాహనారాహిత్యాన్నీ అవి తెలియజేస్తాయి. అటువంటి అంశాలలో కొన్ని చూడండి:

• పే. 3 లో ఫజల్ అలీ కమిషన్ గురించి రాస్తూ “ప్రజాభిప్రాయం భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణకు అనుకూలంగా ఉన్నదని కమిషన్ భావించినట్టు తెలుస్తున్నది” అని ‘కేంద్ర-రాష్ట్ర సంబంధాల కమిషన్ నివేదిక’ రాసినట్టుగా కమిటీ ఉటంకించింది. స్వయంగా ఫజల్ అలీ నివేదిక అందుబాటులో ఉన్నప్పుడు, ఆ నివేదిక ఏమి చెప్పిందో తెలుసుకోగలిగినప్పుడు, అసలు ఆ నివేదిక చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా రాసిన మరొక కమిషన్ నివేదికను ఉటంకించడం ఎందుకు?

• పే. 4 లో “భాషా ఏకత్వమే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయించి, సిఫారసు చేసింది” అని మరొక అబద్ధం రాశారు. ఈ అబద్ధాన్నే పే. 429లో పునరుద్ఘాటించారు. కాని ఫజల్ అలీ కమిషన్ నివేదిక “సమస్యకు సంబంధించిన అన్ని అంశాలనూ సంపూర్ణంగా పరిశీలించిన మీదట మేం చేస్తున్న నిర్ధారణ ఏమంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను భాష లేదా సంస్కృతి అనే ఏకైక ప్రమాణం ఆధారంగా తేల్చడం సాధ్యమూ కాదు, వాంఛనీయమూ కాదు. జాతీయ ఐక్యత దృష్ట్యా మొత్తం సమస్య పట్ల ఒక సమతుల్యమైన వైఖరి తీసుకోవలసి ఉంటుంది” అని చాల స్పష్టంగానూ, వివరంగానూ రాసింది. (పే. 45-46). ఇంత స్పష్టంగా నలుపు తెలుపుల్లో ఉన్న విషయాలను ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మసిపూసి మారేడుకాయ చేయడం, వక్రీకరించడం ఏ ప్రయోజనం కోసం?

• పే. 6 నుంచి పే. 9 వరకూ ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనానికి అనుకూలంగా 1953-56 మధ్య వాదనలను వివరంగా పేజీల కొద్దీ రాసిన నివేదిక, ప్రతికూల వాదనలను మాత్రం ఊరికే ప్రస్తావించి వదిలేసింది. “విస్తృత సమాలోచనల” కోసం ఏర్పడిన కమిటీ ఇలా ఒక పక్షపు వాదనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే అర్థం ఏమిటి?

• అప్పటి కేంద్ర మంత్రి మౌలానా అజాద్ విలీనాన్ని వ్యతిరేకించారని చెపుతూ “ఆంధ్ర నాయకత్వం, హైదరాబాద్ రాష్ట్రంలోని అత్యధిక ప్రజాభిప్రాయం విలీనానికి అనుకూలంగా ఉండడంతో” (పే. 10) విలీనం జరిగిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. అత్యధిక ప్రజాభిప్రాయం విలీనానికి అనుకూలంగా ఉన్నదని అనడానికి ఆధారమేమిటో మాత్రం రాయలేదు. అటువంటి ఆధారమేమీ లేదు. హైదరాబాద్ శాసనసభ చర్చను బట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులలో అత్యధికులు విలీనాన్ని సమర్థించారని అనుకున్నా, వారు ఎన్నికైనది అసలు విలీనం గురించి ఆలోచనే లేని 1952 ఫిబ్రవరిలో. ఆ తర్వాత ఏడాదిన్నరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాతనే విలీన ఆలోచన మొదలయింది. మూడు సంవత్సరాల కింద తాము వోట్లు వేసి తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నవారు ఇవాళ మాట్లాడిన మాటలన్నీ తమ అభిప్రాయాలే అని ప్రజలు అనుకున్నారో లేదో తెలియదు. అలా అనుకోవడానికి ఎంత అవకాశం ఉందో అనుకోకపోవడానికీ అంతే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే విలీనం పట్ల ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని చెప్పగల పరిస్థితి మాత్రం లేదు. మరి యాభై సంవత్సరాల తర్వాత ఏ ఆధారమూ లేకుండా ఈ అబద్ధాన్ని, లేదా అర్ధసత్యాన్ని వండవలసిన అవసరం శ్రీకృష్ణ కమిటీకి ఏం వచ్చింది?

• 1956 ఫిబ్రవరి 20న కుదిరిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ గురించి చాల వివరంగానే రాసిన కమిటీ ఆ ఒప్పందంలోని 14 అంశాలలో నాలుగు అంశాలు ప్రాంతీయ మండలి ఏర్పాటు గురించే మాట్లాడాయనీ, అది అంత ముఖ్యమైనదనీ గుర్తించనేలేదు. అంత ముఖ్యమైన ప్రాంతీయ మండలిని 1956 ఆగస్టు నాటికే ఎట్లా బలహీనపరచడం జరిగిందో, తెలంగాణ ప్రాంతీయ మండలి (కౌన్సిల్) కావలసిందల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సమితి (కమిటీ)గా ఎలా కుదించబడిందో, ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలలో ఆ ప్రాంతీయ సమితి మరెంతగా దగాకు, చిన్నచూపుకు, నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయిందో కనీసంగానైనా గుర్తించలేదు. ప్రాంతీయ మండలికి సంబంధించి ‘పెద్దమనుషుల ఒప్పందం’లోని అంశాలను తొలగించడం వల్ల “అప్పటికే తెలంగాణ ప్రజలలో ఉన్న అసంతృప్తి పెరిగింది” అని రాశారు (పే. 22) గాని, అలా తొలగించడంలోని దురుద్దేశ్యాల గురించి, ప్రయోజనాల గురించి మాత్రం మాట్లాడలేదు.

• తెలంగాణ అదనపు నిధుల పరిమాణాన్ని లెక్కించడానికి ఏర్పడిన మొట్టమొదటి అధికారిక కమిటీ అయిన కుమార్ లలిత్ కమిటీ గురించి గాని, ఆ నాటికి లెక్కించిన తెలంగాణ మిగులు నిధుల గురించి గాని రావలసిన దగ్గర (పే. 23) ప్రస్తావనే లేదు.

• ఉద్యోగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి, ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ యాజ్ టు రెసిడెన్స్) చట్టం 1957’ ఉల్లంఘనల గురించి తెలంగాణ ప్రాంతీయ మండలి తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని రాస్తూ, “చాల సందర్భాలలో ప్రభుత్వం వీలయిన చర్యలు తీసుకుంది” (పే. 30) అని సమర్థించింది. ఉద్యోగ నిబంధనలను పాటించి ఉంటే, “వీలయిన చర్యలు” తీసుకుని ఉంటే ఆ తర్వాత జై భారత్ రెడ్డి కమిటీ గాని, జి. ఓ. 610 గాని, గిర్ గ్లాని కమిషన్ గాని, సభాసంఘాలు గాని, ఇప్పటిదాకా ఆందోళనలు గాని అవసరమే ఉండేవి కావనే కనీస తర్కం కూడ కమిటీకి తట్టలేదు.

• “1969 జై తెలంగాణ ఉద్యమపు అనుకూల ఫలితాలు – తెలంగాణ ప్రాంతీయ సమితిని ప్రభుత్వం బలోపేతం చేయడం, తెలంగాణ ఆదాయ మిగులును హేతుబద్ధంగా మదింపు వేయడం, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విద్యాసంస్థలను నెలకొల్పడం, ఆరు తెలంగాణ జిల్లాలలోనూ, రెండు రాయలసీమ జిల్లాలలోనూ పరిశ్రమలకు ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వడం” అని కమిటీ రాసింది (పే. 33). ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. నిజానికి ఇక్కడ చెప్పిన వాటికి వ్యతిరేకమైన పనులు జరిగాయి.

• కొన్నిచోట్ల చాల అనవసరమైన, చిన్న చిన్న వివరాలు ఇవ్వడానికి పేజీలకు పేజీలు ఖర్చుపెట్టిన నివేదిక ఆరు సూత్రాల పథకం వంటి ముఖ్యమైన పరిణామాన్ని అరకొరగా ముగించేసింది. ఆరు సూత్రాల పథకం తెలంగాణకు మేలు చేసే విధంగా అమలు కాలేదన్న అసలు సంగతిని దాటవేసింది. మొదటి ఐదు సూత్రాలు అమలయితేనే అమలులోకి రావలసిన ఆరో సూత్రం (ముల్కీ నిబంధనల రద్దు, ప్రాంతీయ కమిటీ రద్దు), ఆ ఐదూ అమలు జరగకపోయినా జరిగిపోయింది. కాని ఆ ఆరో సూత్రం అమలు కావడమే ముఖ్యమైన ఫలితంగా కమిటీ నివేదిక అభిప్రాయపడుతున్నది (పే. 37).

• “రాయలసీమలో అటువంటి భయాలు చాల ఉన్నాయి. ఒక మార్కెట్ గమ్యంగానూ, సరఫరాల వనరుగానూ ఉన్న హైదరాబాద్ తో తమ సంబంధం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తెగిపోతుందేమోనని వారు అనుమానిస్తున్నారు. కోస్తా ఆంధ్ర కూడ హైదరాబాద్ నగరంలో ఉన్న సహజమైన జనాభా, వ్యాపార, మార్కెట్ కేంద్రీకరణల వల్ల ఒక ప్రధానమైన మార్కెట్ ను కోల్పోతుంది. ఈ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రతికూల అంశంగా ఉంటుంది” అని నివేదిక రాసింది. (పే. 122) ఇది హైదరాబాద్ ను కేవలం మార్కెట్ గా చూసే దృక్పథమే తప్ప, ప్రజల గురించిన దృక్పథం కాదు. విభజన వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా, వాటిని పరిష్కరించడం ఎలా, తెలంగాణ ప్రజలు యాభై నాలుగు సంవత్సరాలుగా కోల్పోయిన అవకాశాలను కల్పించడానికి, చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి ఎటువంటి దృక్పథం తీసుకోవాలి అని అటయినా ఇటయినా ప్రజల గురించి చర్చ ఉంటే ఈ మేధావుల కృషి సార్థకమయ్యేది. కాని “మార్కెట్ గమ్యం, సరఫరాల వనరు, ప్రధానమైన మార్కెట్” అనే భాష వాడడం దుర్మార్గం. అయినా ఇతర రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ప్రతికూల అంశంగా ఉంటుందనే పేరుతో ఒక ప్రాంతం తన ఆకాంక్షలను అణచివేసుకోవాలని కమిటీ సూచిస్తోందా? మరి భారతదేశాన్ని వదలడం బ్రిటన్ ఆర్థికాభివృద్ధి మీద ఎంతటి ప్రతికూల ఫలితాన్ని వేసింది, పాపం! అందువల్ల భారత జాతీయోద్యమం పొరపాటని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అని ఉండేదేనా? ఇదే లెక్కన ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న చత్తీస్ ఘడ్ విభజనతో మధ్య ప్రదేశ్, జార్ఖండ్ విభజనతో బీహార్ ఎంతగా నష్టపోయి ఉంటాయో, శ్రీ కష్ణ కమిటీయే చెప్పాలి.

• తెలంగాణలో అక్షరాస్యతా శాతం మిగిలిన రెండు ప్రాంతాల కన్న తక్కువ ఉన్నదని గుర్తిస్తూనే కమిటీ దానికి చారిత్రక కారణాలను చూపుతుంది. “తెలంగాణ మిగిలిన రెండు ప్రాంతాలకన్న వెనుకబడి ఉన్నప్పటికీ, అది గణనీయమైన అభివృద్ధి సాధించింది. కోస్తాకూ తెలంగాణకూ మధ్య అక్షరాస్యతా శాతంలో తేడా 1971 తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణ ప్రాంతం అక్షరాస్యతలో అతి ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తోంది” (పే. 127) అనీ, తెలంగాణ జిల్లాల్లో అక్షరాస్యతా శాతం అతి తక్కువగా ఉందనీ, కిందినుంచి పది జిల్లాల్లో ఆరు జిల్లాలు తెలంగాణవేననీ, మొత్తం అక్షరాస్యతలో మాత్రమే కాక, మహిళా అక్షరాస్యత, పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం, ప్రత్యేకంగా ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల శాతం వంటి విషయాలలో కూడ తెలంగాణ వెనుకబడి ఉందనీ గుర్తించిన కమిటీ, అందుకు కారణాలను మాత్రం దాటవేసింది.

• తెలంగాణ విద్యారంగంలో వెనుకబడి ఉండడానికి చారిత్రక, సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని కమిటీ మరో రెండు సందర్భాలలో (పే. 129, 146) కూడ చెప్పింది. తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల విద్యారంగంలో వెనుకబడిందని అనుకుంటే, నిజాం పాలన తొలగిపోయి అరవై సంవత్సరాలు దాటింది. తెలంగాణలో విద్యావకాశాల రక్షణ కల్పిస్తామని ‘పెద్దమనుషుల ఒప్పందం’లో వాగ్దానం చేసి యాభై నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఈ కాలమంతా పాలకులు ఏంచేశారో చెప్పకుండా ఆ పాత చారిత్రక కారణాల పాట పాడడం దగుల్బాజీతనం. ఆ చారిత్రక కారణాల గురించి ఒక పదేళ్లో, ఇరవై ఏళ్లో చెపితే అర్థం ఉంటుందేమో గాని, మూడో తరం నడుస్తుండగా ఆ కారణాలే చెప్పడంలో అర్థం లేదు. ఆ వెనుకబాటుతనాన్ని సవరించడానికి యాభై నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసిందో, ఎందుకు విఫలమయిందో కనిపెట్టడానికి ప్ర్రయత్నించి ఉంటే కమిటీకి తెలంగాణ ఆకాంక్షలు అర్థమై ఉండేవి.

• ప్రభుత్వం దగ్గరినుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 2008-09లో తెలంగాణలో 17 (హైదరాబాద్ తో కలిపి చూస్తే 53) ఉండగా, రాయలసీమలో 25, కోస్తాంధ్ర లో 101 ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెపుతుండగా (పే. 145) ఈ అసమానతకు కారణమేమిటనే ప్రశ్న కమిటీకి తట్టనేలేదు. పైగా “ఇది రాష్ట్రం ఏర్పడినప్పుడు కోస్తాంధ్ర ప్రాంతంలో చాల ఎయిడెడ్ కాలేజీలు ఉండడం వంటి చారిత్రక కారణాల వల్ల జరిగింది” అనీ “ఉన్నత విద్యలోకి తెలంగాణ ఆలస్యంగా ప్రవేశించడం వల్ల, ఎయిడెడ్ కాలేజీలకు నిధులు అందజేసే విధానం మారినందువల్ల” ఈ తేడా ఉందనీ సాకులు చెప్పడానికి ప్రయత్నించింది.

• తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తి చాల ఎక్కువగా, ఉండగూడనంత ఎక్కువగా ఉందని కమిటీ గుర్తించింది. మరి ఇదే ప్రభుత్వ విధానమైతే కోస్తాంధ్ర జిల్లాలలో ఈ నిష్పత్తి 50 కన్న తక్కువ ఎలా ఉందనీ, ఆదిలాబాద్ లో 82గా, కరీంనగర్ లో 61గా ఎందుకున్నదనీ మాత్రం ఆలోచించలేదు. (పే. 146)

• ప్రభుత్వ లెక్కల ప్రకారమే కోస్తాంధ్రలో ఎయిడెడ్ కాలేజీలకు రు. 224 కోట్లు అందుతుండగా, తెలంగాణకు రు. 93 కోట్లు, రాయలసీమకు రు. 91 కోట్లు అందుతున్నాయనీ, కోస్తాంధ్రలోనూ, తెలంగాణలోనూ కాలేజికి వెళ్లే వయసున్న యువకుల సంఖ్య సమానమనీ, రాయలసీమలో అందులో సగమనీ కమిటీ రాసింది (పే. 153). కాని విద్యార్థుల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు నిధులు మాత్రం సగానికన్న తక్కువ రావడమేమిటనీ, విద్యార్థుల సంఖ్య సగమే ఉన్న ప్రాంతానికి వచ్చినన్ని నిధులు రావడమేమిటనీ ప్రశ్నలు కమిటీకి తట్టనేలేదు. ఇది ఉద్దేశపూర్వకమైన, పాలనా విధాన పరమైన వివక్ష అని మాత్రం గుర్తించలేదు.

• ఇటువంటి ఎన్నో నగ్నసత్యాలను చూసి, నమోదు చేసిన తర్వాత కూడ కమిటీ “విద్యా సంస్థల నిధులు, వాటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల గురించి తెలంగాణవాదులు కమిటీ ముందు చేసిన ఫిర్యాదులన్నిటినీ సాకల్యంగా విశ్లేషించిన తర్వాత మేము చేసిన నిర్ధారణ ఏమంటే, వారి ఫిర్యాదులలో కొన్ని సరైనవే అయినప్పటికీ, వారు చెప్పిన స్థాయిలో మాత్రం జరగలేదు” (పే. 161) అని రాసింది. కళ్లు మూసుకుని కూచుంటే, చూసినదాన్ని, తామే రాసినదాన్ని కూడ నిర్ధారణలో భాగం చేయవద్దని ఆదేశాలుంటే మాత్రమే ఇటువంటి నిర్ధారణ వస్తుంది. “విద్యాసంస్థలు ఎక్కడ పెట్టాలనే విషయంలో కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ ప్రజాస్వామిక వ్యవస్థలోని రాజకీయ ఒత్తిళ్లవల్ల అటువంటివి తప్పవ”ని కమిటీయే సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది.

• పే. 163లో విద్యారంగ స్థితి గురించి రాసిన ముగింపు వాక్యాలలో తెలంగాణ ఉద్యమంలో దళిత, వెనుకబడిన కులాల విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడానికి, ఆత్మహత్యలు కూడ ఎక్కువగా చేసుకోవడానికి వారిలో ఉన్న నిరాశా నిస్పృహలే కారణమని కమిటీ రాసింది. కాని “తగిన ఉద్యోగాలు రాకపోవడానికి వివక్షత అనేది అరుదయిన కారణం మాత్రమే” అనీ, “తగిన శిక్షణ లేకపోవడమే ప్రధానకారణం” అనీ తెలంగాణ యువజనులకు ఉద్యోగాలు రాకపోవడానికి అసలు కారణం పైనుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించింది.

• నీటి పారుదల రంగానికి సంబంధించిన అధ్యాయంలో, పే. 205లో “తెలంగాణ ఫిర్యాదులు” అని ఆరు ఫిర్యాదులు ఉటంకించి, వాటన్నిటికీ కమిటీయే జవాబులు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ జవాబు చెప్పవలసిన అవసరం కమిటీకి లేదనేది ఒక ఎత్తయితే, ఆ జవాబులు కూడ సాకులు, అబద్ధాలు, అక్రమాలు కావడం మరొక ఎత్తు. (పే. 205-207)

• కృష్ణా, గోదావరీ జలాలలో తెలంగాణకు రావలసినంత వాటా రాలేదనే వాదనకు తెలంగాణ ఎత్తున ఉండడం వల్ల అది సాధ్యం కాదనీ, అయినా పరీవాహకప్రాంతం అనే ఒక్క ప్రాతిపదిక మీదనే నీటి వాటా రాదనీ కమిటీ చెప్పింది. ఈ ఎత్తున ఉండడం అనే అబద్ధం గోదావరికి కొంతయినా వర్తిస్తుంది గాని కృష్ణకు వర్తించదు. గోదావరి నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారానైనా, కృష్ణ నుంచి నైసర్గికంగానైనా తెలంగాణకు నీళ్లు ఇచ్చి ఉండవచ్చు.

• విలీనం కన్నముందరి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణకు ఉండిన జల వనరుల వాటాను, విలీనం వల్ల కోల్పోవడం జరిగిందనే వాదనకు, “1956లో జరిగిన పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు చరిత్రలో భాగం, ఆ చర్చలను మళ్లీ తెరవడం అసాధ్యం” అని కమిటీ జవాబిచ్చింది. ఒక అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నానికి ఆ అన్యాయం ఎప్పుడు జరిగిందనేదానితో నిమిత్తం లేదనే ఇంగిత జ్ఞానం కూడ నివేదిక రచయితలకు లేకపోయింది. కనీసం న్యాయశాస్త్రంలో ఎప్పటికైనా సవరించగలిగినవి, నిర్ణీతవ్యవధి తర్వాత సవరించలేనివి అనే విభజన ఉంటుంది. జలవనరుల పంపిణీని సమీక్షించడానికి, సవరించడానికి న్యాయశాస్త్రం అవకాశం ఇస్తుందనే విషయం కూడ ఈ న్యాయకోవిదులకు తట్టలేదు.

• శ్రీశైలం ఎడమ కాలువ తవ్వకం పనిని కావాలని దశాబ్దాలుగా తాత్సారం చేస్తున్నారనే వాదనకు జవాబు చెపుతూ, దీని 40 కి.మీ. సొరంగం తవ్వవలసి ఉందనీ, అందువల్ల చాల సమయం పడుతుందనీ కమిటీ ఆలస్యాన్ని సమర్థించడానికి ప్రయత్నించింది.

• ఒకవైపు తెలంగాణలో చెరువులను, కుంటలను నిర్లక్ష్యం చేసి, మరొకవైపు కాలువల నీరు కూడ ఇవ్వనందువల్ల తెలంగాణ రైతులు విపరీతమైన ఖర్చుతో బోరుబావులు తవ్వుకోవలసి వస్తున్నదనే వాదనకు జవాబుగా “మొత్తంగా ఈ వాదన తప్పుడు అభిప్రాయాల మీద ఆధారపడినప్పటికీ, గొట్టపుబావులకు ఎక్కువ ఖర్చు అవుతుందనే మాట నిజమే” అంటూ రైతులకు రుణ సౌకర్యం పెంచమని ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చింది. అవి “తప్పుడు అభిప్రాయాలు” ఎలా అయ్యాయో మాత్రం వివరణ లేదు.

• పోలవరం ప్రాజెక్టు పట్ల తెలంగాణ వాదుల అభ్యంతరాలను ప్రస్తావించి వాటికి జవాబులు చెప్పే పని కమిటీయే తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు రూపకల్పన ఎప్పుడో జరిగిందనీ, పోలవరం నుంచి కృష్ణకు తరలించే 80 టిఎంసి నీటిలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లకు వాటాలు వస్తాయనీ, అంటే తెలంగాణకు వచ్చినట్టేననీ, ఇంతకీ ప్రస్తుత స్థితిలో పోలవరం ఆపమని కోరడం తప్పుడు అవగాహన అనీ కమిటీ రాసింది. నిజానికి కమిటీయే తప్పుడు అవగాహనతో ఉంది. తెలంగాణ వాదులు లేవనెత్తుతున్న శాస్త్రీయమైన, సాంకేతికమైన, ప్రాంతీయ న్యాయానికి సంబంధించిన వాదనలకు కమిటీ ఇచ్చిన జవాబులు అర్థరహితమైనవి.

• మరొకపక్క, ఇంచంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు లబ్ధి చేకూరుస్తుంది గనుకనే ఆలస్యం చేస్తున్నారనే తెలంగాణ వాదుల ఆరోపణకు జవాబు చెపుతూ కమిటీ “ఇంచంపల్లి ఆనకట్ట అటవీ భూములను ముంచివేస్తుంది, గిరిజన ప్రజానీకాన్ని నిరాశ్రితులను చేస్తుంది. అందువల్ల పర్యావరణ, అటవీ అనుమతులు సంపాదించడం సాధ్యం కాదు. కనుక తెలంగాణవాదుల ఫిర్యాదు తప్పుడు అవగాహన” అని రాసింది. అటవీ భూముల ముంపు, ఆదివాసులు నిరాశ్రితులు కావడం అనేవే కారణాలయితే, పోలవరానికి కూడ అనుమతులు రాగూడదు. ఒకే రకమైన రెండు ప్రాజెక్టుల విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నదంటే కమిటీకే తప్పుడు అవగాహన ఉన్నదన్నమాట.

• పోతిరెడ్డిపాడు అక్రమం గురించి ప్రస్తావించి, దాని మీద విమర్శ సరైనదే అనే ధ్వని కూడ ఇచ్చి, “రానున్న కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ ఈ సమస్యను పరిశీలించవచ్చు” అని సరిపెట్టింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రూపకల్పన తెలంగాణకు నష్టదాయకంగా జరిగిందనే ఫిర్యాదును ప్రస్తావించి “ఈ ఫిర్యాదును అర్థం చేసుకోవచ్చు” అని సరిపెట్టింది.

• జూరాల, రాజోలిబండ మళ్లింపు పథకాల మీద ఫిర్యాదుల గురించి ప్రస్తావించి, అవి సరైనవేననిపిస్తుంది అని రాస్తూనే రాజోలిబండతో ఏమీ సంబంధం లేని తుంగభద్ర బోర్డుతో ఈ సమస్యను సరిగా చర్చించలేదనే తప్పుడు వాదనతో సరిపెట్టింది.

• తన పరిధిలో లేకపోయినా నీటి పారుదల/జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయమని సూచిస్తూ కమిటీ ఉచిత సలహా ఇచ్చింది (పే. 214-216).

• “తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత స్థాపిత విద్యుదుత్పాదనా శక్తి కోస్తాంధ్రతో పోలిస్తే తక్కువగానే ఉంది. కాని ఇది ఆందోళన పడవలసిన విషయం కాదు. ఎందుకంటే తెలంగాణకు అవసరమైన విద్యుచ్ఛక్తిని ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ నుంచి తీర్చడం జరుగుతోంది. (పే. 223) అని రాసింది. తెలంగాణ విద్యుత్తు అవసరాలను తీర్చడం జరుగుతున్నదా లేదా అనేదానికన్న ముఖ్యం ఆ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు తెలంగాణలో ఉండగా అ బొగ్గును మరొకచోటికి తరలించి అక్కడ విద్యుదుత్పత్తి చేసి మళ్లీ వెనుకకు సరఫరా చేయడం సాంకేతికంగానైనా, ఆర్థికంగానైనా సరైనదేనా అనే ప్రశ్నకు జవాబును కమిటీ దాటవేసింది.

• ‘సామాజిక, సాంస్కృతిక అంశాలు’ అనే ఏడో అధ్యాయం దానికదిగా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక సామాజిక శాస్త్ర అధ్యయనంలా ఉంది గాని దానికీ మిగిలిన నివేదికకూ పెద్ద సంబంధం లేదు. ఈ అధ్యాయంలో కూడ ఒక అనవసరమైన ఉపోద్ఘాతం, ముఖ్యమైనవే అయినా ఇక్కడ ఎంతమాత్రం సంబంధంలేని ఏవేవో విషయాలు ఉన్నాయి. తప్పులు, పొరపాట్లు సరేసరి.

• “తెలంగాణ ప్రాంతపు మొత్తం ఆర్థికాభివృద్ధి ధోరణి సుదృఢంగా ఉన్నప్పటికీ (విలీన సమయంలో అభివృద్ధి చాల తక్కువ స్థాయిలో ఉందని గమనించాలి), కొన్ని సందర్భాలలో, సాంప్రదాయికంగా సమృద్ధమైన ఆంధ్ర ప్రాంతం కంటె అభివృద్ధి రేటులో అధిగమించినప్పటికీ, ప్రభుత్వోద్యోగాలలో, నీటిపారుదల సౌకర్యాలలో, విద్యావకాశాలలో వాటా విషయంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అసంతృప్తులలో కొంత నిజం ఉంది. కాని, తెలంగాణ నాయకులు చెపుతున్నట్టుగా, వాగ్దానం చేస్తున్నట్టుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నీటి లభ్యతలో, ప్రభుత్వోద్యోగాలలో, విద్యలో హెచ్చు అవకాశాలకు హామీ ఇవ్వదు” అని కమిటీ రాసింది (పే. 343) రెండే రెండు సంకీర్ణ వాక్యాలలో నాలుగు అనుకూల వ్యాఖ్యలూ నాలుగు ప్రతికూల వ్యాఖ్యలూ ముద్ద చేసి, చివరికి తెలంగాణ వాదుల మాటలను ఖండించడమే ఈ కమిటీ చేసిన పని.

• “ఒక ఉప-ప్రాంతీయ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం జాతీయ ఐక్యతకు ప్రమాదకరం కాదు” అని అంటూనే, “దీనికి జాతీయ పర్యవసానాలు ఉంటాయి” అని సన్నాయి నొక్కు నొక్కింది. (పే. 344). ఆ మాటకొస్తే దేశంలో ఏ మూల ఏం జరిగినా, ఏ రాష్ట్రంలో ఏ విధాన నిర్ణయం జరిగినా జాతీయ పర్యవసానాలు ఉంటాయి. అలాంటి పర్యవసానాలు ఉండడం అనే కారణంతో ఆ పరిణామాలను ఆపడం న్యాయమేనా?

• రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ప్రత్యేకతను గురించి రాస్తూ, “అది తెలంగాణ ప్రాంతంలో భౌగోళిక భాగమైనప్పటికీ, 1956లో రాజధాని అయినప్పటినుంచీ, దాని అభివృద్ధికి మూడు ప్రాంతాలూ దోహదం చేశాయి. హైదరాబాద్ లో తమ ప్రయోజనాల పరిరక్షణ, హైదరాబాద్ తో తమ సంబంధం గురించి మూడు ప్రాంతాలూ పడుతున్న ఆందోళనే ప్రస్తుత ఘర్షణలో ప్రధానాంశం” (పే. 344-345) అని రాసింది. ఎప్పుడైనా రాష్ట్ర రాజధానిగా ఉన్న నగర అభివృద్ధికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ దోహదం చేస్తాయి. విభజన జరిగేటప్పుడు ఆయా ప్రాంతాలు తమ దోహదానికి లెక్కలు కట్టి ఇమ్మనడం ఎక్కడా జరగదు, జరగలేదు. ఆ మాటకొస్తే మద్రాసు అభివృద్ధిలో తెలుగు, కన్నడ, మలయాళీ ప్రజల పాత్ర, బొంబాయి అభివృద్ధిలో గుజరాతీల పాత్ర, భోపాల్ అభివృద్ధిలో చత్తీస్ ఘడ్ పాత్ర, పాట్నా అభివృద్ధిలో జార్ఖండ్ పాత్ర, లక్నో అభివృద్ధిలో ఉత్తరాంచల్ పాత్ర ఎంతో ఉంది. కాని ఆయా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానులు ఏ రాష్ట్రంలో భౌగోళిక, చారిత్రకఅంతర్భాగమో వారికే వదిలేసి వెళ్లిపోయాయి.

• కోస్తా నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు తమ సౌభాగ్యం వల్ల స్థానిక ప్రజలతో కలివిడిగా కాక దూరంగా ఉంటారనీ, దానితో స్థానికులలో వారిపట్ల అసూయ, వారు తమ వనరులనూ అవకాశాలనూ కొల్లగొడుతున్నారనే నమ్మకం బలపడుతోందనీ కమిటీ రాసింది (పే. 351) ఇది కేవలం అసూయకూ, నమ్మకాలకూ సంబంధించిన విషయం కాదనీ, కళ్ల ఎదుట కనిపించే వాస్తవమనీ పది జిల్లాలలోనూ ప్రజలు వినిపించిన గాథలను పెడచెవిన పెట్టింది. తోటివారు బాగుపడితే అసూయపడే సంకుచిత మనస్తత్వం తెలంగాణ వారికున్నదనే దుర్మార్గపు ఆలోచన ప్రకటించింది. తెలంగాణ సమాజం ఎప్పుడైనా తోటివారు బాగుపడినందుకు అసూయ చెందలేదు, నిజానికి ఎన్నో తెలంగాణేతర జాతులు, వ్యక్తులు తెలంగాణలోనే తమ సౌభాగ్యాన్ని పెంచుకున్నాయి. వారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ జరిగినది మోసం. విద్యలో, నీటిపారుదలలో, పాలనావ్యవస్థలలో తమకన్న తక్కువ స్థాయిలో ఉన్న తెలంగాణకు వలస వచ్చి తెలంగాణ వనరులను ఆక్రమించుకోవడం జరిగింది. ఆ వలసకు ఒకే జాతి, సోదరులు అనే మాయమాటలు చెప్పడం జరిగింది. మీ అభివృద్ధికి రక్షణలు కల్పిస్తామని హామీలు ఇచ్చి వాటిని ఉల్లంఘించడం జరిగింది. పోనీ వాటన్నిటినీ సహించినా, తెలంగాణ భాషనూ, సంస్కృతినీ, జీవనవిధానాన్నీ ప్రతిచోటా అవమానిస్తూ, తమ ఆధిపత్యాన్నీ, ఆభిజాత్యాన్నీ చూపుకోవడం జరిగింది. వైమనస్యానికి ఇన్ని కారణాలున్నాయి. అది అసూయ కాదు. దాన్ని అసూయగా చూపడం చరిత్రకూ, తెలంగాణ ప్రజల అమాయకత్వానికీ అవమానం.

• కమిటీకి తెలంగాణలో “తయారు చేసిన భావోద్వేగాలు (ఆర్గనైజ్డ్ ఎమోషన్స్)” చాల ఎక్కువగా కనబడ్డాయట. “నిష్పాక్షిక పరిశోధన చేస్తే ఆ భావోద్వేగాలు నిలవలేదట. తెలంగాణలో దృఢమైన అభివృద్ధి జరిగిందని తేలిందట. ఆంధ్రా వారిని శత్రువులుగా చూపడం ద్వారా, ప్రత్యేక రాష్ట్రం అనే ఐంద్రజాలిక పరిష్కారాల ద్వారా భావోద్వేగాలు బలపడుతున్నాయట (పే. 352). ఏవి తయారుచేసిన భావోద్వేగాలో, ఏవి నిజమైన భావోద్వేగాలో మనసుల్లోకి దూరి అంచనాకట్టే అద్భుతమైన పనిముట్టేదో శ్రీకృష్ణ కమిటీకి దొరికినట్టుంది! ఆ పనిముట్టును ఇతర ప్రాంతాల ఉద్యమాలకు కూడ అన్వయించి చూస్తే బాగుండును!

• ఆంధ్రప్రదేశ్ చరిత్ర పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర వివక్షకు గురయిందని తెలంగాణ జాగృతి ఫిర్యాదు చేసిందని ప్రస్తావిస్తూ, “కమిటీ చేసిన పరిశోధనలో ఈ ఫిర్యాదు నిజం కాదని తేలింది. పాఠశాల పాఠ్య పుస్తకాలలో ‘తెలంగాణలో స్వాతంత్ర్యోద్యమం’ అనే భాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రంతో కలవక ముందూ, కలిసిన తర్వాత కూడ తెలంగాణ చరిత్రను ఈ భాగంలో చర్చించారు” (పే. 398) అని కమిటీ రాసింది. ఇది పూర్తిగా అబద్ధం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రత్యేకంగా అధ్యయనం చేసే పైస్థాయి పాఠ్యపుస్తకాలలో ఏ కొద్దిగానో అలా ఉండవచ్చుగాని, పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణకు సంబంధించిన చరిత్ర లేదు. పైగా, మద్రాసు రాష్ట్రంలోని తెలుగుజిల్లాల చరిత్రనే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గతంగా చూపడం జరుగుతోంది.

• సాంస్కృతిక అంశాల మీద పన్నెండు పేజీల పాటు ఇరువైపుల వాదనలనూ యథాతథంగా ఉటంకిస్తూ, తెలంగాణ వాదనలను అక్కడక్కడ ఖండిస్తూ సాగిన నివేదిక చివరికి “సాంస్కృతిక భేదాల మీద, ఫిర్యాదుల మీద చర్చను సమన్వయించడానికి కమిటీ దగ్గర తగిన సమయమూ లేదు, నైపుణ్యమూ లేదు. కాని భారతదేశంలోని రాష్ట్రాలన్నీ అన్ని సంస్కృతులూ వాటి వాటి సంపదతో, వైవిధ్యంతో పరిఢవిల్లేలా చూడాలని ఎస్ ఆర్ సి ఇచ్చిన సలహాను మేం పునరుద్ఘాటించదలిచాం” అని ముక్తాయించింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినందువల్ల ఈ సమస్య పరిష్కారం కాదని మరొక సలహా పడేసింది. తమను చిన్నచూపు చూస్తున్నారనీ, వెటకారం చేస్తున్నారనీ ఫిర్యాదు తెలంగాణలో మాత్రమే లేదనీ, దేశంలో చాల చోట్ల ఉందనీ, అది దురదృష్టకరమనీ మొసలికన్నీరు కార్చింది. చిట్టచివరికి “ఆత్మవిశ్వాసం లోపలి నుంచి రావలసిందే గాని చట్టాల ద్వారానో, విధాన నిర్ణయాల ద్వారానో జరిగేది కాదు” (పే. 403) అని దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. తెలంగాణ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే విధాన నిర్ణయం కోసం పోరాడుతున్నదనే ధ్వని వినిపించింది. తనకు సమయమూ నైపుణ్యమూ లేదని తానే గుర్తించిన విషయాల మీద వ్యాఖ్యలు చేయకుండా ఉంటే కమిటీ నిజాయితీ బయటపడేది.

• హైదరాబాద్ లోగాని, ఇతర తెలంగాణ జిల్లాలలోగాని ఎంతోకాలంగా ఉన్నప్పటికీ కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన వారిని “సెట్లర్స్” అని పిలిచి అవమానిస్తున్నారనీ, వారు స్వాభావికంగానే కార్యసాధకులుగా, కష్టపడి పనిచేసేవారుగా ఉండగా వారిని “డబ్బుమనుషులు”గా చూస్తున్నారనీ, ఇది దురదృష్టకరమనీ కమిటీ రాసింది (పే. 404). ఎంతోకాలంగా ఉన్నప్పటికీ సెట్లర్స్ అనే పిలుపు మారలేదంటే, పిలిచేవాళ్లది తప్పయితే, పిలిపించుకునేవాళ్ల ప్రవర్తన వల్ల కూడ అలా జరుగుతోందా, వాళ్ల తప్పుకూడ ఏమైనా ఉందా పరిశీలించడం మధ్యవర్తి బాధ్యత. ‘డబ్బుమనుషులు’ అనే మాటను ఒక వాస్తవానికి చిహ్నంగానూ చూడవచ్చు, విమర్శగానూ చూడవచ్చు, వ్యతిరేకతగానూ చూడవచ్చు. నిజానికి అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల కోస్తాంధ్ర ప్రజాజీవితంలో తెలంగాణ ప్రజాజీవితం కన్న చాలముందే మార్కెట్ సంబంధాలు, డబ్బును ప్రధానంగా చూసే సంస్కృతి ప్రవేశించాయి. ఆ మార్కెట్ సంబంధాల వల్ల, డబ్బుతో ముడిబడిన సంస్కృతి వల్ల వలస వచ్చినవాళ్లను మార్కెటేతర సంస్కృతిలో ఉన్న తెలంగాణ వాసులు వేరుగా చూశారు. అందులో అసహజమైనదీ లేదు, ప్రత్యేకమైన వ్యతిరేకతా లేదు.

• “సెట్లర్స్” సౌభాగ్యమే వారి పట్ల ఈర్ష్యాసూయలకు కారణమనీ, రాష్ట్ర విభజన జరిగితే వారి రక్షణకు హామీలు ఇవ్వాలనీ కమిటీ రాసింది (పే. 405). సొంత ఇంట్లో అన్యాయానికీ, రక్షణల హామీల ఉల్లంఘనలకూ యాభై నాలుగు సంవత్సరాలుగా గురవుతున్నవారి విషయంలో ఇచ్చిన పాత హామీలు ఏమైపోయాయి అనే ప్రశ్న కమిటీకి తట్టలేదు. కాని రేపు రాష్ట్ర విభజన జరిగితే రక్షణ హామీలు కావాలనే ముందు జాగ్రత్త మాత్రం తట్టింది.

***

(తరువాయి రేపు)

***

చివరి భాగం ఇక్కడ చదవండి:

http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part3/

చివరి భాగం ఇక్కడ చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *