mt_logo

తెలంగాణ‌లో నిండుకుండ‌లా చెరువులు.. ఊరంతా సంబురాలు

  • మిష‌న్ కాక‌తీయ‌తో త‌టాకాల‌కు జ‌ల‌క‌ళ‌ 
  • రాష్ట్రంలో 12 వేల చెరువుల గుర్తింపు
  • తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ సంద‌ర్భంగా చెరువుల వ‌ద్ద వేడుక‌లు

హైద‌రాబాద్‌:  నాడు.. తెలంగాణ‌లో చెరువుల నిండా పూడిక‌.. వ‌ర్షాకాలం మాత్ర‌మే కాస్త నిండేవి. ఇక ఎండాకాలంలో వ‌ట్టిపోయి క‌నిపించేవి. చూద్దామ‌న్నా సుక్క‌నీరు క‌నిపించ‌క‌పోయేది. ఒక్కో ఏడాది క‌నీసం బ‌తుక‌మ్మ‌ల నిమ‌జ్జ‌నానికి కూడా చెరువుల్లో నీళ్లు ఉండేవి కావు. స‌మైక్య పాల‌కుల ప‌ట్టింపులేమితో మ‌న ఊర చెరువులు ఉత్త చెరువులుగా మారిపోయాయి. కానీ స్వ‌రాష్ట్రంలో మ‌న చెరువుల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో వాటి రూపురేఖ‌లే మారిపోయాయి. మిష‌న్ కాక‌తీయ‌లో భాగంగా పూడిక‌లు తీయ‌డంతో మండుటెండల్లోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇది తెలంగాణ ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న చారిత్రక గొలుసుకట్టు చెరువుల్ని చూస్తే ఇప్పుడు సంబురంగా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 43,870 చెరువుల్లో ప్రస్తుతం 500 లకు పైగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. 75-100 శాతం నిండుగా ఉన్న చెరువులు 8 వేలకుపైగా ఉండగా, 50-75 శాతం వరకు నిండుగా ఉన్న చెరువులు 10 వేలకుపైగా ఉండటం విశేషం. మిగిలిన చెరువుల్లో 50 శాతం మేర నీళ్లు ఉండటం గమనార్హం.

నిండుగా ఉన్న చెరువుల్లో అత్యధికం ఒక‌నాడు క‌రువుకు కేరాఫ్‌గా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉండటం విశేషం. వనపర్తి పరిధిలో 1000కి పైగా చెరువులు, మహబూబ్‌నగర్‌ పరిధిలో 2,500లకుపైగా చెరువులు, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 1,500లకుపైగా చెరువులు నిండుగా ఉన్నాయి. సగానికిపైగా చెరువుల్లో జలకళ ఉట్టి పడుతుండటం విశేషం. ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల ఫలితంగానే నేడు చెరువులు నిండుగా ఉన్నాయి. చెరువులను కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులతో అనుసంధానం చేయటంతో నిత్యం నీటితో కనువిందు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతోసహా ఎస్సారెస్పీ, దేవాదుల, కడెం, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధుల్లో ఏడాది పొడవునా చెరువులకు జీవం వచ్చింది.

నిండిన చెరువుల వ‌ద్ద ఆనందంగా వేడుక‌లు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న సాగునీటి దినోత్సవాన్ని, 8న చెరువుల పండుగను నిర్వహించాలని తెలంగాణ స‌ర్కారు నిర్ణయించింది. సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ఈఎన్సీ నాగేందర్‌రావు నేతృత్వంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, అడిషనల్‌ సెక్రటరీ శంకర్‌, అడ్మినిస్ట్రేషన్‌ సీఈ అనిత, ఎస్‌ఈ శ్రీనివాస్‌ సభ్యులుగా ఉత్సవాల మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గస్థాయిలో ఈఈని నోడల్‌ అధికారిగా, మండలస్థాయిలో డీఈఈని నోడల్‌ ఆఫీసర్‌గా..టెరిటోరియల్‌ చీఫ్‌ ఇంజినీర్లను నియమించింది. చెరువుల గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. 8న చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు, బోనాలు, బతుకమ్మ, ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టనున్నది. వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయటంతోపాటు ముఖ్యంగా మిషన్‌ కాకతీయ దాతలకు ప్రత్యేక ఆహ్వానాలను అందించాలని ఇరిగేషన్‌శాఖ నిర్ణయించింది. ఆ రెండు రోజులు మ‌న చెరువుల వ‌ద్ద తెలంగాణ సంస్కృతి ఉట్టిప‌డ‌నున్న‌ది. నిండా నీటితో త‌డ‌లుకొడుతున్న చెరువుల వ‌ద్ద తెలంగాన స‌మాజం ఆనందంగా పండుగ చేసుకోనున్న‌ది.