mt_logo

రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చెప్పిందేంటి.. చేస్తుందేంటి: నిరంజన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీకి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చెప్పిందేంటి.. చేస్తున్నది ఏంటి? ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రమాణం చేసి ఇంకో చేత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ కరచాలనం చేస్తున్నాడు అని అన్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలను రక్షించడం, గౌరవించడం మా బాధ్యత అన్నారు. రాజీవ్ హయాంలో తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లాను మ్యాండేటరీ చేస్తాం.. మరింత పటిష్టం చేస్తాం అన్నారు. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ అపహాస్యం చేస్తున్నాడు అని విమర్శించారు.

రాజకీయ విలువలు, ధర్మసూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించమని ఎందుకు చెప్పడం లేదు. రాజీనామా చేయించి మేము విలువలకు పట్టం కడుతున్నాం అని ఎందుకు చెప్పడం లేదు? డబల్ స్టాండర్డ్స్ ఎందుకు? అని అడిగారు.

కేశవరావుతో రాజీనామా చేయించినట్లు పార్టీలో చేరిన వాళ్లు రాజీనామా చేసి రావాలని రాహుల్ గాంధీ ఎందుకు చెప్పడం లేదు?రాహుల్ మాటలు అన్నీ డబల్ స్టాండర్డ్స్ అని దేశం భావించదా అని ప్రశ్నించారు.

నాగరికుడిగా, ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను అని రాహుల్ అనేక సార్లు పార్లమెంటులో అన్నాడు. మేము సుందర భారతం నిర్మిస్తాం అని రాహుల్ చెప్పాడు. రాహుల్ నోటి నుండి చెప్పిన ప్రకారం తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు

ప్రజా ప్రతినిధుల పార్టీ మార్పును నిస్సిగ్గుగా ఎలా స్వీకరిస్తారు? మాజీ స్పీకర్‌ను చేర్చుకుంటున్నామని గర్వంగా చెప్పుకోవడం ఎంత వరకు సమంజసం? నాగరిక పౌరుడిగా నేనూ అడుగుతున్నాను రాహుల్ వీటిని ఎలా సమర్దించుకుంటున్నారు? ఈ లేఖ అంశాన్ని ఇక్కడితో వదలం.. జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం.. స్వయంగా రాహుల్ దీనికి సమాధానం చెప్పాలి అని తెలిపారు.

రాహుల్ మీద బీజేపీ అక్రమ కేసులు వేసి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి, అయన క్వార్టర్ ఆగమేఘాల మీద రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించారు అన్నప్పుడు పార్టీలకు అతీతంగా సానుభూతి చూపించాం. సర్వోన్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉందని రాహుల్ అన్నాడు .. అదే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు పార్టీ మారిన వారి సభ్యత్వం రద్దు కావాలి అని చెబితే ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్‌ను ఎందుకు మీరు ఆదేశించరు అని అడిగారు.

డబల్ స్టాండర్డ్స్ మూలంగా మోడీ ఈ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయి మిత్రపక్షాల సహకారంతో గద్దెనెక్కాడు. రాహుల్ మీ డబల్ స్టాండర్డ్స్ చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరా? మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఏడుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోలేని రాహుల్ దేశాన్ని ఎలా మెప్పిస్తాడు? అని ధ్వజమెత్తారు.

తెలంగాణలో చేరికల విషయంలో రాహుల్ గాంధీ మేం లేవనెత్తిన అంశాలపై ఖచ్చితంగా స్పందించాలి. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలోని అన్ని వర్గాలను వంచించారు. నిరుద్యోగులను అమానుషంగా మోసం చేసారు. మీరు ఇచ్చిన హామీలపై ఆశపడ్డ వర్గాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.