ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి, రైతుభరోసా పథకం అమలు చేసి రైతాంగానికి చేయూతనివ్వాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతల మీద ఆంక్షలా.. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి అని అన్నారు.
రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు.. రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని.. ఆంక్షలు లేవని సీఎం చెబుతున్నాడు.. కానీ గైడ్‌లైన్స్ ఎక్కడా మార్చలేదు అని విమర్శించారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు.. అధికారం వచ్చిన తర్వాత అప్పులు, వడ్డీలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ ఏర్పాటును ఆఖరు నిమిషం వరకు అడ్డుకుని వందల మంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడు కూడా పదేళ్లలో తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఎదిగిందని ఒప్పుకున్నారు అని అన్నారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలుస్తుంది. 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు.. మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. రైతుల గుర్తింపుకే రేషన్ కార్డు అంటున్నారు.. మరి రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి ఏంటి అని అడిగారు.
కొద్దిమందికి ఇచ్చి సంబరాలు చేాయాలని ప్రభుత్వం భావిస్తున్నది.. రైతుకు సాయం విషయంలో వర్గీకరణ, ఆంక్షలు విధించవద్దు.. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రుణాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్నీ ప్రభుత్వం మాఫీ చేయాలి.. రైతు కడితేనే ఇస్తాం అనడం కాలయాపన చేయడమే అని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.
వ్యవసాయం చేయకుండా పట్టాదారు పాస్‌బుక్ కలిగి ఉండి రైతుబంధు పొంది ఉన్నట్లయితే.. అదే పాస్‌బుక్‌తో రుణం కూడా తీసుకుని ఉంటాడు కదా? మరి ఏ కారణాలతో రైతు భరోసా నిలిపివేస్తున్నారు ? రుణమాఫీ చేసినట్లే రైతుభరోసా కూడా అమలు చేయాలి.. కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకన్నా రైతుభరోసా ఇవ్వండి అని డిమాండ్ చేశారు.
రుణమాఫీకి పట్టదారు పాస్‌బుక్కును ప్రామాణికంగా తీసుకుంటే రైతుభరోసాకు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలి. కొండలు, గుట్టలు అంటూ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుంది. రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారు అని ధ్వజమెత్తారు.
రూ.40 వేల కోట్లు ఏకబిగిన మాఫీ చేస్తాం అన్నారు.. తర్వాత రూ. 31 వేల కోట్లు అని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాడు లేని ఆంక్షలు నేడు ఎందుకు ? పట్టాదారు పాస్‌బుక్ ప్రామాణికంగా రుణమాఫీ చేయాలి. అనర్హులు ఉంటే ప్రభుత్వం ఏరి వేసుకోవచ్చు.. షరతులు లేని రుణమాఫీ జరగాలి. గత ప్రభుత్వం రెండు విడతలలో రూ. 29 వేల కోట్లు రుణమాఫీ చేశాం.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశాం అని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో రూ. 6 వేల కోట్ల రుణాలు మాత్రమే మిగిలిపోయాయి.. ఆంక్షలు లేకుండా రైతులకు పథకాలు అమలు చేశాం. లక్ష వరకు ఎంత మంది? రెండు లక్షల వరకు ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలి. కరెంటు లేక, నీళ్లు లేక రైతాంగం నానాయాతన పడుతున్నారు.. క్రిష్ణా బేసిన్‌లో ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదు. ఇలాంటి సమయంలో రైతులకు రైతుభరోసాతో చేయూతనిస్తే వారు దైర్యంగా వ్యవసాయం చేసుకుంటారు అని పేర్కొన్నారు.
వ్యవసాయం బలపడితే, స్థిరపడితే అన్నదాతలు వేల మందికి ఉపాధినిస్తారని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతలకు అండగా నిలిచాం. రైతుబంధు, రైతుబీమా, సాగునీళ్లు, ఉచిత కరెంటు, పంటల కొనుగోళ్లు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపాం. లక్ష 20 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 600 కోట్ల పైచిలుకు రైతుబీమా అందించాం.. 2014 లో కోటి 31 లక్షల ఎకరాలలో ఉన్న సాగును 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెంచాం. 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తిని దాదాపు 3 కోట్ల టన్నులకు పెంచుకున్నాం. రూ. లక్ష 33 వేల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.. ఏటా రూ. 10,500 కోట్ల సబ్సిడీ భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందించాం అని కొనియాడారు.
పదవిచ్చిన ప్రజలను వదిలేసి పదవులు ఉన్న నాయకులను చేర్చుకుంటున్నారు.. ఆయారాం, గయారాం అనే పదం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వల్ల అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కట్టిన రైతువేదికలు ఈ రోజు కాంగ్రెస్ వేడుకలకు పనికివస్తున్నాయి.. ఆనాడు వ్యతిరేకించిన రైతు వేదికలు, కాళేశ్వరం, సచివాలయాలు నేడు కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యాయి. అధికారం కోసం నిరుద్యోగులను వాడుకుని నేడు వారి మీద నిర్భంధం విధిస్తున్నారు.. హామీల అమలుకు కాంగ్రెస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది.. పథకాలు ఎగ్గొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.