అమృత్ టెండర్లలో అవకతవకలపై ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అమృత్ టెండర్లలో భారీ అవినీతి జరిగింది. రూ. 8,888 కోట్ల రూపాయలకుపైగా టెండర్లు ప్రభుత్వం పిలిచింది. వీటిలో జరిగిన అవినీతిపైన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు.
ఈ టెండర్లలో అవినీతిని ఆపేదాక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాను. ఈ టెండర్ల తాలూకు సమాచారం ఎక్కడా లేకుండా ప్రభుత్వం కుట్ర చేసింది. సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా వివరాలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి షోదా కన్స్‌ట్రక్షన్ పేరుతో భారీగా టెండర్లను కట్టబెట్టింది అని ఆరోపించారు.
రెండు కోట్ల రూపాయల వార్షిక లాభం ఉన్న ఈ కంపెనీకి వందల కోట్ల రూపాయల టెండర్లను ముఖ్యమంత్రి కట్టబెట్టారు. ఇలాంటి అర్హతలు లేకున్నా ఈ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఇందుకోసం అన్ని అర్హతలు ఉన్న ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఉపయోగించారు. కానీ టెండర్లు గెలుచుకున్న కంపెనీ కేవలం 20 శాతం పనులను మాత్రమే చేస్తుంది. మిగిలింది అంతా చేసేది కేవలం రెండు కోట్ల రూపాయల వార్షిక లాభం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ అని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న క్రోనీ క్యాపిటలిజం సరైన ఉదాహరణ ఇదే. ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతున్న నేపథ్యంలో ఈ టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాము అని అన్నారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని కూడా ముఖ్యమంత్రి తుంగలో తొక్కారు. 191 ఆర్టికల్ ప్రకారం గతంలో సోనియాగాంధీ, ఈ మధ్యనే హేమంత్ సొరేన్ వంటి నాయకుల పైన ఆరోపణలు వచ్చాయి. సోనియా గాంధీ తన పదవిని కూడా కోల్పోయారు. త్వరలో రేవంత్ రెడ్డి, పొంగులేటి తమ పదవులు కొల్పోతారు అని జోస్యం చెప్పారు.
తెలంగాణలో జరిగిన అమృత టెండర్ల స్కాంపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైన స్పందించాలి అని కోరారు.
ప్రధానమంత్రి తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ఆర్ టాక్స్ సంబంధించి ఆరోపణలు చేయడం కాదు.. వెంటనే తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైన చర్యలు తీసుకోవాలి. ఆధారాలతో సహా తెలంగాణ అమృత్ టెండర్లలో జరుగుతున్న అవినీతిపైన ఫిర్యాదు చేసిన తర్వాత ప్రధానమంత్రి స్పందిస్తారో లేదో చూడాలి. ఒకవేళ నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అమృత్ టెండర్లలలో జరిగిన అవినీతి నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. ఇది బీజేపీ చిత్తశుద్ధికి ఒక లిట్మస్ పరీక్ష అని గుర్తించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల కుటుంబ సభ్యులకు టెండర్లు ఇచ్చారు. ఒకవేళ అమృత్ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అదే మాటను బీజేపీ నేతలు, ప్రధానమంత్రి దేశానికి చెప్పాలి. కానీ అవినీతి జరుగుతున్న మౌనంగా ఉండి.. చర్యలు తీసుకోకుండా ఉండడం అన్యాయం అని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఎండగడతాం. క్రోనీ క్యాపిటలిజం గురించి ఢిల్లీలో మాటలు చెబుతున్న రాహుల్ గాంధీని ఎండగడతాం. తెలంగాణలో అనేక అంశాల్లో అవినీతి జరుగుతూనే ఉన్నది. నిన్న అమృత్ టెండర్లపైన ఫిర్యాదు చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల వరకు సమయం ఇవ్వండి, సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ పార్లమెంటు సమావేశాల లోపల కేంద్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపైన స్పందించకుంటే పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం అని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. ముఖ్యమంత్రి పైన వచ్చే ప్రతి విమర్శకు బీజేపీ కెంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి కాపాడుతున్నారు. 8 మంది ఎంపీలున్నా ఇప్పటిదాకా 11 నెలలలో ఒక్కరు కూడా ప్రభుత్వ అవినీతిపైన మాట్లాడలేరు అని విమర్శించారు.
ఎంపీలను, ఎమ్మెల్యేలను గొర్రెల మాదిరి కొంటున్నారు అన్న మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలోని గోట్ మండిని చూడాలని స్వాగతిస్తున్నాను. ఖర్గే తెలంగాణలో జరుగుతున్న గొర్రెల కొనుగోళ్లును చూడాలి.. కాంగ్రెస్ పార్టీనే పార్టీ ఫిరాయింపులు మెదలుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ తెలంగాణలో ఫిరాయింపులు జరుగుతున్న విషయంలో కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని సూచించారు.
నాపై ఎలాంటి కేసు పెట్టుకున్నా, విచారణలు చేసుకున్న నాకేం భయం లేదు. 5 వారాల కింద తెలంగాణ రెవెన్యూ మంత్రిపైన ఈడీ దాడి జరిగింది. కానీ ఇప్పటిదాకా కనీసం ఈడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రి కూడా కనీసం మాట్లాడలేదు. కానీ ఈడీ దాడి తర్వాత అదానీ వచ్చి అదే మంత్రితో చర్చలు చేశారు. అదానీతో జరిగిన సమావేశం తాలుకు వివరాలను పొంగులేటి బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.
క్యాబినెట్‌లో కూర్చుని, పొంగులేటి తన కొడుకుకు టెండర్ల పనులు కట్టబెడితే ఎలా న్యాయం అవుతుంది. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ కంపెనీల కన్నా రాఘవ కంపెనీ గొప్పది అంటా ఈ విషయంలో మంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ పేరు తలుచుకోలేకుండా ఒక్క రోజు కూడా గడపలేదు. ఒకవేళ ప్రజలు కేసీఆర్ గారిని మర్చిపోతే.. రేవంత్ ఎందుకు అంతగా తల్చుకుంటున్నారు. మహరాష్ట్రలో రాహుల్ గాంధీ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు అని దుయ్యబట్టారు
మహరాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ సొమ్ము వెళ్తుంది. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముని మహారాష్ట్రలో అబద్ధాల ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఇచ్చిన హమీలుకు నిధులు లెవంటున్న ప్రభుత్వం, చేయని హమీలు అమలుపైన ప్రచారం కోసం అడ్డగోలుగా వందల కోట్లతో ప్రచారం చేస్తున్నది. తెలంగాణలో చేయని పనులు చేసినట్లు రాహుల్ గాంధీ చెప్తున్నారు అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటనలోని ఒక్క హమీని కూడా కాంగ్రెస్ తెలంగాణలో నెరవెర్చలేదు. కానీ రాహుల్ గాందీ అన్ని అమలు చేసినట్టు అబద్ధాలు చెప్తున్నారు. రూ. 2,500 మహిళలకు ఇచ్చినట్లు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణలో ఇచ్చిన ఏ హమీని కాంగ్రెస్ నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు కానీ పూర్తి అయినట్టు రాహుల్ అసత్యాలు చెప్తున్నారు. తెలంగాణలో హమీలు అమలు అయ్యాయో లేదో ఇక్కడి ప్రజలను అడిగి మహారాష్ట్ర ప్రజలు అడిగి తెలుసుకోవాలి అని అన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి గ్రామంలో అడిగినా కూడా హమీల అమల్లో ఉన్న వైఫల్యాలను ప్రజలు చెప్తారు..మహారాష్ట్ర ప్రజలు ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయండి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఓటు వేయవద్దని వినతి. ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకున్నది ప్రాంతీయ పార్టీలే, కాంగ్రెస్‌కు బీజేపీని అపే శక్తి లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అవినీతి సొమ్ము మహారాష్ట్రలో పారుతుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఎలక్షన్ కమిషన్ చెక్‌పోస్టులను పెంచాలి. అప్పుడే తెలంగాణ డబ్బులు మహరాష్ట్రకి వెళ్లకుండా అడ్డుకోగలుగుతాం. తెలంగాణలో చేయని కార్యక్రమాలను చేసినట్లు రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. గతంలో వాల్మికీ స్కాం సొమ్ము తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగించినట్లు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ చర్యలు తీసుకోలేదు అని అన్నారు.
బావమరిది కోసం అమృత్ టెండర్ల ద్వారా అమృతం పంచి కొడంగల్ ప్రజలకు విషం పంచుతున్నారు. కొడంగల్ ప్రజలను ఫార్మా కోసం లాఠీ ఛార్జీ చేసి ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారు. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలు విధానాల పైన ధనదాహంపైన కొడంగల్ ప్రజలు చేసిన తిరుగుబాటు నిన్న చూశాము. పోలీస్ రక్షణ లేకుండా ముఖ్యమంత్రి కొడంగల్ పోయే పరిస్ధితి లేదు అని అన్నారు.
తమ కంపెనీ కోసం భూములు గుంజుకుంటే ప్రజలు తిరగపడుతున్నారు. కలెక్టర్‌ను కొట్టే పరిస్థితి తెలంగాణలో, ఏపీలో ఎప్పుడు జరగలేదు. ఒకవైపు కలెక్టర్ తనపై దాడి జరగలేదంటూ స్వయంగా చెప్తున్నప్పుడు మరి కేసులెందుకు, అరెస్టులెందుకో ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఢిల్లీకి వచ్చి జాతీయ మీడియా ముందు జాతీయ పార్టీల ముందు మీ పార్టీ అవినీతిని ఎండగడతాం. మంత్రి పొంగులేటి తాలూకు కంపెనీ పొందిన అవినీతి టెండర్లపైన కూడా ఢిల్లీకి వచ్చి భరతం పడతాం. స్వయంగా క్యాబినెట్లో కూర్చుండి తమ సొంత కంపెనీకి టెండర్లు ఇచ్చిన పొంగులేటి పదవి కూడా ఖచ్చితంగా పోతుంది అని కేటీఆర్ తెలిపారు.