mt_logo

పసుపు బోర్డు కోసం రాజీలేని పోరాటం- కవిత

పసుపు బోర్డు కోసం పార్లమెంట్ లో, బయట రాజీలేని పోరాటం చేశానని, పసుపు బోర్డు ఇవ్వలేమని చెప్పిన బీజేపీ నేతలే నేడు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, పసుపు బోర్డును సాధించేవరకు వదిలేదిలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండల కేంద్రాల్లో, ఆర్మూరులోని పెర్కిట్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కల్వకుంట్ల కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసుపు పార్క్ తమ వల్ల కాదని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. పసుపు రైతుల కోసం రూ. 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చించి వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద పసుపు పార్క్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. దేశం ముందుకు పోవాలంటే కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెట్టాలని, దేశం వెనుకబాటుతనానికి ఈ రెండు పార్టీల వైఫల్యమేనని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఆమె చెప్పారు.

పచ్చి అబద్దాలు ఆడుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఒక ఝూఠా పార్టీ అని, పేదలకోసం, రైతుల కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని, తన మెదడును కరిగించి, రక్తాన్ని మరిగించి ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుత్, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఎన్నికలున్నా, లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. 2014లో కాంగ్రెస్ హయాంలో ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపితే ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న బకాయిలు చెల్లించారని గుర్తుచేశారు. గతేడాది రూ. 150 కోట్లతో ఎర్రజొన్నలను ప్రభుత్వానికి నష్టమైనా రైతుల సంక్షేమం కోసం కొనుగోలు చేశామని, రాబోయే రోజుల్లో ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇవ్వడం టీఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు. రైతులైనా, తానైనా పోరాడేది జాతీయ పార్టీలతోనేనన్నారు. జాతీయ పార్టీల ఫేస్ బుక్కు, వాట్సాప్ లలో పచ్చి అబద్దాలు వైరల్ చేస్తున్నాయని, పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ వ్యయంతోనే జరుగుతున్నట్లుగా బీజేపీ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటుందని కవిత విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *