నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేరుచెబితే ఎవరికైనా ఠక్కున గుర్తుచ్చేది నోటిదురుసు.. దురహంకారం.. రెచ్చగొట్టే స్వభావం. చావునోట్లో తలపెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్‌తోపాటు బతుకమ్మకు గుర్తింపు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కవిత.. ఐటీలో తెలంగాణను మేటిలా తీర్చిదిద్దుతున్న మంత్రి కేటీఆర్‌పై నిత్యం అవాకులు చవాకులు పేలుతుంటారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంటారు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి తనను గెలిపించిన నిజామాబాద్ అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అర్వింద్.. ఆ గడ్డ రుణం తీర్చుకొనేందుకు కేంద్రం నుంచి నయాపైసా తీసుకురాలేదు. నిజామాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కృషిచేస్తుంటే కనీసం సహకరించకుండా వారిపైనా అర్వింద్ అసత్యపు ఆరోపణలు.. ప్రచారాలతో నిత్యం దూషణలకు దిగుతుంటారు. తాజాగా, కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో బుడబుక్కల అనే పదాన్ని వాడి తెలంగాణ సమాజంలో అలుసైపోయారు.
నోటి దూల ఎంపీ అర్వింద్!
ఎంపీ అర్వింద్‌కు మొదటినుంచీ నోటిదూల ఎక్కువే. ఎమ్మెల్సీ కవితపై నోటికి ఇష్టమొచ్చినట్టు వాగడంతో నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని అర్వింద్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను విమర్శించారు. కేటీఆర్ వేషధారణ బుడబుక్కలోళ్లలాగా ఉంటుందని చీప్ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అనే సోయి మరిచి చౌకబారుగా మాట్లాడారు. దీనిపై ఆ కులస్థులు భగ్గుమన్నారు. వెంటనే తేరుకొన్న అర్వింద్ తప్పును సరిదిద్దుకొనేందుకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో బీజేపీకి ఉన్న కాస్తో కూస్తో పరువును గంగలో కలిపారు. ఇటీవల నోటాకు ఓటేసినా.. కాంగ్రెస్‌కు వేసినా.. బీఆర్ఎస్‌కు వేసినా.. తానే గెలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నదని చెప్పకనే చెప్పారు. దీనిపైనా సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీజేపీ విజయాలపై విచారణ జరుపాలని ఎలక్షన్ కమిషన్‌కు వినతులు వెల్లువెత్తాయి. ఇలా రోజుకో చిల్లర మాటతో బీజేపీని ఇంకా దిగజార్చుతున్నారని సొంత పార్టీ నేతలే అర్వింద్‌పై గుస్సా అవుతున్నారు.