mt_logo

ఆగమాగం కావొద్దు.. ఆలోచించండి- కేసీఆర్

సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అద్భుతమైన సంపద, వనరులున్నాయని, కానీ వాటిని వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పాలిస్తున్నందువల్లే పరిస్థితి ఇట్లా ఉందని కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా చాలామంది చాలా మాటలు చెప్తారని, కానీ ప్రజలు ఆగమాగం కావద్దని, అన్నీ విని ప్రశాంతంగా వాస్తవాలు ఏంటో ఆలోచన చేయాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లపై ప్రజలు విసుగుచెందారు. రాబోయే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పరిపాలించబోతున్నాయని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మార్చేస్తానని చెప్పారు.

2001 లో నేను ఈ పంచాయితీ ఎందుకని అనుకుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోవు. గులాబీ జెండా ఎగరేసిన.. మీరంతా కలిస్తేనే తెలంగాణ వచ్చింది. గోదావరిఖని పెద్ద సంఖ్యలో కార్మికులు, కార్మికసంఘాల నాయకులు, అనేక సంఘాలు ఉన్న ప్రాంతం. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ఆలోచన మీరు చెయ్యాలి. సింగరేణి కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు చేసినం. డిపెండెంట్ ఉద్యోగమో.. ఏదో ఒక పేరు పెట్టి 6,742 ఉద్యోగాలు ఇచ్చినం. మిగిలిన వారికి కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగం వద్దంటున్నారో వారికి రూ. 25 లక్షలు ఇస్తున్నాం. ఉద్యోగి చనిపోతే రూ. 20 లక్షలు ఇస్తున్నం. మీ ఇండ్లకు ఉచిత కరెంట్, ఏసీ ప్రొవిజన్ పెట్టించినం. ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పించినం. ఇంకా సమస్యలు ఉన్నయి. వాటిని కూడా తప్పకుండా పరిష్కారం చేస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ పూర్తిచేసి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు పారిస్తం. 200 కిలోమీటర్ల గోదావరి సజీవంగా ఉండే దృశ్యం గోదావరిఖని కాడనే చూస్తం. రామగుండంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయిస్తా. చెన్నూరులో వందశాతం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయిస్తా అని సీఎం హామీ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. భూముల పట్టాల విషయంలో, మ్యుటేషన్ల విషయంలో ఎవరికీ రూపాయి లంచం కూడా ఇవ్వకండి. ప్రభుత్వం ప్రజలు, రైతుల పక్షాన ఉంటది. ఎవరికీ నష్టం రానీయను. బోర్లకుంట వెంకటేశ్వర్లు విద్యాధికుడు. పెద్దపల్లి ఎంపీగా ఒక నేతకాని సమాజానికి గుర్తింపు రావాలని, ప్రేమతో అతనికి నేను టిక్కెట్ ఇచ్చాను. కాబట్టి అతడిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన గౌరవాన్ని పెంచాలని కోరుతున్నానని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *