mt_logo

తెలంగాణ భూములు అమ్మకంపై “నమస్తే తెలంగాణ” సంపాదకీయం – మా భూమి

హైదరాబాద్ నగరంలోని, శివారులోని విలువైన భూములను హెచ్‌ఎండిఎ వేలానికి పెట్టాలని నిర్ణయించడం తెలంగాణవాదులకు ఆందోళన కలిగిస్తున్నది. ఇంత హడావుడిగా భూములు అమ్మడం అవసరమా, ఏ బలమైన కారణం లేకుండానే భూములను అన్యాక్షికాంతం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనే సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా త్వరలో స్వీయ రాష్ట్రం సిద్ధిస్తుందనే సూచనలు కనిపిస్తున్న దశలో, రాష్ట్ర పాలకుల చర్యలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉన్నది.

రాజధాని నగరంలోని అత్యంత విలువైన నలభైకి పైగా స్థలాలను వేలం వేయాలని హైదరాబాద్ మెట్రొపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) నిర్ణయించింది. ఈ భూముల అమ్మకం ద్వారా దాదాపు 130 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. హైదరాబాద్ నగరంలోని భూములను ఇప్పటికే నగరాభివృద్ధి సంస్థ అనేక సార్లు అమ్మింది. గత ఏడాది ఇదే హెచ్‌ఎండిఎ ముప్ఫై కోట్ల రూపాయల విలువైన స్థలాలు అమ్మింది. ఏడాది తిరగగానే ఇప్పుడు మళ్ళీ మరికొన్ని స్థలాలు అమ్మకానికి పెట్టింది. కేవలం నిధుల కోసమే ఈ భూముల అమ్మకం సాగడం మరీ విడ్డూరం.

నగరాభివృద్ధి సంస్థగా 1975లో ఏర్పడిన హుడా 2008లో హెచ్‌ఎండిఎగా అవతరించింది. హైదరాబాద్ నగర పొలిమేరల్లో ఉన్న రంగాడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రాంతాలు కూడా ఈ సంస్థ పరిధిలో ఉన్నాయి. వైశా ల్యం ఏడు వేల చదరపు కిలోమీటర్లకు పైనే ఉంటుంది. తెలంగాణలోని ఈ అత్యంత విలువైన, విశాల ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది హెచ్‌ఎండిఎ లక్ష్యం కావాలె. కానీ అభివృద్ధి ముసుగులో లేదా నిధుల కోసం భూ వనరును అమ్ముకోవడం వంటి చర్యలకు పాల్పడడం దారుణం. హెచ్‌ఎండిఎ 2004 నుంచి ఇప్పటి వరకు ఏడు వంద ల ఎకరాల భూమిని అమ్మివేసింది. ఈ అమ్మకాల ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు ఆర్జించినట్టు గొప్పగా చెప్పుకున్నా, కేవలం నిధుల కోసం భూములను కోల్పోవడం క్షమార్హం కాదు.

వైఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ భూముల అమ్మకం తీరు చూస్తేనే తెలిసిపోతుంది. ప్రభు త్వ కళాశాలలను, ఆస్పవూతులను బలోపేతం చేసే బదులు ప్రైవేటు రంగంలో కార్పొరే ట్ కాలేజీలు, స్టార్ ఆస్పవూతులను మేపేందుకు వైఎస్ ప్రభుత్వం ఫీ రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశ పెట్టింది. లక్ష కోట్ల బడ్జెట్ పేరుతో బంధుమిత్ర గణాలకు కోట్ల రూపాయల సంతర్పణ సాగింది. దీని కోసం వివిధ ప్రభుత్వ శాఖలను వనరుల సేకరణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌ఎండిఎ నిధుల సేకరణ కోసం వందలాది ఎకరాల భూములను అమ్మిపారేసింది. హైదరాబాద్ నగరంలో వందలాది ఎకరాలు అమ్మడం కన్నా బాధ్యతారాహిత్యం మరేముంటుంది? వనరుల పరిరక్షణపై ఒకవైపు తెలంగాణవాదులు పోరాడుతూనే ఉన్నారు.

భూముల కబ్జాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు వందలాది ఎకరాలను హెచ్‌ఎండిఎ పరాధీనం చేసింది. ఇప్పుడు అమ్మదలిచిన స్థలాల మొత్తం వైశాల్యం ముప్ఫై ఎకరాల వరకు ఉంటుందని అంచనా. నిజానికి హెచ్‌ఎండిఎకు ప్రత్యేకించి ఇంతగా ఆస్తులు ఉండే అవకాశం లేదు. కానీ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వందలాది ఎకరాల భూములను కాలక్షికమంలో పొందింది. వీటిని ప్రజల అవసరాల కోసం వాడుకోవాలె. భవిష్యత్ అవసరాల కోసం కాపాడుకోవాలె. కానీ చిల్లర ఖర్చుల కోసం అమ్ముకోవడం అభ్యంతరకరం. నాడు హుడా కానీ, నేటి హెచ్‌ఎండిఎ కానీ నగరాభివృద్ధి కోసం ఏర్పాటయింది. కానీ దీనిని వనరుల సమీకరణ కోసం భూములు అమ్మి పెట్టే సంస్థగా వాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఘనత! ఒకవేళ హెచ్‌ఎండిఎ రోజువారీ అవసరాల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కావాలన్నా, వాటిని సమకూర్చుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బడాబాబుల భారీ నిర్మాణ ప్రాజెక్టులకు రాయితీలు ఇవ్వకుండా, వీరి అక్రమాలను చూసీ చూడనట్టు ఉండకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తే కోట్లాది రూపాయల అదనపు ఆదాయం వరదలా వస్తుంది.

తెలంగాణకు హృదయం వంటి అందమైన హైదరాబాద్‌ను ప్రపంచంలోనే సుందరమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని నాటి పాలకులు కలలు గన్నారు. ఒకప్పుడు దేశంలోనే ఐదవ పెద్ద నగరమిది. వలస పాలకుల పుణ్యమా అని ఇప్పుడు ఒక మెట్టు దిగజారి ఆరవ స్థానానికి చేరుకున్నది. ఐదు లక్షల జనాభా కోసం నిర్మించిన పౌర వసతులను తదనుగుణంగా పెంచిందీ లేదు. కృష్ణస్వామి ముదిరాజ్ వంటి మేధావులు మేయర్లుగా ఉండి ఆధునిక నగరానికి రూపకల్పన చేశారు. కానీ ఇప్పుడు నగర సౌందర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు దేశంలోని ఏ నగరానికి లేని విశాలమైన ప్రభుత్వ భూములు ఉండేవి. విలీనం తరువాత భూమి సమస్యగా మారుతుందని కూడా తెలంగాణవారు గ్రహించారు. ఇక్కడి భూములను అనుమతి లేకుండా ఆంధ్రవారు కొనగూడదని విలీనం సమయంలో షరతు పెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ ఒప్పందాలను తుంగలో తొక్కిన ఆంధ్ర పాలకులు హైదరాబాద్ భూములను కొనుక్కోవడం కాదు, భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మిగిలి ఉన్న అరకొర భూములను కూడా అమ్మకానికి పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఇక్కడి భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలె. ఒక్క భూముల అమ్మకమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రజలే తమ ప్రాధాన్యాలను నిర్ణయించుకుంటారు.

హెచ్.ఎం.డి.ఏ భూముల అమ్మకంపై మిషన్ తెలంగాణ క్యాంపెయిన్:

– Stop Telangana land sales immediately

– TRS responds to our campaign on Land Sales

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *