కేంద్రంలో ఉన్న సర్కారుకు దేశంలో వ్యవసాయరంగంపై ఓ అవగాహన ఉండాలి. ఏ పంటలు పండుతున్నాయి? అన్నదాతలను ఎలా ప్రోత్సహించాలి? దేశ అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఎలా ఉత్పత్తి చేయాలి? అనేదానిపై క్లారిటీ ఉండాలి. కానీ, బాయిల్డ్ రైస్‌పై కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి అవగాహన శూన్యమని ఇట్టే అర్థమైపోతున్నది. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ విధానాలతో తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనేందుకు నాడు కేంద్రం వెనకడుగు వేసింది. తాము బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదు.. అవసరమైతే మీ రాష్ట్రాల ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవహేళన చేశారు. తెలంగాణ ప్రజలు, అన్నదాతలను ఘోరంగా అవమానించారు. ఇప్పుడు అదే కేంద్ర సర్కారు బాయిల్డ్ రైస్ దేశం దాటిపోకుండా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నది. అన్నదాతలు, వ్యవసాయంపై తమకు ఓ విజనే లేదని నిరూపించుకొంటున్నది.
నాడు ఫుల్.. నేడు నిల్..బాయిల్డ్ రైస్‌పై పొంతనలేని మాటలు!
దేశంలో నాలుగేండ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయి. కనుక మేం రాష్ట్రాలనుంచి బాయిల్డ్ రైస్‌ను తీసుకోం… ఇవీ కేంద్రంలోని బీజేపీ సర్కారు రెండేండ్ల కింద చెప్పిన మాటలు. రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని రాష్ట్రాలకు ఉచిత సలహా కూడా ఇచ్చింది. కానీ, రెండేండ్లకే ఇప్పుడు దేశంలో బాయిల్డ్ రైస్ నిల్వలు తగ్గిపోయాయని, ఎగుమతిని అడ్డుకొనేందుకు 20 శాతం సుంకం విధిస్తామని అంటున్నది. నాడు సీఎం కేసీఆర్, అన్నదాతలు రోడ్డెక్కినా బాయిల్డ్ రైస్ కొనని కేంద్ర సర్కారు కేవలం రెండేండ్లలోనే బియ్యం నిల్వలు లేవంటూ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ సర్కారు అన్నదాతలపాలిట శాపంలా దాపురించిందని ప్రజలు మండిపడుతున్నారు. మన బియ్యంపై ఆధారపడ్డ ఇతర దేశాలూ బీజేపీ సర్కారు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో బియ్యం ఎగుమతులను అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా భారత పరువు మంటగలిసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.