ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్లకు సరిపడా ధాన్యం ఉన్నది. రాష్ట్రాలనుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వరిసాగుకాకుండా వేరే పంటలు పండించేలా రాష్ట్రాలు సూచనలు జారీచేయాలి. అని రెండేండ్ల కింద పార్లమెంట్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన వ్యాఖ్యలివి. తెలంగాణలో యాసంగి పంటను కొనమంటే కొనమని మొండికేసింది. అవసరమైతే తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అవహేళన చేసింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆందోళన చేసినా కేంద్ర సర్కారు కనికరించలేదు. దీంతో చేసేదేమీలేక రైతుల ధాన్యాన్ని తెలంగాణ సర్కారే కొనుగోలు జేసింది. అయితే, ఏడాదిన్నరకే కేంద్ సర్కారు నాలుక మడతేసింది. దేశంలో బియ్యం కొరత ఏర్పడిందని పేర్కొంటున్నది. నాడు పారాబాయిల్డ్ ఫుల్లుగా ఉన్నాయన్న మోదీ సర్కారు.. నేడు అవే బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. కేంద్ర సర్కారు అసమర్థ, ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రపంచ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు అన్నిరకాల బియ్యంపై ఆంక్షలు విధించాల్సిన దుస్థితి నెలకొన్నది. నాటి కేంద్రం సూచనతో రాష్ట్రాలు అన్నదాతల దృష్టిని వరినుంచి ఇతర పంటలకు మళ్లించాయి. దీంతో దేశంలో ధాన్యం కొరత ఏర్పడింది. అలాగే, కేంద్రం నిర్ణయం అన్నదాతలకూ శాపంగా మారింది. ధాన్యం బదులు ఇతరత్రా చిరుపంటలు పండించి, రైతులు నష్టాలబాటపట్టారు. కేంద్రం ముందుచూపులేమితో అటు అంతర్జాతీయంగా దేశం పరువు పోవడంతోపాటు ఇటు అన్నదాతలూ కష్టాలసాగు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
నాడు మోటర్లకు మీటర్లు.. నేడు సాగునీటిపై కేంద్రం పన్ను
తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశాలు జారీచేసింది. అలా చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని రాష్ట్రాలకు ఆశచూపింది. అయితే, సీఎం కేసీఆర్ రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించి.. ప్రోత్సాహకాలను వదులుకొని మరీ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వలేదు. ఇప్పుడు అదే కేంద్ర సర్కారు మరో చర్యతో రైతు నోట్లో మట్టికొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. నీటి దుర్వినియోగం, కొరత పేరిట అన్నదాతను దోపిడీ చేసేందుకు భారీ ప్లాన్ వేసింది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి నీటితీరువా వసూలుకు కసరత్తు చేస్తున్నది. అన్ని రాష్ట్రాలతో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ చేదువార్తను రాష్ట్రాలకు తెలియజేసింది. అయితే, ఎప్పటిలాగే తెలంగాణ సర్కారు ఈ సాగునీటిపై పన్ను ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పింది. సమగ్ర సాగునీటి విధానాలు పాటిస్తే రైతులపై ఎలాంటి పన్నులు విధించాల్సిన అవసరం లేదని కేంద్రానికి సూచించింది.