mt_logo

“ప్రతి అక్షరం ప్రజాద్రోహం” – మొదటి భాగం

ప్రముఖ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన “ప్రతి అక్షరం ప్రజాద్రోహం” పుస్తకం మొదటి భాగం ఇక్కడ చదవండి:

పుస్తక ప్రచురణకర్తలు: తెలంగాణ ఆత్మగౌరవ వేదిక

****

ప్రవేశిక

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి చర్చించబోయేముందు అసలు ఆ కమిటీ ఏర్పడిన తీరును, దాని విధివిధానాలు నిర్ణయమైన తీరును, దాని పనివిధానాన్ని పరిశీలించాలి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన దురాలోచనలు, పొరపాట్లు, తప్పులు, అన్యాయాలు అన్నీకూడ నివేదికతో మాత్రమే ప్రారంభం కాలేదు, అసలు కమిటీ వేయాలనే ఆలోచన దగ్గరే ప్రారంభమయ్యాయి. ఆ కమిటీ నివేదికకు భూమికగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ ఆలోచనే దురాలోచన. ఆ కమిటీకి మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వమో, కేంద్ర హోంమంత్రో, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పాలకవర్గాలో నిర్దేశించిన దృక్పథంలోనే, అవగాహనలోనే లోపాలున్నాయి, ప్రజావ్యతిరేకత ఉంది. అదంతా చాల పెద్ద కథ. సుప్రసిద్ధమైన కేంద్ర్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న చేసిన మొదటి ప్రకటన, డిసెంబర్ 23న చేసిన రెండో ప్రకటనల గురించి కొత్తగా చెప్పనక్కరలేదు గాని శ్రీకృష్ణ కమిటీకి పూర్వరంగాన్ని చెప్పడానికి ఈ కథ అక్కడే మొదలుపెట్టాలి.
.
డిసెంబర్ 23 తలకిందుల ప్రకటన
.
కేంద్రప్రభుత్వం తరఫున హోంమంత్రి పళనియప్పన్ చిదంబరం 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రికి కొద్దిముందు చేసిన ఒక చరిత్రాత్మక ప్రకటనలో “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నది” అని అన్నారు. కాని ఆ ప్రక్రియ ప్రారంభించకుండానే పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ 23న ఆయనే మరొక ప్రకటన చేశారు. “తెలంగాణ సమస్యపై డిసెంబర్ 7న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయపక్షాలతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఆ సమావేశపు మినిట్స్ అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున డిసెంబర్ 9న హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. కాని ఆ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారిపోయాయి. చాల రాజకీయ పార్టీలలో ఈ సమస్యపై విభజన జరిగింది. ఈ మారిన పరిస్థితులలో విస్తృత సమాలోచనలు అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికొరకు రాజకీయపార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని ఈ రెండో ప్రకటనలో చిదంబరం అన్నారు.
.
డిసెంబర్ 23న చేసిన ఈ రెండో ప్రకటన పచ్చి అబద్ధాల కుప్ప. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా డిసెంబర్ 9కీ డిసెంబర్ 23కూ మధ్య ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారాయనే మాట నిజం కాదు. “మారిన పరిస్థితులు” అనేవేవైనా ఉంటే అవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవడానికి తగినంత బలమైనవీ కావు, విస్తృత సమాలోచనలు జరపవలసిన అవసరాన్ని కల్పించేవీ కావు. రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయి ఉండవచ్చు గాని ఆయన చెప్పినట్టుగా “విభజన” జరగలేదు. డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలలో ఒక్క ప్రజారాజ్యం పార్టీ మినహా మరే ఇతర పార్టీ కూడ ఆ అఖిలపక్ష తీర్మానం నుంచి వైదొలగలేదు. ప్రజారాజ్యం పార్టీ మాత్రమే తాను ఆ తీర్మానంతో విభేదిస్తున్నట్టూ, ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టూ అధికారికంగా డిసెంబర్ 16న ప్రకటించింది.  ఆయా పార్టీలలో భిన్నస్వరాలు వినిపించి ఉంటే అది ఆయా పార్టీల అంతర్గత సమస్యే తప్ప, ఏ ఒక్క పార్టీ కూడ 2009 డిసెంబర్ 23 నాటికి మాత్రమే కాదు, ఇది రాస్తున్న 2011 మార్చ్ రెండోవారానికి కూడ అధికారికంగా తమ వైఖరిని మార్చుకోలేదు. డిసెంబర్ 7 అఖిలపక్ష తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రజారాజ్యం పార్టీ మినహా మరే ఇతర పార్టీలూ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.
.
ఆ రెండు తేదీల మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు శాసనసభ్యులు రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమి జరుగుతుందోనని తమ ప్రాంతాలలో కొందరు ప్రజలలో ఉన్న భయ సందేహాలను నివృత్తి చేసి, తమ తమ పార్టీల అధికారిక నిర్ణయాన్ని ప్రచారం చేసే బాధ్యతను నెరవేర్చేబదులు, ఆయా రాజకీయ నాయకులే ప్రజలను రెచ్చగొట్టి సమస్య సృష్టించడానికి ప్రయత్నించారు. ప్రజలలో అనవసరమైన అనుమానాలను సృష్టించి పెంచి పోషించారు. అందువల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఆరకంగా ఆ రాజకీయ నాయకులు చేసినది అఖిలపక్ష సమావేశపు ఉమ్మడి తీర్మానానికి ద్రోహం. అలా వారు కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కూడ ఉల్లంఘించారు. తమ సొంతపార్టీ విధానాల పట్ల కూడ క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారు.
.
అటువంటి సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలలో కొందరిలోనైనా ఏర్పడిన భయ సందేహాలను నివృత్తి చేసి, తన డిసెంబర్ 9 నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసింది. విద్యా, ఉద్యోగావకాశాల గురించి ఆ ప్రాంతాలలో కొందరు విద్యార్థులలో, నిరుద్యోగులలో ఏర్పడిన భయాలను, నీటి పారుదల సౌకర్యాల గురించి కొందరు రైతులలో కలిగిన సందేహాలను కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే చాల సులభంగా నివృత్తి చేయగలిగి ఉండేది. లేదా రాజకీయ నాయకులు ఆ పని చేయగలిగి ఉండేవారు. కాని అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గాని ఆ పని చేయలేదు. అలాగే, డిసెంబర్ 7 తీర్మాన స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్న సభ్యులను అధుపు చేయమని ఆయా రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం సూచించి ఉండవలసింది. కాని దానిబదులు కేంద్ర ప్రభుత్వం “విస్తృత సమాలోచనలు” అవసరమనే పేరుతో తన అధికారిక ప్రకటనకు తానే తూట్లు పొడుచుకుంది. ఈ దేశంలో అత్యున్నత అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వపు మాటకు విశ్వసనీయత లేదని, కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి చేసిన ప్రకటనను నమ్మనక్కరలేదని, కేంద్ర ప్రభుత్వ వాగ్దానానికే దిక్కులేదని ఈ డిసెంబర్ 23 ప్రకటన తేల్చి చెప్పింది.
.
మళ్లీ ఆ “విస్తృత సమాలోచనలు” కూడ డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలతోనే జరపాలని తలపెట్టారు. ఆ ఎనిమిది పార్టీలలో ఒక్క ప్రజారాజ్యం పార్టీ మినహా మిగిలిన పార్టీలేవీ తమ అభిప్రాయం మార్చుకోలేదు గనుక వాటిని సమాలోచనలకు పిలవడమే అనవసరం, అర్థరహితం, హాస్యాస్పదం. కాని ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2009 డిసెంబర్ 30న అన్ని పార్టీలకూ ఉత్తరం రాసింది. రాజకీయ పార్టీ అంటేనే లోపల సభ్యులమధ్య భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా, అవి అంతర్గతంగానే చర్చించుకుని, కావాలంటే మైనారిటీ మెజారిటీకి లోబడి, బైటికి ఏకాభిప్రాయాన్ని ప్రకటించేవి అని అర్థం. ఒకవేళ లోబడి ఉండడం ఇష్టం లేకపోతే ఆ మైనారిటీ అభిప్రాయం కలవారు బయటికి వచ్చి మరొక రాజకీయపార్టీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధికారిక అభిప్రాయం ఒకటి ఉండగానే, ఆ అభిప్రాయాన్ని అధికారికంగా డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో ప్రకటించిన తర్వాతనే, పార్టీలో కొందరు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడం, పార్టీ అధికారిక అభిప్రాయాన్ని బహిరంగంగా ఖండిస్తున్నవారిమీద ఆ పార్టీ నాయకత్వం ఎటువంటి చర్యా తీసుకోకపోవడం, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడ ఒక్కొక్క పార్టీనుంచి రెండు అభిప్రాయాలవాళ్లనూ పిలవడం జరిగాయి. ఇంత హాస్యాస్పదమైన, అసాధారణమైన దివాళాకోరు రాజకీయ ప్రవర్తన ప్రపంచంలో అతి తక్కువ సందర్భాలలో జరిగి ఉంటుంది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు ద్రోహం చేసే విషయంలో ఎంత అసాధారణ సన్నివేశాలైనా జరుగుతాయనడానికి ఇది నిదర్శనం.
.
కమిటీకి బీజం వేసిన జనవరి 5 అఖిలపక్ష సమావేశం
.
అలా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయపార్టీల ప్రతినిధులు పదహారు మందితో 2010 జనవరి 5న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం లోనే తెలంగాణ రాష్ట్ర విభజనను వాయిదావేసే, రద్దుచేసే, అంటే 2009 డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి తూట్లు పొడిచే కుట్ర మొదలైంది. ఆ సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు కాంగ్రెస్ తరఫున కావూరి సాంబశివరావు, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం తరఫున యనమల రామకృష్ణుడు, రేవూరి ప్రకాశరెడ్డి, ప్రజారాజ్యం తరఫున కె చిరంజీవి, సి రామచంద్రయ్య, భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ, కె హరిబాబు, భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున కె. నారాయణ, గుండా మల్లేశ్, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తరఫున బి వి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ తరఫున అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె. చంద్రశేఖర రావు,  ప్రొ. కె. జయశంకర్ పాల్గొన్నారు.
.
ఆ సమావేశానికి స్వాగతోపన్యాసంగా చిదంబరం చదివిన ప్రసంగంలో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలమైనదో, దానికి ఎంత సుదీర్ఘ చరిత్ర ఉన్నదో వివరణా ఉంది. ఆ ఆకాంక్ష మీద ఉద్యమాన్ని ప్రజల చేతుల్లోకి పోనివ్వవద్దని పార్లమెంటరీ రాజకీయ పక్షాలకు చేసిన హెచ్చరికా ఉన్నది. నిజానికి ఆ హెచ్చరిక ద్వారా, ఉద్యమాన్ని మళ్లీ రాజకీయ నాయకుల చేతుల్లోకి, పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాల వలయంలోకి తేవడానికి అవసరమైన వ్యవధి చిక్కించుకోవడానికే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం జరిగింది.
.
ఆ పది పేరాగ్రాఫుల స్వాగతోపన్యాసంలో చిదంబరం రెండో పేరాగ్రాఫులో తన డిసెంబర్ 9 ప్రకటన మీద రాష్ట్రంలో కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. అది ఒకరకంగా కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు అప్పటివరకూ ఆడుతున్న అబద్ధాలకు, చేస్తున్న వక్రీకరణలకు ఖండన, చెంపదెబ్బ. ఆ తర్వాత మూడు పేరాగ్రాఫులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఉన్న “సుదీర్ఘ  చరిత్ర”ను  చెప్పడానికి వినియోగించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (1955) నివేదిక నాటి నుంచి 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశం దాకా సాగిన ప్రధానమైన మైలురాళ్లన్నిటినీ ప్రస్తావించారు. విస్తృత సమాలోచనలు జరపడానికి విధివిధానాలను రూపొందించవలసిన అవసరం గురించి చెప్పడానికి రెండు పేరాలు కేటాయించారు. చివరిగా తొమ్మిదో పేరాలో ఆయన చెప్పిన రెండు కీలకమైన విషయాలే (శాంతి భద్రతలను పునరుద్ధరించడం, ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల అధీనంలోనే ఉంచడానికి ప్రయత్నించడం) శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పునాది వేశాయి.
.
“మనం ఈ సమస్యల గురించి చర్చిస్తూ, సమాలోచనల ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నప్పుడే, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించవలసిన మౌలిక ప్రాధాన్యతను గుర్తించాలి. ఆందోళనలకూ బంద్ లకూ ముగింపు పలకాలి. శాంతి భద్రతలను కాపాడాలి. పిల్లలు పాఠశాలలకూ కళాశాలలకూ వెళ్ళాలి. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలు జరుపుకునే వీలు కలగాలి. ప్రభుత్వం అభివృద్ధి మీదా, ప్రజాసంక్షేమం మీదా దృష్టి నిలిపే అవకాశం రావాలి. సమాలోచనలు జరుగుతుండగా శాంతి సామరస్యాలు నెలకొనడం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరం. పార్లమెంటరీ ప్రజాస్వామిక రూపాన్ని అపహాస్యం చేసే శక్తులు పొంచి కూచుని ఉన్నాయని నేను రాజకీయ పార్టీలన్నిటినీ హెచ్చరించ దలచుకున్నాను. మనను చికాకు పరుస్తున్న సమస్యలకు జవాబులు కనిపెట్టడంలో మనం విఫలమైతే వారు సంతోషిస్తారు. ఆ శక్తులు బలపడడానికి గాని, వారి మాట చెల్లడానికిగాని మనం ఎటువంటి అవకాశం ఇవ్వగూడదు” అని ఆయన ఆ పేరాలో అన్నారు.
.
“పార్లమెంటరీ ప్రజాస్వామ్యరూపాన్ని అపహాస్యం చేసే శక్తులు పొంచి కూచున్నాయ”ని హెచ్చరించడంలో కేంద్ర హోంమంత్రి స్పష్టంగానే మావోయిస్టు పార్టీనో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఇతర విప్లవ ప్రజాశక్తులనో బూచిగా చూపి అక్కడ కూచున్నవారందరినీ భయపెట్టదలిచారు. మావోయిస్టు పార్టీ చేతులలోకో, ఇతర పార్లమెంటరీయేతర రాజకీయ పక్షాల చేతులలోకో ఉద్యమాన్ని వెళ్లనివ్వగూడదని ఆయన హెచ్చరించదలిచారు. అంటే, మరో మాటల్లో ప్రజా ఉద్యమాన్ని ప్రజల చేతుల్లోంచి లాక్కొమ్మని ఆయన పార్లమెంటరీ రాజకీయ పార్టీలకు బెదిరింపుతో కూడిన హితబోధ చేశారు. లోపల కూచున్న ఎనిమిది పార్టీలకు చెందిన పదహారు మందీ పార్లమెంటరీ రాజకీయాలకు చెందినవాళ్లే గనుక ఆయన వాళ్లను ప్రజలనుంచి, ప్రజల న్యాయమైన ఆగ్రహ ప్రకటన నుంచి దూరం చేయడానికి పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎత్తుగడ వేశారు. “మొదట శాంతిభద్రతలు నెలకొనాలి” అనే తప్పుడు వాదనను ముందుకు తెచ్చారు. “తెలంగాణలో శాంతి భద్రతలు ఏర్పడాలంటే రాష్ట్ర విభజన జరగవలసిందే” అని గాని, కనీసం “మీరు డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేయడమే శాంతి భద్రతలను నెలకొల్పుతుంది” అని గాని అక్కడ పాల్గొన్న తెలంగాణ వాదులు కూడ అనలేదు. లోపల అన్నారో లేదో తెలియదుగాని బయటికి వచ్చాకనైనా అనలేదు.
.
ఆ “శాంతి భద్రతల ఎత్తుగడ”ను చర్చించబోయే ముందు చిదంబరం చూపిన మావోయిస్టు బూచి గురించి కాస్త చెప్పాలి. నిజానికి అక్కడ కూచున్న పార్టీలలో తెలంగాణ కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి మినహా మిగిలిన ఏ పార్టీతో పోల్చినా తెలంగాణ గురించి మాట్లాడే, పోరాడే అర్హత ఉన్నది మావోయిస్టు పార్టీకే. ఎందుకంటే ఆ పార్టీలకన్న ఎక్కువగా, ఆ మాటకొస్తే తెరాస పుట్టడానికి ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కూడ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నదీ, సమర్థిస్తున్నదీ మావోయిస్టు పార్టీయే. ఆ పార్టీ పేర్లు ఆయా కాలాలలో మారి ఉండవచ్చుగాని, 1969 తెలంగాణ ఉద్యమం నాటినుంచీ కూడ నిర్విరామంగా, దృఢంగా తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తున్న పార్టీ అది. అక్కడ కూచున్న మిగిలిన పార్టీలన్నీ 1969 నుంచీ ఇప్పటివరకూ అనేక పిల్లి మొగ్గలు వేసినవే. లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవే. తెరాస అప్పటికి పుట్టనే లేదు. “పార్లమెంటరీ రాజకీయాలను అపహాస్యం చేసే శక్తులు” అనే పేరిట మావోయిస్టు పార్టీ వంటి దృఢమైన తెలంగాణ సమర్థక శక్తిని పక్కకు తొలగించాలనే దురుద్దేశం తోనే చిదంబరం ఈ ఎత్తుగడ వేశారు.
.
ఇక శాంతి భద్రతల మంత్ర జపం చూస్తే, ప్రజల న్యాయమైన ఆగ్రహ ప్రకటనలన్నిటినీ, ప్రజలు పరిష్కారం కోరే సమస్యలన్నిటినీ శాంతి భద్రతల పేరు చెప్పి అణచివేయడం ఈ దేశ పాలకవర్గాలకు తరతరాలుగా అలవాటయిన విద్య. ప్రజల ఆందోళనకు మూలమైన సమస్యలను పరిష్కరించకుండా శాంతి భద్రతల గురించి మాట్లాడడమంటే ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం తమకు లేదని చెప్పడమే. శాంతి భద్రతల పేరుతో ఆ ఆకాంక్షలను, ఆందోళనలను అణచివేస్తామని చెప్పడమే. ఆ పదహారు మందిలో ఐదారుగురికి తెలంగాణ ప్రజా ఆకాంక్షల పట్ల గౌరవమే లేదు, అణచివేసి అయినా సరే శ్మశాన శాంతిని నెలకొల్పాలని వారి కోరిక. కాని తెలంగాణ ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తున్న వారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినవారు కూడ ఈ “శాంతి భద్రతల” కుట్రను గుర్తించలేకపోయారు. అందుకే తెలంగాణ విషయంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయం ప్రకటించినవాళ్లందరూ కూడ శాంతిని నెలకొల్పాలనే ప్రకటన మీద మాత్రం ఉమ్మడిగా సంతకం చేశారు.
.
ఆ సమావేశం తర్వాత “విస్తృత సమాలోచనల కోసం ఒక కమిటీ ఏర్పడుతుంద”నే ప్రకటన వెలువడింది. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారో ఆరోజే ఊహాగానాలు సాగాయి. కాని దాదాపు నెలరోజులు ఏ పనీ జరగలేదు. చివరికి ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ (కమిటీ ఫర్ కన్సల్టేషన్స్ ఆన్ ది సిచువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు జరిగింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మాజీ కార్యదర్శి వి కె దుగ్గల్ కార్యదర్శిగా, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొ. రణబీర్ సింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రిసర్చ్ (ఎన్ సి ఎ ఇ ఆర్) ప్రధాన అర్థశాస్త్రవేత్త డా. అబుసలే షరీఫ్, ఢిల్లీ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐ టి) సామాజికశాస్త్ర ప్రొఫెసర్ డా. రవీందర్ కౌర్ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణాంశాలను ఫిబ్రవరి 12న ప్రకటించారు.
.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటే ఒక కుట్ర
.
ఈ చరిత్ర మొత్తం చూస్తే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి కొనసాగింపు కాదని, డిసెంబర్ 23 ప్రకటనకు కొనసాగింపు అనీ స్పష్టంగానే అర్థమవుతుంది. అంటే మౌలికంగానే ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, వాయిదా వేయడానికి, తప్పకపోతే తెలంగాణ ఇచ్చినా చెడగొట్టి ఇవ్వడానికి మార్గాలు సూచించడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలా, సమైక్య రాష్ట్రం కొనసాగాలా అనే చర్చ చేయడానికే తప్ప, “రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ”లో భాగమైన చర్యలు చేపట్టడానికి శ్రీకృష్ణ కమిటీ ఏర్పడలేదు. అంటే కేంద్రప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన తన ప్రకటనకు తానే కట్టుబడి ఉండదలచుకోలేదని స్వయంగానే, స్పష్టంగానే ప్రకటించిందన్నమాట.
.
అలా ప్రాథమికంగానే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అనుమానాస్పదంగా ఉండగా, ఆ క్రమంలో సాగిన కాలయాపన మరిన్ని అనుమానాలకు దారితీసింది. విస్తృత సమాలోచనలు అవసరమని ప్రకటించిన తర్వాత రెండు వారాలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సమావేశంలో కమిటీ వేయాలని నిర్ణయించినా, కమిటీ పేర్లు ప్రకటించడానికి మరొక నాలుగు వారాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కమిటీ విచారణాంశాలు ప్రకటించడానికి మరొక పది రోజులు తీసుకున్నారు. ఆ కమిటీ విచారణకు పది నెలల గడువు పెట్టారు. ఇదంతా చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పరిష్కారం వెతకడం కన్న, తాత్సారం చేసి, నానబెట్టి, వాయిదావేసి అసలు సమస్యలనుంచి దృష్టి మళ్లించడమే, ఈలోగా శాంతిభద్రతల సాకుచెప్పి ఉద్యమాన్ని అణచివేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టమవుతుంది. అప్పటికే ఒక మాజీ పోలీసు అధికారిని గవర్నర్ గా పంపించారు. తెలంగాణ ప్రజాందోళన మీద దమనకాండ అమలుచేయడం ప్రారంభించారు. ఆ ఆందోళన పూర్తిగా చల్లారిందని అనుకున్న తర్వాతనే, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, నాయకులు కోరుకున్న పద్ధతిలోనే సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ పాలకులు పన్నాగాలు పన్నారనడానికి ఈ కమిటీ ఏర్పాటు ఒక ఉదాహరణ.
.
కమిటీ విచారణాంశాల తయారీ మరొక కుట్ర
.
కమిటీ ఏర్పాటులోనే దురుద్దేశ్యం ఉన్నదనుకుంటే, ఆ కమిటీ విచారణాంశాల ప్రకటనలో అది మరింత స్పష్టంగా బయటపడింది. చిదంబరం డిసెంబర్ 23 ప్రకటనలో “విస్తృత సమాలోచనలు” అవసరమని అన్నారు. విచారణాంశాలు రూపొందేటప్పటికి ఆ విస్తృతం మరీ విస్తృతమైపోయి యాభై ఏళ్ల చరిత్ర పరిశీలనగా మారింది. అసలు డిసెంబర్ 9 ప్రకటనలో చెప్పిన “రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ” కొరకు సమాలోచనలు అవసరమై ఉండగా, విచారణాంశాలలో ఆ “ప్రక్రియ” ఊసే మాయమైపోయి, “ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి సమాలోచనలు” ముందుకొచ్చాయి.
హోం మంత్రిత్వ శాఖ 2010 ఫిబ్రవరి 12న చేసిన ప్రకటన ప్రకారం ఆ విచారణాంశాలు ఏడు. అవి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అవమానించేలా, సమైక్యాంధ్ర కొనసాగింపును బలపరిచేలా, తెలంగాణ ప్రజాందోళనలో చీలికలు తెచ్చేలా, అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. పేరుకు ఏడు విచారణాంశాలు అని లెక్క చెప్పారు గాని ఆ మొత్తం విచారణాంశాలను రెండుగానో, మూడుగానో చెప్పవచ్చు.
.
మొదటి అంశం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగింపు ఉద్యమాల వల్ల ఏర్పడిన పరిస్థితిని పరీక్షించడం; రెండవ అంశం, రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రాంతాల మీద ఆ అభివృద్ధి ప్రభావాన్ని సమీక్షించడం; మూడవ అంశం, విభిన్నవర్గాల ప్రజలపైన ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం అని రాసి, నాలుగవ అంశంగా “పై మూడు అంశాలలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం” అని రాశారు. మరి పై మూడు అంశాలను పరీక్షించడమే నాలుగవ అంశం అయితే, పై మూడు అంశాలలో చేసే పని ఏమిటి? ఎంత తెలివితక్కువ రచయిత అయినా ఇంత హాస్యాస్పదమైన, అర్థరహితమైన వాక్యాలు రాయలేడు, హోంమంత్రిత్వశాఖ తప్ప. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరయినా ఈ మాయను గుర్తించగలరు. కాని కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించదలిచారు. ఆ అంశాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు కితాబులు ఇచ్చి తమ కుటిలత్వాన్ని బహిర్గతం చేసుకున్నారు.
.
ఇక ఐదవ అంశం, విభిన్న వర్గాల ప్రజలను, ప్రత్యేకించి రాజకీయ పార్టీలను సంప్రదించడం అని రాసి, ఆరవ అంశంగా పౌర సమాజ సంస్థలను సంప్రదించడం అని రాశారు. నిజానికి విభిన్నవర్గాల ప్రజలు అనే మాటలోనే ఈ పౌరసమాజ సంస్థలు అన్నీ ఉంటాయి. అది ఒకటే అంశం. అంటే ఐదో అంశం, ఆరో అంశం కలిపి రాయవలసినవే, లేదా ఆరో అంశం రాయనవసరమే లేదు. ఇక ఏడో అంశం కమిటీ తలచుకున్న ఇతర సూచనలకు, సిఫారసులకు సంబంధించినది. అది విచారణాంశం కాదు, కమిటీ అదనంగా చేయవలసిన పని అవుతుంది.
.
అంటే మొత్తం మీద “పిల్లి అంటే మార్జాలం అంటే బిల్లీ అంటే క్యాట్ అని నాలుగు చెప్పాను చూసుకో” అని ఒక్క సంగతే చెప్పినట్టుగా, శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలు ఏడు అని చెప్పినా మౌలికంగా ఉన్నవి రెండే – ఒకటి, 1956 నుంచి జరిగిన అభివృద్ధిని, విభిన్న ప్రాంతాల మీద దాని ప్రభావాన్ని అంచనా కట్టడం, రెండు, రాష్ట్ర విభజన – ఐక్యత మీద వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించడం. ఇవి కచ్చితంగా డిసెంబర్ 9 ప్రకటనను ముందుకు తీసుకుపోయే అంశాలు కావు.
.
ఇందులో మొదటి పని గత యాభైనాలుగు సంవత్సరాలలో వందలాది అధ్యయనాలలో, పరిశోధనలలో, పుస్తకాలలో, నివేదికలలో, ప్రభుత్వ పత్రాలలో జరిగింది. దానికోసం కొత్త కమిటీ అవసరం లేదు. కొందరు గుమస్తాలకు ఆ పుస్తకాలన్నీ అప్పగించి ఒక వారంలోనో, రెండు వారాలలోనో పూర్తి చేయగల మదింపు అది. రెండవ పని 1969 నుంచి నలభై సంవత్సరాలలో మొత్తంగానూ, 1996 నుంచి ప్రత్యేకంగానూ, 2009 నవంబర్ నుంచి మరింత ఉధృతంగానూ అన్ని ప్రచార, ప్రసార సాధనాలలో విస్తృతంగా వెలువడిన విషయమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలమయినదో వివరించే పుస్తకాలు, వ్యాసాలు, కళారూపాలు వందలాదిగా ఉన్నాయి. ఎవరయినా వారం, పది రోజులు పరిశోధిస్తే, పత్రికలూ, టివి ఛానళ్లూ చూస్తే తెలంగాణ ఆకాంక్ష ఎంతగా వ్యక్తమయిందో అర్థమవుతుంది. ఈ పనుల కోసం పది నెలల సమయమూ, ఇరవై కోట్ల రూపాయల బడ్జెటూ అవసరం లేదు.
.
అసలు మొదటి అంశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరికనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే కోరికనూ సమానం చేసి చూడడమే వాస్తవ విరుద్ధం. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలనే కోరిక 1954-55ల్లోనే వ్యక్తమయి, ఫజల్ అలీ కమిషన్ ఆమోదం పొందింది. అది 1956లో ప్రత్యేక రక్షణల ఒప్పందం వల్ల షరతులతో కూడిన ఐక్యతగా వ్యక్తమయింది. 1958 నుంచి 1968 వరకు తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపిన ప్రాంతీయ మండలి నివేదికల రూపంలో వ్యక్తమయింది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయి 370 మంది ప్రాణాలను బలిఇచ్చింది. 1971 ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి విజయంలో వ్యక్తమయింది. 1975 రాష్ట్రపతి ఉతర్వులలో వ్యక్తమయింది. 1985లో 610 జి.ఒ.లో వ్యక్తమయింది. 1996 నుంచీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షగా వ్యక్తమవుతూ 2001 నాటినుంచీ రాజకీయ రంగంలో సంచలనం రేపుతోంది. ఈ కమిటీ ఏర్పడడానికి తక్షణ కారణమైన ఉద్యమం కళ్లముందర ఉధృతంగా సాగుతోంది.
మరి సమైక్య రాష్ట్రం కావాలనే ఆలోచన, “ఉద్యమం” 1953కు ముందు కొందరు ఆలోచనాపరుల రచనల్లో ఉందేమో, 1953-56 మధ్య ‘విశాలాంధ్ర మహాసభ’గా వ్యక్తమయిందేమో, మళ్లీ 2009 డిసెంబర్ 10 నుంచి కనబడిందేమో గాని, ఆ మూడు సందర్భాలలోనూ అది నిజంగా ఉద్యమమేనా? ప్రజాభిప్రాయ ప్రకటనేనా? అయినా సమైక్యంగా ఉండాలని కోరేవారు ఆ సమైక్యత కోసం పాటించవలసిన కనీస ప్రమాణాలను ఎన్నడైనా పాటించారా? లిఖిత రూపంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కరోజయినా అమలు చేశారా? అలా పాటించలేదని, అందువల్లనే యాభై సంవత్సరాలుగా విభజన ఆకాంక్ష ఉందని స్వయంగా హోంమంత్రే జనవరి 5 ఉపన్యాసంలో చెప్పిన తర్వాత, నాలుగు వారాలకు తయారయిన విచారణాంశాలలో రెండు ఉద్యమాలనూ సమానంగా చూసే విచారణాంశం రాశారంటే కేంద్ర ప్రభుత్వ దగుల్బాజీతనం అర్థమవుతుంది.
.
శతకోటి లింగాల్లో బోడిలింగం
.
ఇంతకూ ఈ కమిటీ సిఫారసులకు ఆచరణయోగ్యత ఉందా, ఉంటే ఎంత అనేది కూడ ఆలోచించాలి. ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నది ఒక న్యాయమూర్తే గాని ఇది విచారణ కమిషన్ల చట్టం కింద ఏర్పడిన చట్టబద్ధ న్యాయవిచారణ కమిషన్ కాదు. అటువంటి కమిషన్ల సిఫారసులను కూడ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆమోదించి అమలు చేయాలన్న నియమం లేదు గనుక ఈ కమిటీకి అసలు అర్థమే లేదు. ఈ కమిటీ చేసే పని ఎక్కువలో ఎక్కువగా హోం మంత్రిత్వశాఖకు అవసరమైన సమాచారం అందించడం మాత్రమే. ఈ కమిటీ కన్న ఎక్కువ చట్టబద్ధత ఉన్న, ఎక్కువ విస్తృతమైన కమిటీలు, కమిషన్లు గతంలో తెలంగాణ విషయంలో అనేక సిఫారసులు చేసి ఉన్నాయి. ఆ సిఫారసులలో ముఖ్యమైనవయినా అమలులోకి రాలేదు. నిజానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సాధికారతా లేదు, ప్రాధాన్యతా లేదు. తెలంగాణ విషయంలో 1954నుంచి ఇప్పటివరకు ఏర్పడిన పది కమిషన్లు, కమిటీలలో ఇది ఒకానొకటి మాత్రమే.
.
ఆ పది: 1. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ – 1954-55). 2. కుమార్ లలిత్ కమిటీ (1969). 3. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ (1969). 4. కె జైభారత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ముగ్గురు అధికారుల కమిటీ (1984). 5. వి. సుందరేశన్ కమిటీ (1985). 6. రేవూరి ప్రకాశరెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసనసభా సంఘం (2001). 7. జె ఎం గిర్ గ్లాని ఏకసభ్య కమిషన్ (2001). 8. ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2004). 8. ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసన సభా సంఘం (2006). 9. కె. రోశయ్య కమిటీ (2009). 10. జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ (2010). వీటిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రెండవ శాసనసభా సంఘం, రోశయ్య కమిటీ మూడూ తమకు అప్పగించిన పని చేయలేదు, నివేదికలూ ఇవ్వలేదు. ఇక మిగిలిన ఏడింటిలో, ప్రస్తుత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని మినహాయిస్తే, మిగిలినవన్నీ కూడ తెలంగాణకు అన్యాయం జరిగిందనీ, తెలంగాణలో తగినంతగా, హామీ ఇచ్చినంతగా నిధులు ఖర్చుపెట్టలేదనీ, ఉద్యోగాలలో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా రాలేదనీ, తెలంగాణ వాసులకు రావలసిన ఉద్యోగాలలో ఇతరుల నియామకం జరిగిందనీ స్పష్టంగా చెప్పాయి. ఆ అన్యాయాలను సరిదిద్దాలని ఏదో ఒక స్థాయిలో సూచనలు, సిఫారసులు చేశాయి.
.
ఆ నివేదికలను, వాటి సిఫారసులను అన్నిటినీ కూడ చెత్తబుట్టకు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్ర పాలకులు, ఒకవేళ ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలమైన నివేదిక ఇచ్చిఉన్నా దాన్ని అమలు చేస్తారనే హామీ ఏమీలేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన చర్యలు చేపట్టడం అనేవి నిజానికి రాజకీయ నిర్ణయాలే గాని, ఏదో ఒక కమిటీ చెపితే జరిగేవీ కావు, చెప్పకపోతే ఆగిపోయేవీ కావు.
.
కమిటీకి సహకరించాలా? బహిష్కరించాలా?
.
జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ ఎంత నిజాయితీపరుడైనా, ఆ కమిటీలోని ఇతర సభ్యులు ఎంత నిపుణులైనా ఆ కమిటీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీరుస్తుందనే విశ్వాసం ఉంచడానికి అవకాశం ఎంతమాత్రం లేని స్థితిలో కమిటీ పని మొదలయింది. పదినెలల ఎదురుచూపుల తర్వాత అనుకూల సిఫారసులు చేస్తారో లేదో తెలియని, అనుకూల సిఫారసులు చేసినా అమలుచేస్తారో లేదో తెలియని స్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మీద తెలంగాణ ప్రజలు నమ్మకం పెట్టుకోవడం అసాధ్యం. జాతీయోద్యమ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లను, కమిటీలను భారత ప్రజలు వ్యతిరేకించినట్టే, నిరసించినట్టే, బహిష్కరించినట్టే, సహాయ నిరాకరణ చేసినట్టే శ్రీకృష్ణ కమిటీ పట్ల కూడ తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు, కొంతమంది కమిటీని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.
.
అయితే ఇక్కడ ఒక సమస్య ఉండింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే రాజకీయ డిమాండ్ ను ముందుకు తెస్తూనే అదే సమయంలో ఆలోచించవలసిన విషయాలు కొన్ని తలెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజలలో చాల బలంగా వ్యక్తమవుతున్నప్పటికీ, రాజకీయవర్గాలు అంత బలంగా ఆ ఆకాంక్షలను ప్రకటిస్తున్న పరిస్థితి లేదు. అన్ని రాజకీయపార్టీలూ దివాళాకోరు ఎత్తుగడలతో తమ తమ రాజకీయ స్వప్రయోజనాలకొరకు మాత్రమే తెలంగాణ నినాదాన్ని అరకొరగా తలకెత్తుకున్నాయి. వీలయిన చోటనల్లా మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయ విభేదాలు, విభజనలు మాత్రమే కాక, సామాజిక వర్గాల పునాదిపై విభజనలు, చీలికలు బయటపడడం కూడ మొదలయింది. తమ విభేదాలు పక్కనపెట్టి, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఐక్యంగా పనిచేయలేని పరిస్థితి అప్పటికే మొదలయి, క్రమక్రమంగా పెరుగుతూ ఉండింది.
.
అటువంటి పరిస్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే నినాదానికి సంపూర్ణమైన మద్దతు లభిస్తుందో లేదో అనుమానంగానే ఉండింది. కమిటీ విచారణను నూటికి నూరు శాతం బహిష్కరించ గలిగినప్పుడు మాత్రమే ఆ ప్రభావం కమిటీమీద ఉంటుంది. తెలంగాణ నుంచి ఒక్క వ్యక్తి హాజరయినా, ఒక్క మహజరు సమర్పణ జరిగినా, తెలంగాణవాదులు పాల్గొన్నాకనే, వారి భాగస్వామ్యంతోనే నివేదిక తయారయినట్టుగానే కమిటీ చెప్పుకుంటుంది. సంపూర్ణ బహిష్కరణ జరిగినప్పుడు మాత్రమే ఆ కమిటీ నివేదికను, సిఫారసులను ఏకపక్షమైనవని కొట్టివేసే వీలుంటుంది.
.
అలా సంపూర్ణంగా బహిష్కరించలేనప్పుడు, బహిష్కరించే బృందాలు, వర్గాలు కొన్ని బహిష్కరించినా, పాల్గొనదలచిన వ్యక్తులు, రాజకీయపక్షాలు, బృందాలు తెలంగాణ వాదనలను బలంగా కమిటీ ముందు వినిపించడం ఉచితం కదా అనే వాదన వచ్చింది. అలా వాదించిన వారు, సమైక్యాంధ్రప్రదేశ్ పాలకవర్గాలు తెలంగాణ ప్రజాజీవితాన్ని యాభైనాలుగు సంవత్సరాలుగా ఎట్లా ధ్వంసం చేస్తూ వచ్చాయో సమగ్రమైన నివేదికలు కమిటీ ముందు ఉంచాలనుకున్నారు. గణాంకాలతో, ఉదాహరణలతో, వివరణలతో, సమగ్రమైన సమాచారంతో, విశ్లేషణలతో, వాదనలతో కమిటీ ముందు బలమైన వ్యక్తీకరణలు వినిపించాలనుకున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ ముందు పెట్టి వాదించడం మాత్రమే కాక, దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత న్యాయమైనదో మొత్తం దేశంలోని ప్రజాస్వామిక శక్తులు అంగీకరించి, తెలంగాణ తరఫున వాదించేలా చేయాలనుకున్నారు.
.
ఇలాంటి ఆలోచనతో కమిటీ ముందుకు వెళ్లి నివేదికలు, మహజరులు సమర్పించిన వారు ఎందరో ఉన్నారు. కమిటీ నివేదిక తెలంగాణకు ఏదో ఒరగబెడుతుందని గాని, దాని ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు బలం చేకూరుతుందని గాని వారేమీ అనుకోలేదు. కమిటీ ఒక వాస్తవమై, దాని ముందు కేవలం సమైక్య, కోస్తాంధ్ర, రాయలసీమ వాదనలు మాత్రమే వినిపించడం జరిగితే, దాని నివేదిక వాస్తవాలను ప్రతిబింబించదు గనుక, తెలంగాణ వాదనలు వినిపించడానికి ఈ కమిటీని కూడ ఒక వేదికగా వినియోగించుకోవాలని మాత్రమే అనుకున్నారు. అందువల్లనే అన్ని తెలంగాణ జిల్లాలలోనూ ప్రజలు, ప్రజాసంఘాలు, విశ్లేషకులు, రాజకీయపార్టీలు ఈ కమిటీ విచారణలకు సహకరించారు. ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఏడెనిమిది కమిటీలకు తోడుగా వాస్తవాలను గుర్తించే, అవసరమైన పరిష్కారాలను సూచించే మరొక కమిటీగానైనా ఇది ఉంటుందని భావించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వెలిబుచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను ఈ కమిటీ గుర్తిస్తుందని అనుకున్నారు. కమిటీ సభ్యులు తెలంగాణలో విస్తృతంగానే తిరిగి చూశారు గనుక కళ్ల ఎదుట కనిపించే దోపిడీ, పీడన, అన్యాయం, వివక్ష గాథలను కమిటీ నమోదు చేస్తుందేమోనని ఆశించారు.
.
రెండో భాగం ఇక్కడ చదవండి: http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part2/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *