mt_logo

బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి: కేసీఆర్

మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఎస్పీ తెలంగాణ శాఖా మాజీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ బహుజన సిద్ధాంతం గురించి మాట్లాడారు.

బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి.. విపరీతమైన మేధోమథనం జరగాలి.. 14 ఏండ్లు రాష్ట్ర సాధనకోసం 10 ఏండ్లు ప్రగతి సాధన కోసం నా ఉద్యమం సాగింది… కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసినవాళ్లు.. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి.. ఒకసారి కమిట్ అయినంక వెనక్కు రావద్దు అని కేసీఆర్ అన్నారు.

ఈ నడుమ జరిగిన రివ్యూలో మనవాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించింది.. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు కానీ అట్లాంటి ఆలోచన సరికాదు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి.. దళిత సమాజం దీన్ని పాజిటివ్‌గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి అని పేర్కొన్నారు.

దళిత శక్తితో పాటు బహుజన శక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిండు.. దాన్ని మనం కొనసాగించాలే. బహుజనుల్లో సామాజిక చైతన్య స్థాయిని మరింతగా పెంచాల్సి ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాడులు జరిగేది దళితుల మీదనే.. పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలే.. కలెగలిసి పోవాలంటే ఏంచేయాలో ఆలోచన చేయాలి.. అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి… ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి.. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలి అని కేసీఆర్ సూచించారు.

20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే మీ లేదు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. ఇండియాలో ఏ రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టలే.. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినం అని గుర్తు చేశారు.