మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి చేరికలు కొనసాగుతున్నాయి.ముంబై కుర్లా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ప్రజల్లో రాజకీయ పట్టు వున్న అప్పాసాహెబ్ ఆనందరావు అవ్చారే’ చేరిక ప్రాధన్యతను సంతరించుకున్నది. సోమవారం నాడు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ సమక్షంలో అవ్చారే ఆ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా తొమ్మిదేండ్ల అనతికాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం తనకెంతో సంతోషంగా వుందని అప్పాసాహెబ్ తెలిపారు. తెలంగాణలో సాధించిన అభివృద్ధిని మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు…అందుకోసం తాము సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని మహారాష్ట్రలో గులాబీ జెండాను ఎగరేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులున్నారు.
పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్రలో ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడు గా అప్పాసాహెబ్ పేరుగాంచారు. ముంబాయిలోని చెంబూర్ లో ప్రజా గ్రంథాలయాన్ని స్థాపించి ఆయన విద్యార్థులకు పోటీపరీక్షల్లో సాయపడుతూ, ప్రజలకు చదువును అలవాటుగా మార్చేందుకు సాయపడుతున్నారు. విద్యాభ్యాసాన్ని పెంపొందించే దిశగా ఆయన చేపట్టిన చర్యలకు, చేసిన సేవలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ గ్రంథాలయంగా గుర్తించింది. ఈ గ్రంథాలయంలో 24 లక్షల రూపాయల విలువ చేసే 21 వేల పైచిలుకు గ్రంథాలను అందుబాటులో వుంచడం ద్వారా విద్యారంగానికి సేవ చేస్తున్నారు.